తెలంగాణలో ఆర్టీఐ పెండింగ్ దరఖాస్తులకు త్వరలో మోక్షం
x
తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషన్ కార్యాలయం

తెలంగాణలో ఆర్టీఐ పెండింగ్ దరఖాస్తులకు త్వరలో మోక్షం

తెలంగాణలో పెండింగులో ఉన్న సమాచార హక్కు చట్టం పెండింగ్ దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించనుంది.సమాచార హక్కుచట్టం కమిషన్ ఏర్పాటుకు సర్కారు నోటిఫికేసన్ జారీ చేసింది.


తెలంగాణలో గత పదేళ్లుగా పరిష్కారం కాని సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు త్వరలో పరిష్కారం లభించనుంది. గతంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమాచార హక్కు చట్టం కమిషన్ ఖాళీగా ఉంది.దీంతో రాష్ట్రంలో 12,128 దరఖాస్తులు పెండింగులోనే ఉన్నాయి.

- సీఎం ఎ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సమాచార హక్కు చట్టం కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
- తెలంగాణలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) చీఫ్ కమిషనర్, కమిషనర్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారి తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. సమాచార హక్కు చట్టం 2005 లోని సెక్షన్ 15,16 ప్రకారం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే వారిని త్వరలో నియమించనున్నారు.
అమలు కాని సమాచార హక్కు చట్టం
కేసీఆర్ గత పదేళ్ల పాలనలో సమాచార హక్కు చట్టం అమలు సజావుగా సాగలేదు. ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ అధికారిక జీఓలన్నీ టాప్ సీక్రెట్ గానే ఉంచారు. ప్రజల చేతిలో పాశుపతాస్త్రం అయిన సమాచార హక్కు చట్టం నాటి పాలకుల చేతుల్లో బందీగా మారింది. రాష్ట్రంలోని 8,924 ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు అడిగిన సమాచారం ఇచ్చే వారే కరువయ్యారు. గతంలో ప్రభుత్వ శాఖల అధికారిక సమాచారం ప్రజలకు అందకుండా పోయింది.

గతంలో కమిషన్ ఏర్పాటులో తాత్సారం
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పదేళ్ల కాలంలో పాలకులు సమాచార హక్కు చట్టం అమలులో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఏడాది సమయం దాకా సమాచార హక్కు చట్టం కమిషన్ ఏర్పాటు చేయలేదు. 2015 వ సంవత్సరంలో కమిషన్ ఏర్పాటు చేసినా సజావుగా పనిచేయలేదు. సమాచార హక్కు కమిషన్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఫిర్యాదుల పరిష్కారం కాలేదు.

నెలలు గడచినా అందని సమాచారం
సామాన్యులు ప్రభుత్వ సమాచారం కోసం దరఖాస్తు చేస్తే వారికి 30 రోజుల్లోగా సమాచారం అందించాలి. స్వేచ్ఛకు సంబంధించిన దరఖాస్తు అయితే 48 గంటల్లోనే సమాచారం అందించాలని సమాచార హక్కు చట్టం చెబుతోంది. కానీ తెలంగాణలో సమాచారం ఇచ్చే వారు లేరు. సమాచారం ఇవ్వాలని కోరుతూ కమిషన్ కు అప్పీలు చేసినా కమిషన్ ఖాళీగా ఉండటంతో సామాన్యుల మొర ఆలకించే వారే కరవయ్యారు.

సమాచార వార్షిక నివేదికలేవి?
తెలంగాణలో సమాచార హక్కు చట్టం అమలు గురించి ఎప్పటికప్పుడు కమిషన్ వార్షిక నివేదికలను విడుదల చేయాలి. 2014వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేసిన వార్షిక నివేదిక తప్ప ఎన్నడూ విడుదల చేయలేదు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్రల్లో సమాచార ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయడంతోపాటు సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానాలు విధిస్తూ కమిషన్ కొరడా ఝళిపిస్తుండగా, తెలంగాణలో మాత్రం ఇన్నాళ్లు ప్రభుత్వ సమాచారం సామాన్యులకు అందకుండా పోయింది.

పెండింగులో సమాచార చట్టం అప్పీళ్లు
సమాచారం ఇవ్వాలని కోరుతూ సామాన్యులు, సమాచార హక్కు చట్టం యాక్టివిస్టులు చేసిన అప్పీళ్లు, ఫిర్యాదులు పరిష్కారం కాలేదు. 2017నుంచి 2023 డిసెంబరు వరకు సమాచార హక్కు చట్టం కమిషన్ లో 7,537 అప్పీల్స్ పెండింగులో ఉన్నాయి. 2017 నుంచి ఇప్పటివరకు 4,591 ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం మీద 12,128 అప్పీల్స్, దరఖాస్తులు కమిషన్ వద్ద పెండింగులో ఉన్నాయని ఆర్టీఐ కమిషన్ రికార్డులే తేటతెల్లం చేస్తున్నాయి.

తెలంగాణ సర్కారు నోటిఫికేషన్ జారీ
తెలంగాణలో సమాచార హక్కు చట్టం కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ తాము హైకోర్టులో పిల్ వేయడంతోపాటు నూతన సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించడంతో సర్కారులో కదిలిక వచ్చిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కమిషన్ ఏర్పాటుకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో త్వరలో కమిషన్ ఏర్పాటు అవుతుందని పద్మనాభరెడ్డి చెప్పారు. కమిషన్ ఏర్పాటైతే పెండింగ్ అప్పీళ్ల పరిష్కారంతో పాటు సమాచార హక్కు చట్టం అమలుకు మార్గం సుగమం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


Read More
Next Story