వైఎస్ జయంతి వేడుకలను హైజాక్ చేసిన షర్మిల: సాక్షిలో ప్రకటన కూడా మృగ్యం!
x

వైఎస్ జయంతి వేడుకలను హైజాక్ చేసిన షర్మిల: సాక్షిలో ప్రకటన కూడా మృగ్యం!

షర్మిల డామినేషన్ తెల్లవారుఝామునుంచే కనబడింది. ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆమె వైఎస్ ఫోటోలతో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. మరోవైపు సాక్షిలో కనీసం ప్రకటనకూడా కనబడలేదు.


ఒక మామూలు మనిషి జీవితంలోనే 75వ జయంతి అంటే ఒక విశిష్ట స్థానం ఉంటుంది. మరి వైఎస్ లాంటి నాయకుడి 75 వ జయంతి అంటే ఆయన వారసులు ఎలా జరపబోతున్నారో అని కొద్దిరోజులుగా ఏపీలో ఉత్సుకత చోటుచేసుకుంది. తీరా ఇవాళ జరిగిన ఈ కార్యక్రమాలను చూస్తే, వైఎస్ కుమార్తె షర్మిల పూర్తిస్థాయిలో హైజాక్ చేసేశారు.

ఇవాళ షర్మిల డామినేషన్ తెల్లవారుఝామునుంచే కనబడింది. ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆమె వైఎస్ ఫోటోలతో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. యాడ్‌లో వైఎస్ఆర్ నిలువెత్తు ఫోటోతో పాటు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధి, రాహుల్ గాంధి, ప్రియాంక గాంధి, ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిలు మాణిక్యం ఠాకూర్, కేసీ వేణుగోపాల్ ఫోటోలను వేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను కూడా వేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉంటే, జగన్ యాజమాన్యంలో, ఆయన భార్య భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి దినపత్రికలో మాత్రం వైఎస్‌కు నివాళిగా కొన్ని రాతలు తప్పితే ఒక్క ప్రకటన కూడా కనబడలేదు. ఇదే సాక్షిలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే ఫుల్ పేజ్ యాడ్‌లు రావటం గమనార్హం. ఆ కాలంలో వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించేవారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రభలో నెల్లూరు జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి అనే వైఎస్ అభిమాని ఒకరు కూడా ఫుల్ పేజ్ యాడ్ వేయించారు.

ఇక సాయంత్రం మంగళగిరి సీకే కన్వెన్షన్ హాలులో వైఎస్ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులతో పాటు కాంగ్రెస్ పాతకాపులు కేవీపీ, రఘువీరారెడ్డి, పళ్ళంరాజు, బాపిరాజు, ఉండవల్లి, శైలజానాథ్, సీపీఐ నారాయణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్‌తో తమకున్న అనుబంధాన్ని వివిధ నాయకులు గుర్తుకు తెచ్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ అభిమానులకు ఇది సంతోషదాయకమయింది.

ఈ కార్యక్రమం ద్వారా షర్మిల రెండు లక్ష్యాలను సాధించారు. ఒకవైపు తాను కూడా ఏపీ రాజకీయాలలో ఒక బలమైన శక్తిని అని ఆమె చాటుకున్నారు. మరోవైపు ఆస్తులలో కాకపోయినా, వైఎస్ రాజకీయ వారసత్వంలో వాటాపై మాత్రం పోటీకి దిగి అన్న జగన్‌కు సవాల్ విసిరారు. ఆమెకు ఎన్నికల్లో విజయం సాధించేటంత శక్తి లేకపోయినా, ఇటీవలి ఎన్నికల్లో అన్న పార్టీకి ఎంతో కొంత డేమేజ్ చేయగలిగింది అని కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్లను చూస్తే అర్థమవుతోంది. అంతిమంగా ఎప్పటికైనా ఆమె వలన జగన్ పార్టీకే నష్టం ఉంటుందనేది సుస్పష్టం. మరి ఇలాంటి పరిస్థితిలో జగన్ ముందు ముందు రాజీ చేసుకుంటారా, లేక ఇలాగే కొనసాగుతారా అనేది చూడాలి.

Read More
Next Story