తమిళనాడులో వికలాంగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మఠాధిపతి అరెస్ట్
x

తమిళనాడులో వికలాంగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మఠాధిపతి అరెస్ట్

గత జన్మ పాపాలకు - అంగవైకల్యానికి సంబంధం ఉంటుందని, ఇప్పుడు అనుభవించే కష్టాలకు గత జన్మ పాపాలే కారణమని ఆ మఠాధిపతి వ్యాఖ్యలు చేశారు.


తమిళనాడులో వికలాంగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మఠాధిపతి ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తమిళనాడులో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మహావిష్ణు అనే ఒక మఠాధిపతి ఆగస్ట్ 28న చెన్నైలోని సైదాపేటలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ప్రసంగంలో గత జన్మ పాపాలకు - అంగవైకల్యానికి సంబంధం ఉంటుందని, ఇప్పుడు అనుభవించే కష్టాలకు గత జన్మ పాపాలే కారణమని వ్యాఖ్యలు చేశారు. అక్కడే ఉన్న ఒక అంధుడైన దివ్యాంగ ఉపాధ్యాయుడు దీనిపై ప్రశ్నించినందుకుగానూ అతనికి, మహావిష్ణుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా మహావిష్ణు ఆయనను అవమానించాడని ఆరోపణ. ఈ సంఘటన మొత్తానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయిపోయింది. దీనితో హేతువాదులు, దివ్యాంగుల హక్కులకై పోరాడే ఉద్యమకారులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శనివారం ఆస్ట్రేలియానుంచి తిరిగివచ్చిన మహావిష్ణును పోలీసులు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజలలోని భిన్నవర్గాలమధ్య కలహాలు సృష్టించటం, ఒక వికలాంగుడిని ఉద్దేశ్యపూర్వకంగా అవమానించటం అనే ఆరోపణలు మహావిష్ణుపై మోపబడ్డాయి. పోలీసులు అతనిని సైదాపేట కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం అతను పుళల్ జైలులో బందీగా ఉన్నారు.

మరోవైపు తన వ్యాఖ్యలను మహావిష్ణు సమర్థించుకున్నారు. విద్యార్థులకు మంచి మాటలు చెప్పి మార్గదర్శకత్వం వహించటం మాత్రమేనని, ఎవరి మనోభావాలనూ గాయపరచటం తన ఉద్దేశ్యం కాదని అన్నారు. రుషుల ఆదేశాలమేరకే తాను మాట్లాడానని, స్కూల్‌లో తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. మహావిష్ణు పరమ్‌పోరుల్ ఫౌండేషన్ అనే ఒక మఠాన్ని నడుపుతుంటారు, పరమ్‌పొరుల్ యోగం అనే ఒక వినూత్న ధ్యానం వంటి అంశాలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

ఇదిలా ఉండగా, ఈ సంఘటనపై అటు సనాతనవాదులు, ఇటు హేతువాదుల మధ్య పెద్ద మాటలయుద్ధం జరుగుతోంది. కర్మగురించి, పునర్జన్మ గురించి ప్రస్తుతం తమిళనాడులోని పాఠశాలల్లో పాఠ్యాంశంగా ఉన్న తిరుక్కురళ్‌లో కూడా ఉందని సనాతనవాదులు గుర్తు చేస్తున్నారు. బీజేపీ నాయకులు దీనిపై స్పందిస్తూ, అరెస్ట్ చేయటం తొందరపాటు చర్య అన్నారు. డీఎమ్‌కే ప్రభుత్వం అనవసరంగా దీనిపై రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. “రిజైన్ అన్బిల్ మహేష్” అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరోవైపు ఈ సంఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో, ఈ మహావిష్ణును ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వటానికి ఆహ్వానించిన చెన్నైలోని మరో రెండు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులపై డీఎమ్‌కే ప్రభుత్వం వేటు వేసింది. వారు ఇరువరినీ ట్రాన్స్‌ఫర్ చేసింది.

Read More
Next Story