ప్రశాంత్, పెద్ద మనసున్నోడు! నువ్వు నిజంగానే రైతు బిడ్డవు..
నవ్విన నాప చేనే పండడమంటే ఇదేనేమో.. పూట గడవక ప్రాణాలు తీసుకుందామనుకున్నోడు.. తగ్గేదేలా అనడానికి ఎన్ని గుండెలుండాలి
‘బిగ్‌బాస్ సీజన్-7’ విజేత ఓ రైతు బిడ్డ. పేరు ప్రశాంత్, ఊరు సిద్దిపేట జిల్లా కొల్గూరు. విన్నర్ కి బాగానే డబ్బులొస్తాయి. సినీనటుడు నాగార్జున ఓ 35 లక్షల రూపాయల చెక్ ఇచ్చారు. జాయ్ అలూకాస్ అనే జ్యూయలరీ సంస్థ వాళ్లు ఓ 15 లక్షల రూపాయల ఓచర్ ఇచ్చారు. ఇంకో సంస్థ ఓ మోడల్ కారు ఇచ్చింది. ఇలా ఏవైతేనేం ఓ కోటి వరకు వస్తాయంటారు.
నీది పెద్ద మనసురా బిడ్డా...
ఇంతడబ్బు వస్తున్నప్పుడు మామూలు మనుషులైతే ఏమంటారు? ఇల్లు కొనుక్కుంటామనో, తల్లిదండ్రులకు కావాల్సినవి కొనిపెడతామనో, ప్రియురాలికి నగలు నట్రా చేయిస్తామనో.. లేదా ఇంకేదైనా చేస్తామనో అంటారు. కానీ ఈ యువకుడిది పెద్ద గుండెనుకుంటా.. పూట గడవడమే కష్టమై ప్రాణాలు తీసుకుందామనుకున్న ఈ రైతు బిడ్డ తనకు వచ్చిన 35 లక్షల రూపాయలను తన చుట్టుపక్కల బాధ పడుతున్న రైతులకు పంచుతానన్నాడు. అందరి మనసులు కొల్లగొట్టాడు.
తగ్గేదేలా, బరాబర్ పంచుతా...
ఓ రైతుకే మరో రైతు కష్టాల్, నష్టాల్ తెలుస్తాయని నిరూపించాడు. తిండికి ఇబ్బంది పడే మనిషి ఇంత డబ్బును పంచడానికి ఎంత పెద్ద గుండె కావాలి! “సువిశాల భారత దేశంలో ప్రతి పూటా ఓ రైతు కన్నుమూస్తున్నాడు, వాళ్లను నేను ఆదుకోకపోతే మరెవరు ఆదుకుంటారు, నేను గెలిస్తే ఆ డబ్బును రైతులకు పంచుతానని మాటిచ్చా. ఇప్పుడు గెలిచా, తగ్గేదేలా“ అని ఆ కుర్రాడు ప్రశాంత్ సగర్వంగా వేదికపై చెబుతున్నప్పుడు ప్రేక్షకులు చప్పట్లతో మార్మోగించారు. లేచి నిలబడి సెల్యూట్ చేశారు. ప్రశాంత్ తల్లిదండ్రులు ఉబ్బితబ్బియ్యారు. ఏమైనా నువ్వు గ్రేట్ ప్రశాంత్.. అని వేనోళ్ల కొనియాడేలా చేశాడు.
సిద్దిపేట టూ బిగ్ బాస్..
పల్లవి ప్రశాంత్.. ఫైనలిస్టుల పేర్లు ప్రకటిస్తున్నప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చెప్పినట్టు అతను భూమి పుత్రుడు. భూ ప్రశాంత్. తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. భూమిని నమ్ముకున్నాడు. బిగ్ బాస్ ని గెలుచుకున్నాడు. నేలకు కొట్టిన బంతిలా నవ్విన నాపచేనే పండేలా చేశాడు.
పల్లవి ప్రశాంత్‌ది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు. తండ్రి పేరు సత్తయ్య, సాదాసీదా రైతు. తల్లి మామూలు గృహిణి. ప్రశాంత్ కనాకష్టం మీద డిగ్రీ వరకూ చదివారు. చిన్నప్పటి నుంచే ఆటపాటలంటే ఇష్టం. యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని పేరు సంపాయించాడు. స్నేహితుల మధ్య గొడవొచ్చి అప్పటి వరకు వచ్చిన డబ్బును, ఛానల్‌నూ వదులుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. తండ్రికి విషయం తెలిసి ‘బిడ్డా నువ్వు అలాంటి పని చేస్తే మేమూ బతకం. మళ్లీ నువ్వు చేయాలనుకున్నది చెయ్. నేను నీకు అండగా ఉంటా’ అని చెప్పడంతో ప్రశాంత్ పొలం బాట పట్టాడు.
భూమిని నమ్మి చెడినోళ్లు తక్కువే...
రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను వీడియోలుగా తీసి, సోషల్‌మీడియాలో పంచుకోవడంతో నెమ్మదిగా ప్రశాంత్‌కు అభిమానులు పెరిగారు. ‘అన్నా.. రైతు బిడ్డను..’ ‘అన్నా మళ్లొచ్చినా.. ’ అంటూ పల్లవి ప్రశాంత్ తనదైన శైలిలో చెప్పే డైలాగ్‌లు, పలికించే హావభావాల వీడియోలు వైరల్ అవడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో ‘బిగ్‌బాస్’ షోపై ఆసక్తి పెరగడంతో ‘ఎప్పటికైనా బిగ్‌బాస్ షోకు వెళ్తా’ అంటూ మరికొన్ని వీడియోలు చేయడం మొదలు పెట్టాడు.
పట్టువదలని విక్రమార్కుడిలా...
‘బిగ్‌బాస్’ కొత్త సీజన్ మొదలు పెడుతున్నారని తెలియగానే అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరిగేవాడు. తండ్రి ఇచ్చిన డబ్బులు అయిపోతే, పస్తులుండి అవకాశాల కోసం తిరిగాడు. అలా గత రెండు సీజన్‌లకు ప్రయత్నించినా అవకాశం దక్కలేదు. మరోవైపు ఊరికి వచ్చి, ఇదే విషయాన్ని స్నేహితులతో పంచుకుంటే ‘నువ్వు బిగ్‌బాస్ వెళ్లడమా.. అది అయ్యే పని కాదులే’ అంటూ ఎగతాళి చేసేవారట. అయినా కూడా అవేవీ పట్టించుకోకుండా వీడియోలు చేసి, ‘ఇవి నాగార్జున గారి వద్దకు వెళ్లే వరకూ షేర్ చేయండి’ అంటూ నెటిజన్లను కోరడంతో అవి కాస్త ట్రెండింగ్ అయ్యాయి. ఎట్టకేలకు సీజన్-7 కోసం బిగ్‌బాస్ టీమ్ ప్రశాంత్‌ను సంప్రదించడంతో తాను అనుకున్న కల నెరవేరిందని తెగ సంబరపడిపోయాడు. తండ్రి వద్ద రూ.500 తీసుకుని హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ బిగ్‌బాస్ షో కోసం ఆడిషన్స్ ఇచ్చి యూట్యూబర్‌గా ‘రైతు బిడ్డ’గా అడుగు పెట్టాడు. విజేతగా నిలిచాడు.
షోలో ఎన్నో నేర్చుకున్నా...
ఓ పల్లెటూరి మనిషి ఎలా ఉంటాడో అలా ఉండే ప్రశాంత్ కి అదే ప్లస్, అదే మైనస్ అయింది. ఈ పిలగాడిని ప్రమోట్ చేస్తే బాగుంటుందని సామాన్య జనం ఆదరిస్తే ఇతన్ని బయటికి ఎలా పంపాలా అని హౌజ్ లోని వాళ్లు ఆలోచించేవారట. ‘పుష్ప’లో అల్లు అర్జున్ ఫోజులో నిలబడి తనని నామినేట్ చేసిన వాళ్లకు కౌంటర్ ఇచ్చేవాడు. నామినేషన్స్‌లో ఎంత ఫైర్‌గా ఉండేవాడో, ఆటలోనూ అదే స్పిరిట్ చూపించేవాడు.
నాగార్జున ఇచ్చిన మిరప మొక్కే గెలిపించిందా..
‘బిగ్‌బాస్ సీజన్-7’లోకి అడుగు పెట్టే ముందు వేదికపై తన పొలంలోని మట్టి, తాను పండించిన బియ్యాన్ని నాగార్జునకు గిఫ్ట్‌గా ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. దానికి బదులుగా నాగార్జున ఒక మిరప మొక్కను అతనికిచ్చి, ‘దీన్ని బాగా చూసుకో. కాయలు కాస్తే, అందుకు తగినట్లు నీకు స్పెషల్ గిఫ్ట్‌లు ఇస్తా’ అని చెప్పారు. అయితే, కొన్ని రోజులకు ఆ మొక్క ఎండిపోవడంతో నాగార్జున చివాట్లు పెట్టి, మరో మొక్కను పంపారు. దాన్ని సీజన్ చివరి వరకూ జాగ్రత్తగా పెంచాడు. ఇప్పుడదే పూత, పిందె దశకు వచ్చింది. నిజంగానే ప్రశాంత్ కి కానుకలు తెచ్చింది. 107 రోజుల బిగ్ బాస్ 7 సీజన్ ముగిసింది.