హైడ్రాకు రేవంత్ సర్కార్ హై ప్రయారిటీ
x

హైడ్రాకు రేవంత్ సర్కార్ హై ప్రయారిటీ

చెరువులను కబ్జా చేసి నిర్మించిన ఫాంహౌస్‌లను తొలగించడమే లక్ష్యంగా హైడ్రా ముందడుగు వేస్తోంది.హైడ్రాకు ప్రాధాన్యమిస్తున్న రేవంత్ దీని పరిధిని విస్తరించనున్నారు.


రాజకీయ నాయకుల ఫామ్ హౌస్ ల మీద వివాదం చెలరేగుతున్నపుడు తెలంగాణ రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక సంచనల ప్రకటన చేశారు. రాజకీయ నాయకులు, రియల్టర్లు, రాజకీయ ప్రాబల్యం ఉన్న వాలు, ఈ మధ్య చెరువు ప్రాంతంలో ఫామ్ హౌస్ లు కట్టుకోవడం అలవాటు అయింది. వాటికిి అధికారులు పర్మిషన్లు ఇస్తున్నారు, చెరువు భూముల్లో కట్టుకున్నా, పర్మిషన్ ఉంది కాబట్టి ఇాది ఇల్లీగల్ కాదని దబాయిస్తున్నారు. చెరువు అనేది ఒక ఊరి సమిష్టి ప్రాంతం. ఇలాంటిది రాజకీయ నాయకులకు ఎలా సొంతమయిందలో అర్థంకాదు. ఇపుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి చెరువుల్లో లేచిన ఫామ్ హౌస్ లను కూల్చేయడానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (HYDRAA) అనే సంస్థని ప్రయోగించాడు. అయితే, ఈ రాజకీయ జంతువు అని, కేవలం కెటిఆర్ నివసిస్తున్న ఫామ్ హౌస్ ను కూల్చేందుకు మాత్రం పుట్టిందని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, వాళ్లు చాలా మంది కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ ల పేర్లను కూడా బయటపెట్టారు. ఇందులో రేవంత్ రెడ్టి ఫామ్ హౌస్ కూడా ఉంది. ఈ నేపథ్యంతో మంత్రి పొంగులేటి ఈ ప్రకటన చేస్తూ తమకొక ఫామ్ హౌస్ ఉందని అది కూడా చెరువు భూముల్లోనే ఉందని చెప్పారు.

హిమాయసాగర్‌కు సమీపంలో తనకు ఫాంహౌస్ ఉందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంగీకరించారు. ‘‘ఫాం హౌస్ నా కుమారుడి పేరు మీద ఉంది. దీన్ని నేను ధైర్యంగా ఒప్పుకుంటున్నాను,నా కుమారుడి ఫాం హౌస్ ఎఫ్‌టిఎల్ పరిధి లేదా బఫర్ జోన్‌లో ఉన్నట్లయితే, మొత్తం ఇంటిని కూల్చివేయమని నేను హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్‌కు సూచిస్తున్నాను’’ అని సాక్షాత్తూ మంత్రి ధైర్యంగా కోరారు.

ఇపుడు రేవంత్ కు ఇదొక సవాల్. ఆయన రాజకీయ దురుద్దేశంతో హైడ్రా ని సృష్టించారా లేక ప్రభుత్వ భూములను, చెరువుల సమిష్టి భూములన నిజంగానే కాపాడేందుకు హైడ్రా ను ప్రయోగించారా అనేది రుజువుచేసుకోవాలి. అయితే, ఆయన హైడ్రాకోరలను ఇంకా పదును పెడుతున్నట్లు సమాచారం.

హైడ్రా చెరువులు,కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడమే పరమావధిగా కార్యాచరణ చేపట్టింది. మూడు దశల వారీగా ఆక్రమణల తొలగింపునకు వ్యూహాన్ని రూపొందించిన హైడ్రా వరుసగా కూల్చివేతలు సాగిస్తోంది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారిల పర్యవేక్షణలో హైడ్రా చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న ఫాం హౌస్ ల కూల్చివేతపై దృష్టి సారించింది.

- హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన,ఆస్తుల పర్యవేక్షణ, రక్షణ అథారిటీ (HYDRAA)కి ప్రాధాన్యమిస్తున్న రేవంత్ ప్రభుత్వం దీనికి మరో 3,500 మంది ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖల నుంచి డెప్యుటేషన్లపై నియమించాలని ప్రతిపాదించింది.చెరువుల ఆక్రమణల తొలగింపును వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా హైడ్రాకు తన అధికార పరిధిని 2,500 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని తాజాగా ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం 2,000 చదరపు కిలోమీటర్లతో హైడ్రా పరిధి ఉంది. జీఓ 311 పరిధిలోని ఫాంహౌస్ లను కూల్చివేయాలంటే హైడ్రా పరిధిని మరింత విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

మూడు హైడ్రా ప్రత్యేక పోలీసుస్టేషన్లు
చెరువులు, ప్రభుత్వ స్థలాల కబ్జాదారులపై కేసులు నమోదు చేసి, వారిని చట్టప్రకారం జైలుకు పంపించాలంటే దీని కోసం ప్రత్యేకంగా మూడు హైడ్రా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని హైడ్రా ప్రతిపాదనలు రూపొందించిందని హైడ్రా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.జీఓ 111 ప్రాంతంలో ఆక్రమణలు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతంలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఎన్ఆర్ఎస్‌సీ శాటిలైట్ చిత్రాల సాయంతో...

చెరువుల కబ్జాలను గుర్తించడానికి హైడ్రాకు శాటిలైట్ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేటతో పాటు ఇతర చెరువులు ఏ మేరకు ఆక్రమణల పాలయ్యాయో పరిశీలించేందుకు హైడ్రా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) శాటిలైట్ చిత్రాల సాయం తీసుకుంటోంది. హైడ్రా వద్ద ఉన్న డేటా ప్రకారం 1979వ సంవత్సరం 2024 సంవత్సరాల మధ్య గడచిన 45 ఏళ్లలో హైదరాబాద్ నగరంలో చెరువుల విస్తీర్ణం 61 శాతం తగ్గింది. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు, ఔటర్ రింగ్ రోడ్ (ORR) అధికార పరిధిలో 400 సరస్సులు కబ్జాలతో కుచించుకు పోయాయి.

దూకుడుగా హైడ్రా కూల్చివేతలు
హైడ్రా చెరువల కబ్జాల తొలగింపునకు దూకుడుగా కూల్చివేతలు కొనసాగిస్తోంది. ఖానాపూర్ గ్రామం వద్ద శంకర్‌పల్లి రోడ్డులో ఒరో స్పోర్ట్స్‌ విలేజ్‌, పాలమూరు గ్రిల్‌ తదితర 20కి పైగా నిర్మాణాలను గత ఆదివారం హైడ్రా అధికారులు కూల్చివేశారు.ఈ భవనాలు ఉస్మాన్‌ సాగర్‌లోని బఫర్‌ జోన్‌లో అక్రమంగా నిర్మించినట్లు హైడ్రా ప్రకటించింది.

ఉస్మాన్ సాగర్ ఎఫ్‌ఆర్‌ఎల్‌పై గందరగోళం
ఉస్మాన్ సాగర్ ఎఫ్‌ఆర్‌ఎల్‌పై గందరగోళం నెలకొంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) వెబ్‌సైట్ రిజర్వాయర్ ఎఫ్‌ఆర్‌ఎల్ 1790 మీటర్లు అని పేర్కొంది. అయితే ఇదే బోర్డు గతంలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 1792 మీటర్లుగా కేటాయించిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఎఫ్ఆర్ఎల్ మార్క్ తర్వాత 30 మీటర్ల వ్యాసార్థాన్ని బఫర్ జోన్‌గా కేటాయించారు. ఈ బఫర్ జోన్‌లో ఎలాంటి నిర్మాణాలకు కూడా అనుమతి లేదు.

సవాలుగా మారిన ఫాంహౌస్ ల కూల్చివేతలు
చెరువుల వద్ద ఉన్న ఫాంహౌస్ ల కూల్చివేత డ్రైవ్‌లు హైడ్రాకు సవాలుగా మారింది. ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్‌లకు దగ్గరగా ఉన్న ఫాంహౌస్ లను తొలగించడమే లక్ష్యంగా హైడ్రా ప్రణాళిక రూపొందించింది.హిమాయత్ సాగర్ సమీపంలో కొత్వాల్‌గూడ వద్ద కొండలపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పట్నం మహేందర్ రెడ్డికి ఫాంహౌస్ ఉందని అధికారులు చెప్పారు.హిమాయత్ సాగర్ గ్రామంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన విలాసవంతమైన ఫామ్‌హౌస్ కూడా ఉంది. రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి బంధువుకు ఓ ఫాం హౌస్ ఉందంటున్నారు. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫాంహౌస్ ఉందని హైడ్రా అధికారులే చెబుతున్నారు. హిమాయత్‌సాగర్‌లోని ఓపెన్ ప్లాట్ టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి చెందినదని అధికారులు చెబుతున్నారు.




Read More
Next Story