తెలంగాణలో ఆరు రోజుల పాటు వర్షాలు..ఎల్లోఅలర్ట్ జారీ
x
చార్మినార్ చెంత కురుస్తున్న వర్షం (ఫోటో క్రెడిట్ : స్కైమెట్)

తెలంగాణలో ఆరు రోజుల పాటు వర్షాలు..ఎల్లోఅలర్ట్ జారీ

తెలంగాణ ప్రజలకు ఐఎండీ చల్లటి కబురు చెప్పింది. ఆరురోజుల పాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడంతోపాటు రుతు పవనాలు ప్రవేశించనున్నట్లు ఐఎండీ తెలిపింది.


తెలంగాణలో శనివారం నుంచి రానున్న ఆరు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో తెలంగాణలో మే 23వతేదీ వరకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

పిడుగులు పడే అవకాశం ఉన్న జిల్లాలు : తెలంగాణలోని అన్ని జిల్లాల్లో శనివారం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల సందర్భంగా పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. మే 18, 19 తేదీల్లో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, మల్కాజిగిరి, భువనగిరి, జనగాం, వరంగల్, ములుగు, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్‌కుండల్‌, వనపర్తి , ఖమ్మం, కొత్తగూడెంలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

మే 18న పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు
మే 18వతేదీ శనివారం తెలంగాణ రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ అధికారులు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

మే 19వతేదీన గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
మే 19వతేదీన తెలంగాణలోని పలు జిల్లాల్లో గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

మే20వతేదీన ఉరుములు, మెరుపులతో వర్షాలు
మే 20వతేదీన తెలంగాణలోని 9 జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి.

మే 21,22,23 తేదీల్లో మూడు రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో మే 21 నుంచి 23వతేదీ వరకు మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్త ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆయన పేర్కొన్నారు. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని ధర్మరాజు వివరించారు.

అధికారులను అప్రమత్తం చేసిన సీఎం
తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్‌ కేంద్రం చేసిన సూచనల నేపథ్యంలో తెలంగాణ అధికారులు అప్రమత్తమయ్యారు.వాతావరణ కేంద్రం సూచనల దృష్ట్యా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో అన్ని శాఖల అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో వర్షాల పరిస్థితులను సీఎం సమీక్షించారు.

జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్
భారీవర్షాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రజల కోసం టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ ల సహాయం కోసం 040-21111111 లేదా 9000113667 నంబర్‌లకు కాల్ చేయవచ్చునని అధికారులు చెప్పారు. వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.

హైదరాబాద్‌లో ఆహ్లాదకర వాతావరణం
హైదరాబాద్‌లో ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. రానున్న ఆరు రోజులపాటు హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. హైదరాబాద్‌లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో శనివారం ఉదయం నగరవాసులు ఆహ్లాదకరంగా ఉల్లాసంగా గడిపారు. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

రైతులకు వాతావరణశాఖ సలహాలు
భారీ వర్షాల కారణంగా నీటిలో తడిసిన వరిని సురక్షిత ప్రదేశాల్లో ఎండబెట్టాలని రైతులకు ఐఎండీ అధికారులు సూచించారు.గాలి వల్ల పడిపోయిన పండ్లను సేకరించి, వాటిని మార్కెట్‌కు రవాణా చేయాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద పశువులు, మేకలు, గొర్రెలను నిలపవద్దని రైతులకు సూచించారు. మెరుపులు, ఉరుములతో కూడిన గాలివాన దృష్ట్యా ప్రజలు నీటి వనరుల నుంచి దూరంగా ఉండాలని కోరారు.

రుతు పవనాలు కేరళను ఎప్పుడు తాకుతాయంటే...
మే 19వతేదీకల్లా రుతుపవనాలు అండమాన్ వద్ద సముద్రంలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. మే 31వతేదీకల్లా రుతుపనాలు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అధికారులు చెప్పారు. జూన్ నుంచి సెప్టెంబరు దాకా అరేబియా సముద్రం నుంచి నైరుతి దిశగా హిమాలయాల వైపు గాలులు వీస్తాయి. దీని ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ప్రభావం వల్ల జూన్ - సెప్టెంబరు నెలల్లో 70 శాతం వర్షపాతం నమోదు అవుతుందని వారు పేర్కొన్నారు.

ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగుకు అనుకూలం: వ్యవసాయ శాస్త్రవేత్త ఎన్డీఆర్కే శర్మ
ఈ ఏడాది రుతుపవనాలు ముందుగా ప్రవేశించడంతో పాటు సమృద్ధిగా వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఖరీఫ్ పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందని తాము అంచనా వేసినట్లు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎన్డీఆర్కే శర్మ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రుతుపవనాలు ప్రవేశించనున్నాయని ఐఎండీ ప్రకటనతో రైతులు ఖరీఫ్ సాగుకు విత్తనాలు తీసుకొని సమాయత్తం అవుతున్నారని శర్మ పేర్కొన్నారు. అక్టోబరు నెలలో ఈ గాలులు వ్యతిరేక దిశలో వీస్తాయని, దీనివల్ల దక్షిణ భారతదేశంలో అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. లానినా వల్ల భారతదేశంలో అధిక వర్షాలు కురుస్తాయని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.



Read More
Next Story