అధ్యక్షా, వాళ్లను సభలో ఉంచే ఆ శిక్ష వేస్తాం!
x
స్టార్ వార్

అధ్యక్షా, వాళ్లను సభలో ఉంచే ఆ శిక్ష వేస్తాం!

తెలంగాణ అసెంబ్లీలో స్టార్ వార్.. వదలబొమ్మాళీ అంటే వదలబొమ్మాళీ అనే రీతిలో చర్చ..


తెలంగాణ శాసనసభలో శనివారం స్టార్ హీరోలు ఇద్దరు. ఒకరు సీఎం రేవంత్ రెడ్డి, మరొకరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ఒకళ్లు ‘తమలపాకుతో అట్టంటే ఇంకొకళ్ళు కొబ్బరిమట్ట’తో ఇట్టన్న సామెతను తలపించారు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా ‘మేము తవ్వడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు, ఆ సమాధుల్లో మీరు కూరుకుపోతారు’ అని సీఎం రేవంత్ రెడ్డి అంటే `ఢిల్లీ నుంచి దిగుమతి అయిన వాళ్లను మేమెంత మందిని చూళ్లేదు.. ’ అంటూ కేటీఆర్ తిప్పికొట్టారు. గవర్నర్ తమిళి సై ప్రసంగానికి తెలిపే తీర్మానం చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చే సమయంలో చాలా సీమటపాసులు పేలాయి. నేరెళ్లలో ఇసుక మాఫియా దందా నడిచిందంటూ సీఎం రేవంత్ ఓ సందర్భంలో అంటుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డు తగిలి స్పీకర్ పోడియం ముందుకు దూసుకుపోయారు. అప్పుడు సీఎం చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.. ‘అధ్యక్షా, వాళ్లు ఎంత గొడవ చేసినా సభ నుంచి బయటకు పంపే ప్రయత్నం చేయం. ఎందుకంటే వాళ్లందరూ సభలోనే ఉండాలి. వాళ్లందరి నోటి వెంట ఓ భగవద్గీత, ఓ బైబిల్, ఓ ఖురాన్ మాదిరిగా మా ఆరు గ్యారంటీలను వాళ్లతో చదివిస్తా, మాట్లాడిపిస్తా.. వాళ్లకు అదే శిక్ష, వాళ్లకు మైకిచ్చి మాట్లాడించండి అధ్యక్షా’ అని రేవంత్ అన్నప్పుడు సభలో నవ్వులు పూశాయి.

వాళ్లు నిజంగానే సిగ్గుపడాలి అధ్యక్షా...

మరో సందర్భంలోనూ సీఎం రేవంత్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై బాగానే దుమ్మెత్తిపోశారు. గవర్నర్ ప్రసంగమంతా ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా ఉందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రేవంత్ తిప్పికొడుతూ...పాలమూరు జిల్లా కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెడితే ఆయన వాళ్లను గాలికివదిలేశారు. మిడ్ మానేరు ప్రాజెక్ట్ ఎందుకు వదిలేశారు, అందుకు కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్లు సిగ్గుపడాలి అధ్యక్షా.. అన్నప్పుడు కూడా బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగానే అభ్యంతరం చెప్పారు. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి.. వాళ్లనెవ్వర్నీ బయటకు పంపొద్దు అధ్యక్షా, వాళ్లకు ఇదే శిక్ష.. వాళ్లను సభలోనే కూర్చోబెట్టి నా ప్రసంగం వినిపిస్తా. వాళ్లు చేసిన తప్పులేమిటో వాళ్లు తెలుసుకునే చేస్తాం.. అన్నప్పుడు కూడా సభలో నవ్వులు విరిశాయి. తాము కూడా అదే శిక్ష వేస్తామని, రేవంత్ ఏ పాటి చేస్తాడో చూస్తాం, సభలోనే అధికార పక్షం సిగ్గు పడేలా చేస్తామంటూ కేటీఆర్ తిప్పికొట్టారు. ‘కాంగ్రెస్ తెలంగాణకు చేసిన పాపాలకు నిజంగానే వాళ్లు సిగ్గుపడాలి’ అని కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Read More
Next Story