ప్రగతి భవన్ విముక్తి! ప్రజల కోసం తలుపులు బార్లా తెరవండి!
x
CM SINGNED PAPERS

ప్రగతి భవన్ విముక్తి! ప్రజల కోసం తలుపులు బార్లా తెరవండి!

ముఖ్యమంత్రి రేవంత్ తొలి ఆదేశం ఇచ్చారు. జనానికి అందుబాటులో లేని ప్రగతి భవన్ చుట్టూ వేసిన ఇనుప కంచెల్ని, గోడల్ని తొలగించమన్నారు. తొలి ప్రసంగంలో ఏమన్నారంటే..


ప్రజల ప్రవేశానికి అవకాశం లేని ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ముళ్ల కంచెల్ని తొలగించండి, ప్రగతి భవన్ ద్వారాలు ప్రజల కోసం బార్లా తెరిచి ఉంచండి, ఇది నా ఆదేశం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన తొలి ప్రసంగంలో ఆయన ఈ ఆదేశాలు ఇచ్చారు. శుక్రవారం ఉదయం పది గంటల కల్లా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.

తెలంగాణ ప్రజలకు ఇవాళ స్వేచ్ఛ..

తెలంగాణ ప్రజలకు ఇవాళే స్వేచ్ఛ లభించిందని.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించింది తొలిసారి ఆయన మాట్లాడారు.

ప్రసంగం ఇలా సాగింది...

‘‘ప్రజా ప్రభుత్వం ఏర్పాటుతో ఇక అంతటా సమానాభివృద్ధి సాధ్యం. తెలంగాణ ఆషామాషీగా ఏర్పడిన రాష్ట్రం కాదు. పోరాటాలతో త్యాగాలే పునాదులుగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. పదేళ్లుగా నిరంకుశత్వాన్ని రాష్ట్ర ప్రజలు మౌనంగా భరించారు. ఇప్పటికే ప్రగతిభవన్‌ ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించాం. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చుదిద్దుతాం. శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తాం. మీ బిడ్డగా.. మీ సోదరుడిగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. మేం పాలకులం కాదు.. మీ సేవకులం. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తుపెట్టుకుంటా. పదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటా. విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తా’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు.

రజనీకే తొలి ఉద్యోగం..

నాంపల్లి నియోజకవర్గం బోయిగూడ కమాన్‌ ప్రాంతానికి చెందిన రజినీ అక్టోబరు 17న గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డిని కలిశారు. దివ్యాంగురాలిని కావడంతో తనకు ఉద్యోగం లభించడం లేదని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. రజినీ, ఆమె కుటుంబసభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ 6 గ్యారెంటీల కార్డును సంతకం చేసి ఇచ్చారు. తాను సీఎం అయ్యాక తొలి ఉద్యోగం రజనీకే ఇస్తానని హామీ ఇచ్చారు. మొత్తానికి రేవంత్ ఇచ్చిన హామీను అక్షరాల నిజం చేసి చూపించారు. తెలంగాణ నిరుద్యోగులకు ఒక భరోసాను ఇచ్చారు. ఈ పరిణామాలను ప్రశంసిస్తూ రేవంత్‌కు ప్రజలు జేజేలు కొడుతున్నారు. పీజీ పూర్తై 11 సంవత్సరాల తర్వాత రజనీకి ఉద్యోగం లభించింది. ఉద్యోగం రావడంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కొత్త ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.


Read More
Next Story