బిఆర్ ఎస్  ఎమ్మెల్యే లాస్యనందిత మృతి
x
MLA Lasyanandita

బిఆర్ ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి

కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం నాడు ఒ ఆర్ ఆర్ మీద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.


కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచి లాస్యకు ప్రమాదాలు వెంటాడాయి. గతంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటరుగా పనిచేసిన లాస్య నందిత గత ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 17,169 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తండ్రి అయిన మాజీ ఎమ్మెల్యే జి సాయన్న మరణించిన ఏడాదికే లాస్య రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ప్రమాద ఘటనతో లాస్య కుటుంబంలో విషాదం అలముకుంది. సికింద్రాబాద్ లోని సెయింట్ ఆన్స్ లో చదివిన లాస్య అనంతరం కంప్యూటర్ సైన్సులో బీటెక్ చేశారు. ఏడాది కాలంలో తండ్రీ కూతుళ్లు మరణించడంతో ఆయన కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు.


ఎమ్మెల్యే‌గా కలిసి‌రాని‌ కాలం...

ఎమ్మెల్యేగా విజయం సాధించాక లాస్య నందిత ఓ కార్యక్రమానికి వెళుతుండగా లిప్ట్ లో ఇరుక్కుంది. తొలి ప్రమాదం నుండి బయటి పడిన లాస్య నల్గొండ వెళుతూ మరో ప్రమాదం బారిన పడింది. నల్గొండలో బీఆర్‌ఎస్ బహిరంగ సభకు వెళ్లి వస్తూ ఫిబ్రవరి 13వ తేదీన రెండవ సారి‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లాస్య తలకు గాయమైంది. నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ మృతి చెందారు. మూడవ సారి పటాన్ చెరు ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక యువ‌ఎమ్మెల్యే లాస్య మృతి చెందారు.

పది రోజుల్లోనే మూడో ప్రమాదం

పది రోజులు గడువక‌ ముందే మరో రోడ్డు ప్రమాదం జరిగి లాస్య ప్రాణాలు కోల్పోయింది. ఓఆర్ఆర్ వద్ద డివైడర్ ను ఢీకొని కారు పల్టీలు కొట్టింది. తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన లాస్య నందిత హఠాన్మరణం చెందారు. ఈమె తండ్రి సాయన్న 1994వ సంవత్సరం నుంచి 2004 వరకు మూడు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా, 2018లో టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. సాయన్న అనారోగ్యంతో గత ఏడాది ఫిబ్రవరి 19వతేదీన కన్నుమూశారు. దీంతో గత ఎన్నికల్లో లాస్య నందిత కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి 17,169 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తండ్రి మరణించిన ఏడాదికే లాస్య రోడ్డుప్రమాదంలో కన్నుమూశారు. తన తండ్రి ఆశయాలను అమలు చేస్తానని లాస్య నందిత ఎన్నికల్లో ప్రకటించారు. తండ్రి ఆశయాలు నెరవేరకుండానే ఆమెను మృత్యువు కబళించింది. తండ్రి సాయన్న ఆశయాలు‌ నెరవేర్చకుండానే తండ్రి వద్దకి చేరింది.

విషాదంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు...బీఆర్ఎస్ నేతల సంతాపం


కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో ఆమె కుటుంబంలో విషాదం అలముకుంది. లాస్య మృతి ఘటనపై బాల్కొండ ఎమ్మెల్యే,మాజి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గతేడాది ఫిబ్రవరిలో కంటోన్మెంట్ సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి తన తండ్రి సాయన్న మృతి నుండి ఇంకా కోలుకొక ముందే, ప్రజా సేవలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కంటోన్మెంట్ ప్రజల మన్ననలు పొందిన యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఆమె మరణం కంటోన్మెంట్ ప్రజలకు,బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోదైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

Read More
Next Story