సహారా ఎడారిలో 50 ఏళ్ళలో మొదటిసారి వరదలు: గ్లోబల్ వార్మింగ్ ప్రభావం?
సహారా ఎడారిలో ఇంతకుముందు చివరిగా 1974లో వర్షాలు కురిశాయి. ఇప్పుడు ఈ అసాధారణ పరిణామానికి కారణం గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ అని నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలంలో కూడా చుర్రుమంటున్న ఎండలను మనం చూస్తూనే ఉన్నాము. ఈ అనూహ్య వాతావరణ పరిస్థితులు మనకే కాదు ప్రపంచమంతా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత బీడు భూమి, పొడి ప్రాంతంగా పేరుపడిన సహారా ఎడారిలో గత 50 ఏళ్ళలో ఎన్నడూ లేనంత భారీవర్షపాతం నమోదయింది. కేవలం రెండు రోజులలోనే ఎడారి అంతా ఇప్పుడు పచ్చగా మారిపోయింది. ఇసుక తిన్నెలు అన్నీ నీటిలో మునిగిపోయాయి. సహారా ఎడారిలో ఇంతకుముందు చివరిగా 1974లో వర్షాలు కురిశాయి. ఇప్పుడు ఈ అసాధారణ పరిణామానికి కారణం గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ అని నిపుణులు చెబుతున్నారు.
సహారా ఎడారి ప్రపంచంలో రెండో అతి పెద్ద ఎడారి. ఆఫ్రికాలోని అల్జీరియా, చాద్, ఈజిప్ట్, లిబియా, మాలి, మొరాకో, టునీషియా, సూడాన్ వంటి పన్నెండు దేశాలలో వ్యాపించిఉంది. భారీ వర్షాలకు బాగా ప్రభావితమైనది మొరాకో దేశం. ఈ వర్షాలతో ఇక్కడ దాదాపు 100 సంవత్సరాలుగా ఎండిపోయి ఉన్న ఇరాకి అనే సరస్సు తిరిగి ప్రాణం పోసుకుంది. స్థానిక రైతులకు ఈ వర్షాలు ఊరట కలిగించినప్పటికీ, నష్టం కూడా బాగానే కలగజేశాయి. వరదల కారణంగా కనీసం 18 మంది చనిపోయారు. సాధారణంగా సహారా ఎడారిలో బాగా వర్షం కురవటం అంటే 0.5 సెం.మీ. అయితే ఇప్పుడు కేవలం 24 గం. వ్యవధిలోనే పది సెం.మీ. వర్షపాతం నమోదయింది.