తొలి రోజు తడబడ్డా మలిరోజుకు రేవంత్‌దే పై ’చేయి’
x
గ్రాఫిక్ ఇమేజ్ (ఫైల్)

తొలి రోజు తడబడ్డా మలిరోజుకు రేవంత్‌దే పై ’చేయి’

నిన్నటి వరకు అధికార పక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా- ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడం వల్లనేమో- ప్రతిపక్షంలోనూ చక్కగా ఇమిడిపోయారు


తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ తొలి విడత సమావేశాలు ముగిశాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తొలి సమావేశాలు ఇవే. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఎంపిక, ప్రమాణం తర్వాత కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో డిసెంబర్ 9న మొదలైన తొలి శాసనసభ సమావేశాలు 21వ తేదీతో జరిగాయి. దళిత వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ని చేసిన కాంగ్రెస్ పార్టీ ఆయన ఆధ్వర్యంలో సభ వాడివేడిగా సాగింది. చలికాలంలోనూ శాసనసభ సమావేశాలు మంటలు పుట్టించాయి. శాసనసభా నాయకునిగా ప్రతి ముఖ్యమంత్రి చేసే పనే పనినే రేవంత్ రెడ్డి కూడా చేశారు. ఆయన కనుసన్నలలోనే సభ నడిచింది. నిన్నటి వరకు అధికార పక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడం వల్లనేమో ప్రతిపక్షంలోనూ చక్కగా ఇమిడిపోయారు. ఒద్దికగా రెచ్చిపోయారు.

పై చేయి సాధించిన కాంగ్రెస్...

ముఖ్యమంత్రి రేవంత్ సహా చాలామంది కొత్త వాళ్లే అయినా సభను కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు బాగానే రక్తి కట్టించారు. సభ జరిగిన ఆరు రోజుల్లో చివరి రెండు రోజులు చాలా కీలకమయ్యాయి. శ్వేత పత్రాలు, స్వల్పకాలిక చర్చలతో సభ మార్మోగింది. ఈనెల 20న సభలో రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై శ్వేత పత్రాన్ని ప్రవేశపెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ దాటికి తట్టుకోలేక ఆత్మరక్షణలో పడినట్టు కనిపించిన అధికార కాంగ్రెస్ పక్షం రెండో రోజుకు తిప్పుకుంది. వ్యూహ లోపం ఎక్కడుందో పసిగట్టి ఆ మర్నాడు సభలో రెచ్చిపోయింది. విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టి పై చేయి సాధించింది. బీఆర్ఎస్ పాలనలోని లోపాలను, ఆర్ధిక అవకతవకలను ఎత్తిచూపింది. వ్యూహాం ప్రకారం బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి మాజీలను ముగ్గులోకి దింపి పనికానిచ్చింది. ఒక కాంగ్రెస్ మంత్రి సభలో ఆరోపణలు చేయడం దానిపై సంబంధిత వ్యక్తి మాట్లాడేలా చేయడం, మరో మంత్రి రెచ్చగొట్టడం చేసి సవాళ్లు చేయించేలా ట్రాప్ లోకి లాగారు. అసలు విషయాన్ని ఆరా తీసేలా న్యాయవిచారణకు సీఎం రేవంత్ ఆదేశించడం చకచకా జరిగాయి. నిజానికి రాష్ట్ర మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆ ట్రాప్ లో పడ్డట్టే కనిపించారు. ఆర్ధిక శ్వేత పత్రంపై చర్చలో బీఆర్ఎస్ నేతలు కల్వకుంట్ల తారక రామారావు, హరీశ్ రావు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడంలో అధికార పక్షం తడబడింది. ఒక సందర్భంలో ఆత్మరక్షణలో పడినట్టు కూడా కనిపించింది. రెండో రోజుకు మాత్రం కోలుకుంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెల్లమొహం వేశారా...

“పదేళ్ల పాలనలో అప్పులపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జవాబు చెప్పలేక తెల్లమొహం వేశారు. రేషన్‌బియ్యం పంపిణీ మొదలు రైతులకు మద్దతు ధర, విద్యావ్యవస్థ వంటి వాటిపై సభలో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలే పరిస్థితి ఏర్పడింది. దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ, ఎస్సీ, ఎస్టీలకు నిధుల కేటాయింపుపై సమాధానం చెప్పలేకపోయారు” అన్నారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు. శాసనసభ సమావేశాలు వాయిదా పడిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి... కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో తాము రాష్ట్ర ఆర్థిక అంశాలు ప్రజల ముందు ఉంచామన్నారు.

బీఆర్ఎస్ తప్పుల్ని ఎత్తిచూపడమే లక్ష్యంగా...

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన ఎలా సాగిందో తెలియజెప్పడానికే అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. అప్పులు కుప్పలుగా పేరుకుపోయిన మాట నిజమే. ఆ విషయాన్నిబీఆర్ఎస్ తో ఒప్పించాలని కాంగ్రెస్, ప్రజల కోసమే చేశామని చెప్పేలా బీఆర్ఎస్ ప్రయత్నం చేశాయి. “ప్రభుత్వపరంగా చేసిన వ్యయం వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని వారు (బీఆర్ఎస్) ఒప్పుకున్నారు. గత ప్రభుత్వ పాలన కారణంగా రాష్ట్రంలోని ప్రతి యువకుడిపై రూ.7లక్షల అప్పు మోపారు” అన్న శ్రీధర్ బాబు మాటల్ని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు చీల్చిచెండాడారు. “ రాష్ట్ర విభజనకు ముందున్నది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదా.. కాంగ్రెస్ కు 50 అధికారం ఇస్తే తెలంగాణను సర్వం నాశనం చేసింది. దాన్ని చక్కదిద్ది ప్రజల ఆదాయాన్ని పెంచడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి కృషి చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ను అనే హక్కు లేదు” అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు.

లెక్కల్లో తప్పుల్లేవన్న శ్రీధర్ బాబు...

శ్వేతపత్రాల్లో ప్రస్తావించిన లెక్కల్లో తప్పులున్నాయంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు.“ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుచూపుతో విద్యుత్‌రంగంలో చర్యలు చేపట్టకపోతే ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 12 గంటల కరెంట్‌ ఇవ్వగలిగేది కాదు. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాల్లో లెక్కలు, తప్పులు అనేది అవాస్తవం... తేదీలు వెయ్యలేదు కాబట్టి కన్ఫ్యూజన్‌ ఏర్పడింది. శ్వేత పత్రం లెక్కలు ఎవ్వరినీ కించపరచడానికి కాదు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు, వ్యవసాయం, పరిశ్రమలు, డొమెస్టిక్‌ వినియోగదారులకు పూర్తి స్థాయిలో కరెంట్‌ ఇస్తాం“ అన్నారు మంత్రి శ్రీధర్ బాబు.

సభ ఇలా మొదలై అలా ముగిసింది...

శాసనసభ తొలి విడత సమావేశాలు ఈ నెల 9న ప్రారంభం అయ్యాయి. 21న నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు.

Read More
Next Story