ఎన్నికల బహిష్కరణ అస్త్రం: మైలారం గుట్ట పరిరక్షణ కోసం సంచలన నిర్ణయం
x
voting bocott

ఎన్నికల బహిష్కరణ అస్త్రం: మైలారం గుట్ట పరిరక్షణ కోసం సంచలన నిర్ణయం

వెయ్యేళ్ల చరిత్ర ఉన్న మైలారం గుట్ట పరిరక్షణ కోసం గ్రామస్థులు కలిసి కదిలారు.గుట్ట పరిరక్షణ కోసం తాము పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఓటర్లు చెప్పారు.


పార్లమెంట్ ఎన్నికల్లో తమ సమస్యల పరిష్కారం కోసం పలు గ్రామాల ఓటర్లు ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చారు...మొన్న మంచిర్యాల జిల్లా కోటిపల్లి మండలం రాజారం గ్రామస్థులు తమ గ్రామ సమస్యలు తీర్చేదాకా తాము ఓటేసిది లేదని తీర్మానించారు.

- తాజాగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మైలారం గ్రామస్థులు గుట్ట పరిరక్షణ కోసం ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించి సంచలనం రేపారు. కొన్నేళ్లుగా తమ సమస్యలను పరిష్కరించక పోవడంతో గ్రామస్థులు పార్లమెంట్ ఎన్నికల వేళ ఎన్నికల బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించారు.
- మైనింగ్ బారి నుంచి గుట్టను కాపాడాలంటూ మైలారం గ్రామస్థులు ‘‘గుట్ట ముద్దు... ఓటు వద్దు’’ అనే నినాదంతో గ్రామంలో ర్యాలీ తీశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమ గ్రామంలో ఓటు వేయమని, ఏ రాజకీయ పార్టీని తమ గ్రామంలోకి అనుమతించమని నాగర్‌కర్నూల్ జిల్లా కోడైర్ మండలం మైలారం గ్రామ వాసులు తీర్మానించారు.

గుట్టపై మైనింగ్ పై మైలారం గ్రామస్థుల ఆగ్రహం
మైలారం గుట్టపై 20 ఏళ్ల వరకు మైనింగ్ చేసుకునేందుకు తెలంగాణ గనుల శాఖ అనుమతించడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుగురాళ్లను తవ్వేందుకు వీలుగా గుట్టపైకి పొక్లెయిన్ తో రహదారి నిర్మించారు. గుట్టపై పలుగురాళ్ల తవ్వకాలు చేపట్టేందుకు పేలిస్తే గ్రామంలో ఇళ్లకు నెర్రెలు వచ్చి దెబ్బతింటాయని, గుట్ట తవ్వితే పర్యావరణం దెబ్బ తింటుందని గ్రామస్థులు ఆందోళన చేశారు. మైలారం గుట్టపై ఉన్న పురాతన ఆలయం మైనింగ్ వల్ల దెబ్బతింటుందని గ్రామస్థులు ఆవేదనగా చెప్పారు. మైలారం గుట్ట మైనింగ్ పై తాజాగా ప్రజాభిప్రాయ సేకరణ జరగ్గా గ్రామస్థులు వ్యతిరేకించారు.

పర్యావరణానికి పెను ముప్పు
వెయ్యి ఏళ్ల చరిత్ర ఉన్న గుట్టను పలుగు రాళ్ల కోసం తవ్వితే ఊరుకునేది లేదని మైలారం గ్రామస్థుడు చంద్రయ్య హెచ్చరించారు. గుట్ట ఆధారంగా అరుదైన మొక్కలు, జింకలు, పందులు, కుందేళ్లు, వివిధ రకాల పక్షులు ఉన్నాయని, మైనింగ్ వల్ల అవన్నీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని గ్రామస్థుడు నిరంజన్ చెప్పారు. మైనింగ్ వల్ల తమ గ్రామంలో దుమ్ము, బ్లాస్టింగ్ శబ్దాలతో మూగజీవాలు భయందోళనలకు గురవుతాయని, ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పు సంభవిస్తుందని మైలారం గ్రామస్థులు చెప్పారు.

కొండను తవ్వవద్దు : మైలారం గ్రామస్థులు
నాలుగు దేవాలయాలతో పాటు, వర్షాకాలంలో కొండపై పశువులను మేపుకోవాలన్నా, వన్యప్రాణులను బతికించుకోవాలన్నా గ్రామానికి సహజ వనరు అయిన కొండ తప్ప మరేమీ లేదని మైలారం గ్రామస్థులు చెబుతున్నారు. 2004వ సంవత్సరం నుంచి ఆ కొండను తవ్వేందుకు మైనింగ్ శాఖ నిరంతరం ప్రయత్నాలు చేస్తోందని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని గ్రామస్థులు నిరంజన్, సత్యంగౌడ్, శ్రీశైలం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

మైనింగ్ లీజు రద్దు చేస్తేనే ఓట్లు వేస్తాం...మైలారం గ్రామస్థుల ఏకగ్రీవ తీర్మానం
మైలారం గుట్ట మైనింగ్ లీజును రద్దు చేస్తేనే తాము పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని గ్రామస్థులు ఖరాఖండీగా చెప్పారు. మైనింగ్ లీజు రద్దు చేయకుంటే తాము ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామంలో ఫ్లెక్సీలు వేశారు. గ్రామంలో నిరసనగా ర్యాలీ తీశారు. గ్రామానికి ముప్పు వాటిల్లే మైనింగ్ అనుమతిని రద్దు చేయాలని కోరుతూ గ్రామస్థులు నిరంజన్, సత్యంగౌడ్, శ్రీశైలం, సైదులు, కృష్ణారెడ్డి, వెంకటేశ్ గౌడ్, వెంకటయ్య, వెంకటేష్, రవీందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు,శ్రీనివాసులు, విజయభాస్కర్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.

- మైలారం గ్రామస్థులు ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల అధికారులు, నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అధికారులు గ్రామానికి వచ్చి గ్రామస్థుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. గుట్ట పరిరక్షణ కోసం కలిసి కదిలిన మైలారం గ్రామస్థుల మైనింగ్ అనుమతిని రద్దు చేస్తారా? లేదా గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరిస్తారా అనేది పోలింగ్ రోజు తేలనుంది.




Read More
Next Story