"సొమ్ము సౌత్ ది, సోకు నార్త్ దా, కుదరదు"
తెలంగాణనుంచి కేంద్రానికి రు.1 వెళితే, వెనుకకు వచ్చేది 40 పైసలేనని, అదే సమయంలో యూపీనుంచి, బీహార్ నుంచి కేంద్రానికి రూపాయి వెళితే రు. 7, రు. 5 వెనక్కు వస్తున్నాయని రేవంత్ వివరించారు.
ఉత్తరాది-దక్షిణాది చర్చ మరోసారి మొదలయింది. ఈ సారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చర్చకు తెర తీశారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. సంపదను సృష్టించేది దక్షిణాది రాష్ట్రాలయితే, అనుభవిస్తున్నదేమో ఉత్తరాది రాష్ట్రాలని రేవంత్ విమర్శించారు. పన్నుల వాటాలలో దక్షిణాది రాష్ట్రాలకు హక్కుగా రావలసిన వాటాపై కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఐకమత్యం అవసరమని రేవంత్ వ్యాఖ్యానించారు.
ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ హైదరాబాద్‌లో దక్షిణాది అభివృద్ధిపై నిర్వహించిన ఒక సదస్సులో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే, కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలనుంచి పన్నుల రూపేణా అధిక ఆదాయం వస్తున్నాకూడా, దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంనుంచి అందేది చాలా తక్కువని ఆరోపించారు. దేశ జీడీపీలో దక్షిణాది వాటా 30 శాతం ఉందని, జనాభా 16 శాతం అని చెప్పారు. దక్షిణాదికి జనాభా ప్రాతిపదికన కాకుండా, పన్నుల చెల్లింపు ప్రాతిపదికగా నిధులు కేటాయించాలని అన్నారు. దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని దక్షిణాది రాష్ట్రాలు అప్పట్లో కుటుంబ నియంత్రణను పాటించాయని చెప్పారు. అప్పుడు కుటుంబ నియంత్రణను పాటించని ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పుడు లబ్ది పొందుతున్నాయని అన్నారు.
దక్షిణాది రాష్ట్రాల ఐకమత్యంగా ఉండాలని, ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని రేవంత్ చెప్పారు. రాజకీయ కారణాలవల్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వం వహించలేకపోతున్నారని, ఎన్‌డీఏతో పొత్తువల్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు రావటంలేదని అన్నారు. అవసరమైతే తానే నాయకత్వం వహిస్తానని, దక్షిణాది రాష్ట్రాల ఐక్యత, అభివృద్ధికోసం పోరాటం కొనసాగిస్తామని రేవంత్ చెప్పారు.
తెలంగాణనుంచి కేంద్రానికి రు.1 వెళితే, వెనుకకు వచ్చేది 40 పైసలేనని, అదే సమయంలో యూపీనుంచి కేంద్రానికి రూపాయి వెళితే రు. 7 వెనక్కు వస్తున్నాయని, బీహార్ నుంచి కేంద్రానికి రూపాయి వెళితే, రు. 5 వెనక్కు వస్తున్నాయని రేవంత్ వివరించారు. మోదీ ప్రభుత్వం పార్టీలను, ప్రభుత్వాలను విడగొట్టటంతప్ప దేశానికి, ప్రజలకు చేసిందేమీ లేదని, దేశంలో ఉత్తర-దక్షిణ విభజన తేవటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మూసీ అభివృద్ధికి బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు అడ్డుపడుతున్నాయని రేవంత్ ప్రశ్నించారు. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకోలేదా అని అడిగారు. తాము గుజరాత్‌కు పోటీ ఇవ్వబోతున్నామని చెప్పారు. తాను ఫ్యూచర్ సిటీ నిర్మిస్తే తప్పేమిటని అన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే కేసీఆర్ ఎందుకు బయటకు రావటంలేదని రేవంత్ ప్రశ్నించారు.
దక్షిణాదిపై కేంద్ర ప్రభుత్వ వివక్షపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కొంతకాలం క్రితం ధ్వజమెత్తారు. దక్షిణ భారతదేశంలో కూడా రెండో రాజధాని ఏర్పాటవ్వాలని, ఏదో ఒకరోజు దక్షిణాది రాజకీయ పార్టీలన్నీ ఒక్కటై తమ గళం వినిపించే రోజు వస్తుందని పవన్ ఆ రోజున అన్నారు. జాతీయ రాజకీయాలలో బీహార్, ఉత్తర ప్రదేశ్‌ల పెత్తనానికి స్వస్తి చెప్పాలని పవన్ ఆనాడు పిలుపునిచ్చారు.