
సైబర్ మోసాలకు పోలీసు వారియర్‌ల కళ్లెం!
నేటి డిజిటల్ ప్రపంచంలో సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయి. రోజుకో కొత్త రకం సైబర్ నేరం వెలుగులోకి వస్తోంది. పెరిగిన సైబర్ నేరాలకు తెర వేసేందుకు తెలంగాణ పోలీసుశాఖ సైబర్ వారియర్లను రంగంలోకి దించింది. సైబర్ నేరాల బాగోతంపై ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రత్యేక కథనం...
కాదేది సైబర్ మోసానికి అనర్హం అంటూ పాస్‌పోర్టు డెలివరీ నుంచి ప్రజా పాలనలో ఆరు గ్యారంటీల పేరిట సైబర్ కేటుగాళ్లు వల విసురుతున్నారు. పాస్‌పోర్టు డెలివరీ మెసేజ్ పేరుతో ఓ వ్యక్తికి సైబర్ నేరగాడు కాల్ చేసి బురిడీ కొట్టించాడు. నైబర్ నేరగాడు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌కు చెందిన అవినాశ్ కు టెలిగ్రామ్‌లో లింక్ పంపి రూ.17.80 లక్షలు స్వాహా చేశారు. కమీషన్ బేస్‌తో ఆన్‌లైన్ ఉద్యోగం ఉందంటూ మెసేజ్ పంపించారు. లింక్ ఓపెన్ చేసిన అవినాశ్ అందులో పేర్కొన్నట్టుగా రూ.17.80 లక్షలు డిపాజిట్ చేసి వాళ్లు పెట్టిన టాస్క్ ఆడారు. ఈ ఆన్ లైన్ ఆటలో ఎలాంటి కమీషన్ రాకపోవడంతోపాటు ఆగంతకుడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో సైబర్ మోసమని గుర్తించి అవినాశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేశారా అంటూ...సైబర్ మోసం
మీరు ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేశారా? అంటూ ఫోన్ చేసి తెలంగాణలో సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసానికి తెర లేపారు. దీనిపై ఓటీపీ అడిగితే చెప్పవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ‘‘సర్ నమస్తే.. మేం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు కాల్ చేస్తున్నాం.. మీరు ఆరు గ్యారెంటీ పథకాలకు అప్లై చేసుకున్నారు కదా? అయితే మీకు ఆ పథకాలు వర్తించాలంటే మీ ఫోన్‌కి ఒక ఓటీపీ పంపుతున్నాం. దయచేసి ఆ నెంబర్ చెప్పండి. ఆ వెంటనే మీరు దరఖాస్తు చేసుకున్న స్కీం మీకు వర్తిస్తుంది’’ అని సైబర్ నేరగాళ్లు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
తస్మాత్ జాగ్రత్త...
ఈ తరహా ఫోన్ కాల్స్ వస్తే తస్మాత్ జాగ్రత్త అని అంటున్నారు తెలంగాణ పోలీసులు. పొరపాటున ఓటీపీ చెప్పారో మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు ఖాళీ అయినట్లేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆరు గ్యారెంటీల దరఖాస్తుదారులే అస్త్రంగా సైబర్ నేరగాళ్లు వల విసురున్నారు. ఇప్పటికే పలువురికి ఈ తరహా ఫోన్లు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఇలా పలువురికి ఈ తరహా ఫోన్లు రావడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆరా తీసిన పోలీసులకు ఇది సైబర్ నేరగాళ్ల పనేనని తేలింది. ఎవరికైనా ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే ఫోన్ కాల్ కట్ చేయమని చెబుతున్నారు.
రంగంలోకి సైబర్ వారియర్లు
పెచ్చుపెరిగిపోతున్న సైబర్ మోసాలకు కళ్లెం వేసేందుకు తెలంగాణ పోలీసు శాఖ సైబర్ వారియర్ లను కొత్తగా రంగంలోకి దించింది. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలంగాణలోని 858 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చి సైబర్ వారియర్లుగా పోలీసు స్టేషన్లలో నియమించింది. సైబర్ వారియర్లకు సైబర్ ఆర్థిక మోసాల నివారణపై శిక్షణ ఇచ్చారు. సైబర్ వారియర్లు పోలీసుస్టేషన్లు, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోల మధ్య సమన్వయ కర్తలుగా పనిచేస్తారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ చెప్పారు. సైబర్ వారియర్ల రాకతో తెలంగాణలో సైబర్ నేరాలకు తెరపడుతుందని కృష్ణ చైతన్య అనే సాఫ్ట్ వేర్ ఇంజినీరు చెప్పారు.
59 శాతం సైబర్ నేరాలు
సైబర్ నేరగాళ్లు డబ్బును దోచుకోవడానికి రోజుకో కొత్త మార్గాన్ని అవలంభిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ప్రభుత్వ ఉద్యోగులు అంటూ కేవైసీ అప్ డేట్, ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్ చేయడం, మీ బ్యాంకు ఖాతాను బ్లాక్ చేస్తామని బెదిరిస్తూ మీ ఖాతాల్లోని డబ్బును కొల్లగొడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న డిజిటల్ రంగంతోపాటు సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ అటాకర్ల చేతుల్లో నెటిజన్లు చిక్కి విలవిలలాడుతున్నారు. భారతదేశంలో గత సంవత్సరం 59 శాతం మంది సైబర్ నేరాల బారిన పడ్డారని సైబర్ పోలీసుల రికార్డులే వెల్లడించాయి. ఫిషింగ్, మాల్ వేర్, అకౌంట్ టేకోవర్ మోసాలు, సోషల్ మీడియా మోసాల బారిన పడకుండా నెటిజన్లు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.
ముందు జాగ్రత్తలే ముఖ్యం
ఫిషింగ్ ఈమెయిల్స్, సందేశాలు, నకిలీ ఇన్ వాయిస్‌లు, పాస్‌వర్డ్ రీసెట్ ల విషయంలో నెటిజన్లు జాగ్రత్తలు తీసుకోవాలి. అనుమానాస్పద లింకులను, తెలియని అటాచ్ మెంట్లను తెరవవద్దు. మాల్‌వేర్ ఇన్ స్టాలేషన్ ను నిరోధించడానికి యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేస్తున్నపుడు సురక్షితమైన వెబ్ సైట్ లను ఉపయోగించాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచించారు. సోషల్ మీడియా మోసాల బారిన పడకుండా ఉండేందుకు అపరిచితులతో స్నేహాలు వద్దని అంటున్నారు. భద్రతా లోపాలు లేకుండా, అప్రమత్తంగా ఉండటం ద్వారా సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకోకుండా ఉండవచ్చని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచించారు.
డేటింగ్ యాప్ వినియోగదారుల్లో సైబర్ మోసాల బాధితులు అధికం
డేటింగ్ యాప్ వాడే వారిలో 90 శాతం మంది సైబర్ మోసాల బారిన పడుతున్నారని కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫే వెల్లడించింది. భారతదేశంతో సహా ఏడు దేశాల్లో మెకాఫే తాజాగా జరిపిన సర్వేలో ఈ సైబర్ మోసాల బాగోతం వెలుగుచూసింది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సాయంతో నకిలీ ఖాతాలను సృష్టించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని మెకాఫే తెలిపింది. డేటింగ్ యాప్ వాడే వారిలో 65 శాతం మంది ఏఐ ఫొటోలను వినియోగిస్తున్నారని సర్వేలో తేలింది. డీపీలో ప్రొఫైల్ ఫొటోలు నకిలీవి పెడుతున్నారని వెల్లడైంది. వాలంటైన్స్ డే బహుమతులంటూ వచ్చే ఆన్ లైన్ లింకులపై క్లిక్ చేయవద్దంటూ మెకాఫే సూచించింది. హెచ్చరించింది. డబ్బులు పంపించమని వచ్చే మెసేజులను నమ్మవద్దని, మీరు తెలియని వారికి డబ్బును బదిలీ చేయవద్దని మెకాఫే కోరింది. నెటిజన్లు సైబర్ మోసాల బారిన పడకుండా స్కామ్ ప్రొటెక్షన్ టూల్స్ ఉపయోగించాలని మెకాఫే సూచించింది.
సైబర్ నేరాల నియంత్రణకు ‘సీడ్యాక్’
సైబర్ నేరాలను నియంత్రించేందుకు హైదరాబాద్ నగరంలోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) చర్యలు తీసుకుంటుందని ఆ కేంద్రం డైరెక్టర్ పీఆర్ లక్ష్మీ ఈశ్వరి చెప్పారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సీడ్యాక్ సైబర్ భద్రతకు ఎంకవచ్ 2 యాప్, ఎం పరీక్షన్, ఎం ప్రబంధ్ లాంటి పలు మొబైల్ సెక్యూరిటీ సొల్యూషన్లను అభివృద్ధి చేసిందని ఆమె పేర్కొన్నారు. డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలను గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించామని ఆమె వివరించారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో గత ఐదేళ్లలో 20 వేలమందికిపైగా ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని సీ డ్యాక్ అసోసియెట్ డైరెక్ర్ బి విజయలక్ష్మి చెప్పారు. ఎం కవచ్ 2 యాప్ గూగుల్ ప్లే స్టోరులో ఉందని, దీన్ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా స్మార్ట్ ఫోన్లకు రక్షణ కవచంలా ఉంటుందని సీడ్యాక్ ప్రాజెక్టు లీడర్ సునీల్ కుమార్ సూచించారు.
సైబర్ నేరాల బారిన పడితే 1930 నంబరుకు ఫోన్ చేయండి : సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ శిల్పవల్లి
సైబర్ నేరాల బారిన పడితే బాధితులు వెంటనే 1930 ఫోన్ నంబరుకు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సూచించారు. సైబర్ నేరం జరిగితే త్వరితగతిన ఫిర్యాదు చేస్తే బాధితులు కోల్పోయిన డబ్బును తిరిగి ఇప్పించవచ్చని సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ శిల్పవల్లి చెప్పారు. హైదరాబాద్ నగరంలో జరిగిన 63 సైబర్ మోసాల్లో బాధితులు 2.52 కోట్లు కోల్పోగా, వెంటనే తాము బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి ఆయా డబ్బును రాబట్టి, సైబర్ బాధితులకు ఇప్పించామని డీసీపీ శిల్పవల్లి ఎక్స్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.