అమ్మకు అవమానం! వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసి..
కొడుకు ప్రేమించాడని తల్లికి శిక్షా..ఓరి మీ దుర్మార్గం పాడుగాను. అమ్మను వివస్త్రను చేస్తార్రా.. ఏం పోయేకాలం వచ్చిందిరా నాయనా’..
‘ఓరి మీ దుర్మార్గం పాడుగాను. అమ్మను వివస్త్రను చేస్తార్రా.. మీరసలు మనుషులేనా, ఇదసలు సంఘమేనా, ఏం పోయేకాలం వచ్చిందిరా నాయనా’ అంటూ శాపనార్ధాలు పెడుతోంది కన్నడ సమాజం. సభ్య సమాజం తలదించుకునే ఘోరానికి పాల్పడ్డారు కదరా అని ఘోషిస్తోంది కర్ణాటక రాజ్యం. మానవత్వానికే మచ్చతెచ్చే పని చేశారని శపిస్తోంది యావత్ దేశం.
కొడుకు ప్రేమించాడని తల్లికి శిక్షా..
పిల్లల్ని కంటాం గాని వారి మనసుల్ని శాసిస్తామా.. కన్న కొడుకు పక్కింటి అమ్మాయిని ప్రేమిస్తే తల్లేమి చేస్తుంది. ప్రేమించడమే నేరమవుతుందా..
కర్నాటక రాష్ట్రంలోని బెళగావికి సమీప గ్రామానికి చెందిన ఓ యువతి (20), ఓ యువకుడు (24) కొంతకాలంగా ఇష్టపడుతున్నారు. మనసులు పెనవేసుకున్నాయి. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇంతలో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి నిశ్చయం చేశారు. ఈ విషయం ఆ అమ్మాయి ఈ అబ్బాయికి చెప్పింది. ఇళ్లల్లో చెబితే వద్దంటారనుకున్నారో ఏమో.. ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి ఎక్కడికో వెళ్లిపోయారు.
తెల్లారి పొద్దున్నే ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది. అంతే ఆ యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ఆ యువకుడి ఇంటిపై దాడి చేశారు. ఇంటిని కూల్చినంత పని చేశారు. అంతటితో ఆగక ఆ కుర్రాడి అమ్మను జుట్టుపట్టుకుని వీధిలోకి ఈడ్చుకొచ్చారు. వివస్త్రను చేశారు. నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. రచ్చబండ వద్ద స్తంభానికి కట్టి అర్ధరాత్రి వరకు కొట్టారు. అదేం ఊరో ఏం వల్లకాడో.. ఏ ఒక్కడూ అదేమని అడిగిన పాపన పోలేదు. ఆడమనిషిని అలా ఎలా చేస్తార్రా అని అడిగినోడూ లేడు, అడ్డుకున్న నోరూ లేదు.
కుమిలిపోయిన భారతం..
అర్ధరాత్రికి ఆనోటా ఈనోటా పాకి పక్కూరి పోలీసు స్టేషన్ కి సమాచారం చేరింది. పోలీసులు అక్కడికి వచ్చే పాటికి ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. వంటి మీద నూలు పోగు లేకుండా ఉన్న ఆ అమ్మను కాపాడి వంటి మీద ఇంత గుడ్డ కప్పి ఆస్పత్రిలో చేర్చారు. ఈ సంగతి తెలిసి కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్, పోలీస్ ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఆమెను ఓదార్చారు. మేమున్నామనే ధీమా ఇచ్చారు. అయితే ఆ తల్లి కడుపు కోత తీరుతుందా.. పోయిన పరువు తిరిగి వస్తుందా.. ఏమైతేనేం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ద రామయ్య మొదలు యావత్ దేశమంతా ఆ అమ్మకు జరిగిన పరాభవాన్ని ఘోరమంటూ ఆక్రోశిస్తుంది.
ఏడుగుర్ని పట్టుకున్నారట..
అమ్మను అవమానించిన కేసులో ఏడుగుర్ని పోలీసులు పట్టుకున్నారు. ఇంకో ఇద్దరు దొరకాల్సి ఉంది. గ్రామంలో అల్లర్లు జరక్కుండా పోలీసుల్ని కాపలా పెట్టారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు బాధిత కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.
ఇదేం ఘోరం: సీఎం సిద్ధరామయ్య
రాకెట్లను మబ్బుల్లోకి పంపుతున్న యుగంలో ఇదేం ఘోరమంటూ సిద్దరామయ్య ఘొల్లుమన్నారు. ఒక మహిళను వివస్త్రను చేసి ఊరేగించడం, స్తంభానికి కట్టి హింసించడం సిగ్గుచేటని ఆవేదన చెందారు. ఇలాంటి అరాచకాలను సహించబోమన్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని ట్విట్టర్లో పోస్టు పెట్టారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పారిపోయిన ఆ పిల్లలకు రక్షణ కల్పించాలని, ఆ అమ్మకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.