పాలనపై తొలిరోజే శ్రద్ధ పెట్టిన రేవంత్ సర్కార్
x

పాలనపై తొలిరోజే శ్రద్ధ పెట్టిన రేవంత్ సర్కార్

తెలంగాణలో నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తొలి మంత్రి వర్గ సమావేశం జరిగింది. శుక్రవారం నుంచే ప్రగతి భవన్లో ప్రజా దర్బార్ జరుగుతుంది.


వ తెలంగాణలో నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. యువ రాష్ట్రమైన తెలంగాణకు యువ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చెపట్టారు. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క మల్లుతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణాలు చేశారు. తొలి మంత్రి వర్గ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పెట్టిన 6 హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. పురాతన కోటల్ని తలపిస్తున్న ప్రగతి భవన్, సెక్రటేరియట్లను ప్రజలకు చేరువ చేసేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. శుక్రవారం నుంచే ప్రగతి భవన్లో ప్రజా దర్బార్ జరుగుతుంది.

రేవంత్ టీమ్ ఇదీ..


మంత్రులుగా ప్రమాణం చేసిన 11 మందికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాఖలు కేటాయించారు. డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రెవెన్యూశాఖ. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మున్సిపల్‌ శాఖ, డి.శ్రీధర్‌బాబుకు ఆర్థికశాఖ కేటాయించారు. నీటి పారుదల శాఖను పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, మహిళా సంక్షేమశాఖను కొండా సురేఖకు, వై ద్య ఆరోగ్య శాఖను దామోదర రాజనర్సింహకు అప్పగించారు. జూపల్లి కృష్ణారావుకు పౌ రసరఫరాల శాఖ, పొన్నం ప్రభాకర్ కి బీసీ సంక్షేమ శాఖ, సీతక్కకు గిరిజన సంక్షేమశాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాల శాఖను కేటాయించారు.

ఆరు గ్యారంటీలపైనే రేవంత్‌ తొలి సంతకం


తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్‌రెడ్డి రెండు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీల ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక ఉత్తర్వులపై రెండో సంతకం చేశారు. ఆ తర్వాత నేరుగా సచివాలయానికి వెళ్లారు. తొలి క్యాబినెట్ మీటింగ్ పెట్టారు.

దళిత వర్గానికి స్పీకర్ పదవి..


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిభా భారతి తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి దళితునికి శాసనసభ స్పీకర్ పదవిని కాంగ్రెస్ అప్పగించింది. నూతన స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు.

అప్పుడు హామీ ఇచ్చి.. ఇప్పుడు నెరవేర్చి..


ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాంపల్లి నియోజకవర్గంలోని బోయిగూడ కమాన్‌ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన రజినీకి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. రిటైర్డు ఉద్యోగి అయిన వెంకటస్వామి, మంగమ్మ దంపతులకు మొదటి సంతానం రజిని. దివ్యాంగురాలైన ఆమె కష్టపడి పీజీ వరకు చదివింది. ఉన్నత చదువు పూర్తి చేసినా ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. గతంలో గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని కలిసి ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని రజినీకి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన రేవంత్‌.. నేడు ఆమెకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందించారు.

తరలివచ్చిన నేతలు...

రేవంత్ పట్టాభిషేకానికి కాంగ్రెస్ అధిష్టానమంతా హస్తిన నుంచి తరలివచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అధినేత్రి సోనియా గాంధీ, యువ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మొదలు ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన పలువురు ప్రముఖులు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా మంత్రులతో ప్రమాణం చేయించారు.

వెల్లువెత్తిన అభినందలు

పదేళ్ల పసికూన తెలంగాణకు రెండో సీఎంగా ప్రమాణం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డికి దేశ నలుమూలల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, పలువురు సినీనటులు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లాంటి వారందరూ రేవత్ కు అభినందలు తెలిపిన వారిలో ఉన్నారు.

ముహూర్తానికి జరగని ప్రమాణం

నిర్ణయించిన ముహూర్తం మధ్యాహ్నం 1.04 గంటలకు కాకుండా గురువారం మధ్యాహ్నం 1.22 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమానికి ఎల్బీ స్టేడియం వేదికైంది. , కాంగ్రెస్ ఇచ్చిన సోనియా మెచ్చిన తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాత హస్తం పార్టీ అధికార పీఠాన్ని అధిష్టించింది. 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలనే నినాదంతో మార్మోగిన తెలంగాణకు మూడో ముఖ్యమంత్రిగా రెండో వ్యక్తి ప్రమాణ స్వీకారం చేశారు.

శుక్రవారం నుంచే ప్రజాదర్బార్...

ముఖ్యమంత్రి రేవంత్ తన తొలి ప్రసంగంలో చెప్పినట్టే ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచెల్ని తొలగించారు. ప్రజలు నేరుగా ప్రగతి భవన్ లోకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం నుంచే ప్రజా దర్బార్ జరుగుతుంది.

స్వయంగా ఫోన్లు చేసి ధన్యవాదాలు చెప్పిన రేవంత్

తన ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన ప్రముఖులందరికీ రేవంత్ స్వయంగా ఫోన్లు చేసి ధన్యవాదాలు చెప్పారు.

Read More
Next Story