చెరువు కబ్జాల కథ:  ఉమ్మడి ఆంధ్రాలో మొదలు, ప్రత్యేక తెలంగాణలో జోరు
x

చెరువు కబ్జాల కథ: ఉమ్మడి ఆంధ్రాలో మొదలు, ప్రత్యేక తెలంగాణలో జోరు

‘హైడ్రా’కు కబ్జాలను పట్టించిన శాటిలైట్ చిత్రాలు హైదరాబాద్‌లో గత 10 ఏళ్లలో చెరువులు,కుంటలు,నాలాల కబ్జాలు జరిగాయని శాటిలైట్ చిత్రాల పరిశీలనలో తేలింది.


హైదరాబాద్ నగరంలో వందలాది చెరువులు, కుంటలు, జలాశయాలు, నాలాలు ఉన్నాయని 2010 వ సంవత్సరంలో ఇస్రో సాయంతో తీసిన శాటిలైట్,గూగుల్ ఎర్త్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. 2024వ సంవత్సరంలో తాజాగా తీసిన శాటిలైట్ చిత్రాల్లో నీటి వనరుల స్థానంలో పలు హైరైజ్ భవనాలు నిర్మించారని తేలింది. దీంతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(Hydra) రంగంలోకి దిగి నీటి వనరుల్లో ఉన్న ఆక్రమణలను తొలగిస్తోంది.


గొలుసుకట్టు చెరువులు కబ్జాల పాలు
హైదరాబాద్ నగరంలో గతంలో ఉన్న పలు గొలుసుకట్టు చెరువులు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.జంట జలాశయాలు, సరస్సులు, చానెళ్లు, బావులు కబ్జాలతో అంతర్ధానమయ్యాయి. బుల్కాపూర్ నాలా నుంచి జన్వాడ ఫాం హౌస్ టు హుసేన్ సాగర్ వరకు పలు చెరువులు కబ్జాలతో కుచించుకు పోయాయి. ఫిరంగివోని నాలా చందన్ వెల్లి నుంచి ఇబ్రహీంపట్నం చెరువు వరకు కబ్జాల పాలయ్యాయి.

తుమ్మిడికుంట చెరువు : 2010 నాటి శాటిలైట్ చిత్రం

కుచించుకుపోయిన తుమ్మిడికుంట చెరువు
హైటెక్ సిటీ సమీపంలోని తుమ్మిడికుంట చెరువు 2010 నుంచి 2024 వరకు 14 ఏళ్లలో కబ్జాలపాలై చిక్కిపోయింది. 2024లో చెరువు విస్తీర్ణంలో సగభాగానికి పైగా ఆక్రమణల పాలైంది. దీంతో హైడ్రా రంగంలోకి దిగి సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాలును కూల్చివేసింది. 14 ఏళ్లలో కబ్జాల పాలైన వైనాన్ని శాటిలైట్ గూగుల్ ఎర్త్ చిత్రపటాలను పరిశీలిస్తే విదితమవుతుంది.

జంట జలాశయాల వద్ద ఆక్రమణలు :శాటిలైట్ చిత్రం

జంట జలాశయాల వద్ద కబ్జాల పర్వం
జంట జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ లలోని కబ్జాలను హైడ్రా కూల్చివేసింది. ఒరో స్పోర్ట్సుతో పాటు పలు ఆక్రమణలను గూగుల్ ఎర్త్ శాటిలైట్ చిత్రాలు గుర్తించాయి. రంగారెడ్డి జిల్లా గండిిపేట మండలం జన్వాడ సర్వేనంబరు 311,313 సర్వే నంబర్లలోని బుల్లాపూర్ నాలాను ఆక్రమించారని శాటిలైట్ చిత్రాల ద్వారా తేలింది. దీంతో గూగుల్ ఎర్త్ ఇస్రో సాయంతో తీసిన చిత్రాలు నాలాల ఆక్రమణలను హైడ్రాకు పట్టించాయి. బుల్కాపూర్ నాలా, బఫర్ జోన్ లో ఫాంహౌస్ ల ఆక్రమణలు శాటిలైట్ చిత్రాల్లో వెలుగుచూశాయి.

కుంటల 2010 నాటి చిత్రం

కనుమరుగైన కుంటలు
హైదరాబాద్ నగరంలోని పలు కుంటలు కబ్జాలతో కనుమరుగయ్యాయి. మాంసాని కుంట,మేకసాని కుంట, బుల్కాపూర్ నాలాలు కబ్జాలకు గురయ్యాయని శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేశాయి. చంద్రాయణగుట్ట బండ్లగూడ చెరువు విస్తీర్ణం2014వ సంవత్సరంలో ఎక్కువగా ఉందని శాటిలైట్ చిత్రాలు రుజువు చేశాయి.2024వ సంవత్సరంలో తీసిన శాటిలైట్ చిత్రం చూస్తే హైరైజ్ భవనాలు బండ్లగూడ సల్కం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ లో నే వెలిశాయి.

2024 నాటికి కుచించుకుపోయిన కుంటలు

ఆక్రమణలు తొలగించండి : క్లైమెట్ కాంగ్రెస్ టీం
హైదరాబాద్ మహా నగరంలో కబ్జాదారుల కబంధ హస్తాల్లో నుంచి చెరువులు, కుంటలను కాపాడాలని క్లైమెట్ కాంగ్రెస్ టీం రాష్ట్రప్రభుత్వాన్ని, హైడ్రాను కోరింది. రంగారెడ్డి జిల్లా కేటీఆర్ భార్య కల్వకుంట్ల శైలిమ ఫాం ల్యాండ్స్ ఉన్న జన్వాడ గ్రామంలోని భూముల్లో చెరువుల ఎఫ్టీఎల్ విస్తీర్ణాన్ని 300 ఎకరాలు తగ్గించి మ్యాప్ తయారు చేశారని క్లైమెట్ కాంగ్రెస్ టీం ప్రతినిధి డాక్టర్ లుబ్నా సర్వత్ ఆరోపించారు.

బండ్లగూడ చెరువు కబ్జా


ఎన్ కన్వెన్షన్ పై 2014లోనే కేసు వేశాను...

సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పూర్తిగా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ లో నిర్మించారని, ఈ భూమి అంతా ఆక్రమణ అని క్లైమెట్ కాంగ్రెస్ టీం ప్రతినిధి డాక్టర్ లుబ్నా సర్వత్ చెప్పారు. ఎన్ కన్వెన్షన్ ఆక్రమణపై తాను 2014వ సంవత్సరంలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశానని ఆమె పేర్కొన్నారు. రామంతాపూర్ చిన్న, పెద్ద చెరువులు కబ్జాల పాలయ్యాయని ఆమె చెప్పారు.


జన్వాడ ఫాంహౌస్ శాటిలైట్ చిత్రం


Read More
Next Story