మహారాష్ట్ర రాజకీయాలలో పెనుదుమారం సృష్టించిన శివాజీ విగ్రహం!
x

మహారాష్ట్ర రాజకీయాలలో పెనుదుమారం సృష్టించిన శివాజీ విగ్రహం!

గత పదేళ్ళలో ఎన్నడూ లేనివిధంగా ప్రధాని మోది స్వయంగా క్షమాపణలు చెప్పినా ఉపయోగం లేదని,.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారకూటమి ఓటమి ఖాయమనేవాదన బలంగా వినిపిస్తోంది.


మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం మహారాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండు నెలల్లో ఆ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో అధికార కూటమి(ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన- బీజేపీ-అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీ) కూలిపోవటానికి ఇది సంకేతంగా భావించవచ్చనే వాదన వినిపిస్తోంది. మరోవైపు, పదవిలో ఉన్న గత పదేళ్ళలో ఎన్నడూ లేనివిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోది స్వయంగా క్షమాపణలు చెప్పినా డేమేజ్ కంట్రోల్‌ జరగటం కష్టమని అంటున్నారు.

అసలు ఏం జరిగింది!

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా మాల్వన్‌లో గత ఏడాది డిసెంబర్ 4న నేవీ డే వేడుకలలో భాగంగా జరిగిన ఓ కార్యక్రంలో ఈ విగ్రహాన్ని నరేంద్ర మోది ఆవిష్కరించారు. 35 అడుగుల ఈ విగ్రహాన్ని రు. 2.36 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేశారు. తొమ్మిది నెలలు కూడా గడవకముందే ఈ విగ్రహం గత నెల 26న తీవ్ర వర్షాల ప్రభావంతో కుప్పకూలిపోయింది. ఇండియన్ నేవీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాయి. వాస్తవానికి అక్కడ 6 అడుగుల మట్టి విగ్రహానికి మాత్రమే అనుమతి ఉండగా, 35 అడుగుల కాంస్య విగ్రహాన్ని పెట్టారన్న విషయం బయటపడింది. మరోవైపు, బాధ్యులైన పీడబ్ల్యూడీ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ బాంబే హైకోర్టులో పిల్ దాఖలయింది.

“ఇది శివాజీ మహారాజ్‌ను అవమానించటమే”

విగ్రహ ఏర్పాటులో అవినీతి చోటు చేసుకోవటంవలనే అది కుప్పకూలిందంటూ, దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తక్షణం రాజీనామా చేయాలంటూ ఉద్ధవ్ థాక్రేకు చెందిన శివసేన వర్గం, శరద్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ వర్గంతో కూడిన మహా వికాస్ ఆఘాడి(ఎంవీఏ) కూటమి డిమాండ్ చేసింది, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో శివాజీ విగ్రహాలు చక్కగా నిలుచుని ఉండగా, కొత్తగా ఏర్పాటు చేయబడిన విగ్రహం కుప్పకూలిపోవటానికి కారణం అవినీతేనని శరద్ పవార్ ఆరోపించారు. ఇది శివాజీ మహారాజ్‌ను అవమానించటమేనని అన్నారు.

ప్రతిపక్ష ఆరోపణలను ఖండిస్తూ, బలంగా వీచిన గాలులవలనే విగ్రహం కూలిపోయిందని ముఖ్యమంత్రి షిండే అన్నారు. పీడబ్ల్యూడీ మంత్రి రవీంద్ర చవాన్ దీనిపై స్పందిస్తూ, ఈ విగ్రహం ఏర్పాట్లను పర్యవేక్షించిన నేవీవారే దీనికి బాధ్యులని వ్యాఖ్యానించారు. బీజేపీ ముంబై శాఖ అధ్యక్షుడు ఆషిష్ దీనిపై బహిరంగంగా క్షమాపణలు చెబుతూ, దోషులకు త్వరలోనే శిక్ష పడుతుందని అన్నారు. ప్రాజెక్టుకు స్ట్రక్చరల్ కన్సల్టెంట్‌గా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు, విగ్రహ శిల్పి పరారీలో ఉన్నారు.

ఎలాగైనా నేవీ డే రోజు అయిన డిసెంబర్ 4వ తేదీన విగ్రహావిష్కరణ జరగాలంటూ నేవీ అధికారులు ఒత్తిడి చేశారని, నేవీ అధ్వర్యంలోనే విగ్రహ డిజైన్, నిర్మాణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పీడబ్ల్యూడీ విభాగం చెప్పుకొస్తోంది.

శివాజీ మహారాజ్ అనే పేరు మహారాష్ట్ర రాజకీయాలలో ఒక కీలకమైన అంశం. ఆ రాష్ట్ర ప్రజలు శివాజీని తమ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తారు. దానికి తోడు, రాష్ట్ర రాజకీయాలలో శివాజీ కులమైన మరాఠాలు అత్యధిక శాతంమంది ఉంటారు. మహారాష్ట్రకు ఇప్పటివరకు ముఖ్యమంత్రులుగా పని చేసిన 20 మందిలో 12 మంది మరాఠాలే.

విగ్రహ శిల్పికి అసలు అనుభవంలేదని, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కొడుకుకు పరిచయం ఉండటం అనే ఏకైక అర్హత కారణంగా అతనికి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు వినబడతున్నాయి.

దీనిపై మహారాష్ట్ర రాజకీయ విశ్లేషకులు వివేక్ దేశ్‌పాండే మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోది తాను తలుచుకున్న పనులు అన్నీ నిమిషాలలో జరిగిపోవాలని అనుకుంటారని, దాని ఫలితమే ఈ విగ్రహం కూలిపోవటమని వ్యాఖ్యానించారు. నేవీడే కోసం హడావుడిగా ఈ ప్రారంభోత్సవం ఏర్పాటు చేశారని, అందుకే నిర్మాణం సరిగ్గా జరగలేదని అన్నారు. ఇదేకాదు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ ప్రారంభం కూడా ఇలాగే జరిగిందని, ఆ రైళ్ళు నడపటానికి తగిన పట్టాలు లేకపోయినా, హడావుడిగా ఆ రైళ్ళను ప్రారంభించారని, దానివలన మిగతా రైళ్ళు అన్నీ లేటుగా నడుస్తున్నాయని చెప్పారు.

మరోవైపు, బీజేపీ, ఆరెస్సెస్ వారు ఎక్కడ తమ పార్టీ కార్యాలయాలు కట్టుకున్నా వాటికి ఎక్కడా ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని, కానీ, వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రజాధనంతో కట్టిన అతల్ సేతు, అయోధ్య రామమందిరం, కొత్త పార్లమెంట్ భవనం, ఉజ్జయిన్‌లో సప్తర్షి విగ్రహాలు వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో మాత్రం ఇలా లోపాలు బయటపడుతున్నాయని విమర్శించారు. ముఖ్యంగా అయోధ్య రామమందిరం కప్పునుంచి నీళ్ళు కారాయని, అప్పుడు మోది క్షమాపణలు చెప్పలేదని గుర్తు చేశారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు వస్తున్నాయి కనుక ఇక్కడ క్షమాపణలు చెప్పారని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికలలో ఎలాంటి ప్రభావం చూపబోతోంది?

మహారాష్ట్రలో గత మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కూటమికి ప్రతికూల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. 48 లోక్‌సభ సీట్లలో ప్రతిపక్ష కూటమికి 30 సీట్లు, అధికార ఎన్‌డీఏ కూటమికి 17 సీట్లు వచ్చాయి. ఇప్పటికే అధికార కూటమిపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా ఉద్ధవ్ థాక్రేను బీజేపీ అన్యాయంగా తొలగించి ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేసిందనే భావన ప్రజలలో బలంగా ఉంది. ఇప్పుడు ఈ విగ్రహం కూలిన ఘటనతో అధికార కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటం ఖాయమనేవాదన బలంగా వినిపిస్తోంది.

మరోవైపు అధికార కూటమిలో కూడా విభేదాలు బయటపడుతున్నాయి. అజిత్ పవార్ వర్గం శివసేన ఈ ఘటనపై బీజేపీకి దూరంగా ఉన్నట్లుగా కనిపించే ప్రయత్నం చేస్తూ నిరసనలు నిర్వహిస్తోంది. షిండే వర్గం శివసేనేమో నేవీపై నెపం నెట్టేయటానికి ప్రయత్నిస్తోంది. అటు బీజేపీ ఏమో షిండే వర్గం శివసేనను, నేవీని బాధ్యులుగా చిత్రీకరించాలని చూస్తోంది.

ఇప్పటికే బద్లాపూర్‌లో ఒక స్కూల్‌లో ఇద్దరు నాలుగో తరగతి అమ్మాయిలపై స్కూల్ పారిశుధ్య ఉద్యోగి లైంగిక అత్యాచారానికి పాల్పడటం, రికార్డ్ స్థాయిలో నిరుద్యోగ సమస్య, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కుంభకోణం వంటి అంశాలు ప్రభుత్వంపై మచ్చలుగా ఏర్పడిఉండగా, ఈ విగ్రహ ఘటన అదనంగా వచ్చి చేరింది. ప్రజలు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చేశారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ఒక రాయిని నిలుచోబెట్టినా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని, ఇండియా కూటమి ప్రభంజనం వీయబోతోందని భారత్ జోడో యాత్ర పుస్తక రచయిత పుష్పరాజ్ దేశ్‌పాండే అన్నారు. మోది క్షమాపణలు కేవలం మొసలి కన్నీళ్ళని, ఆ క్షమాపణలు ఎలాంటి ప్రభావం చూపబోవని పుష్పరాజ్ చెప్పారు.

Read More
Next Story