తిరుమల లడ్డుపై సీబీఐ పర్యవేక్షణలో కొత్త సిట్‍‌!
x

తిరుమల లడ్డుపై సీబీఐ పర్యవేక్షణలో కొత్త సిట్‍‌!

ఈ సిట్‌లో ఇద్దరు సీబీఐ అధికారులు, ఏపీ పోలీస్ శాఖనుంచి ఇద్దరు ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఆహార ప్రమాణాల నియంత్రణ సంస్థకు చెందిన ఒక అధికారి సభ్యులుగా ఉంటారు.


తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలపై సుప్రీమ్ కోర్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కల్తీ జరిగిందా, లేదా అనే విషయం తెలుసుకోవటానికి సీబీఐ, ఏపీ పోలీస్, భారత ప్రభుత్వ ఆహార ప్రమాణాల నియంత్రణ సంస్థ(FSSAI)ల ఉన్నతాధికారులతో కూడిన ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ(సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ సిట్‌లో సీబీఐ డైరెక్టర్ సిఫార్స్ చేసిన ఇద్దరు సీబీఐ అధికారులు, ఏపీ పోలీస్ శాఖనుంచి ఇద్దరు ఉన్నతాధికారులు, భారత ప్రభుత్వ ఆహార ప్రమాణాల నియంత్రణ సంస్థ(FSSAI)కు చెందిన ఒక అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారు. మరోవైపు కొత్త సిట్‌ను ఏర్పాటుచేస్తూ సుప్రీమ్ కోర్ట్ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వాగతించారు.

తిరుమల లడ్డు వ్యవహారంపై సుబ్రమణ్యస్వామి, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తదితరులు దాఖలు చేసిన పిటిషన్ల కేసు ఇవాళ ఉదయం 10.30కు సుప్రీమ్ కోర్టులో విచారణకు వచ్చింది. సుబ్బారెడ్డి తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి, టీటీడీ తరపున సిద్దార్థ లూత్రా, సుబ్రమణ్యస్వామి తరపున రాజశేఖర్ రావు హాజరయ్యారు.

వెంకటేశ్వరస్వామిని నమ్మే కోట్లాదిమంది భక్తుల మనోభావాలు ఈ వివాదంతో నొచ్చుకున్నాయని, వారికి ఉపశమనం కలిగించటంకోసం, తిరిగి నమ్మకం కలిగించటంకోసం ఈ వ్యవహారంపై దర్యాప్తును ఒక స్వతంత్ర దర్యాప్తు బృందం(సిట్) నిర్వహించటమే సముచితమని తాము భావించామని, దీనిలో సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ పోలీస్, ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) ప్రతినిధులు ఉండాలని జస్టిస్ గవాయ్ అన్నారు. ఈ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తే సముచితంగా ఉంటుందని గవాయ్ చెప్పారు. కోర్టును రాజకీయ గొడవలకు వేదికగా వాడుకోవటాన్ని తాము అనుమతించబోమని గవాయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లోని సభ్యుల నిష్పాక్షికత, స్వతంత్రతలను తమ ఆదేశాలు తక్కువ చేసినట్లుగా భావించరాదని గవాయ్ అన్నారు.

విచారణ ప్రారంభమవటంతోనే, దీనిపై స్వతంత్ర దర్యాప్తు బృందం(సిట్)ను వేస్తే బాగుంటుందని ఈ కేసును విచారిస్తున్న ఇద్దరు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ గవాయ్ అన్నారు. ఈ వ్యవహారం పొలిటికల్ డ్రామాగా మారటం తమకు ఇష్టంలేదని, స్వతంత్ర దర్యాప్తు బృందమయితే అందరికీ నమ్మకం ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో పిటిషనర్ల తరపున వాదిస్తున్న కపిల్ సిబల్, రాజశేఖర్ రావు కొత్త సిట్‌కు తమకు అభ్యంతరం లేదని తెలిపారు. సుప్రీమ్ కోర్ట్ స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటుచేసినా తమకు అభ్యంతరం లేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నట్లు దినపత్రికలలో రావటం గురించి సిద్దార్థ లూత్రాను న్యాయమూర్తి గవాయ్ అడుగగా, దినపత్రికల వార్తలను పట్టించుకోవద్దని, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్యాఖ్యలను పత్రికలు తప్పుగా ప్రచురించాయని లూత్రా చెప్పారు.

సెప్టెంబర్ 30న ఈ విషయం తమముందుకు వచ్చినపుడు, దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలేమో కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని సోలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతాకు తాము సూచించామని, ప్రస్తుతం ఏర్పాటయిఉన్న రాష్ట్ర ప్రభుత్వ సిట్ సభ్యుల వివరాలను తాను తెలుసుకున్నానని, వారందరికీ మంచి పేరు ఉందని సోలిసిటర్ జనరల్(ఎస్‌జీ) తుషార్ మెహతా చెప్పారని గవాయ్ చెప్పారు. అదే సిట్‌ను కొనసాగిస్తూ, పర్యవేక్షణకోసం ఒక కేంద్ర అధికారిని సుప్రీమ్ కోర్ట్ అదనంగా నియమించవచ్చని మెహతా చెప్పారని గవాయ్ అన్నారు.

కేసు పూర్వాపరాలు చూస్తే, వైసీపీ హయాంలో తిరుమల లడ్డూకు వినియోగించే నెయ్యిలో గొడ్డుమాంసం కొవ్వు, చేప నూనె ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టులో తేలిందని సెప్టెంబర్ 18న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సెప్టెంబర్ 26న దీనిపై దర్యాప్తుకోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ ఆరోపణలపై సుప్రీమ్ కోర్ట్ ఒక దర్యాప్తుకు ఆదేశించాలంటూ సుప్రీమ్ కోర్టులో సుబ్రమణ్యస్వామి, సుబ్బారెడ్డి, మరో ముగ్గురు పిటిషన్లు దాఖలు చేశారు. కోర్ట్ ఈ పిటిషన్లన్నింటినీ కలిపి గత నెల 30న విచారణకు స్వీకరించింది. ఆ రోజు విచారణలో కోర్ట్ చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆరోపణలపై దర్యాప్తు జరుగుతండగా, ఈ ప్రతిష్ఠాత్మక దేవాలయం పేరు ప్రఖ్యాతులపై మచ్చపడేలా చంద్రబాబు మీడియాముందు ఎలా మాట్లాడతారంటూ తప్పుబట్టింది. అసలు కల్తీ జరిగిందని మీ దగ్గర సాక్ష్యం ఏముందని ప్రశ్నించింది. ల్యాబ్‌లో పరీక్షించబడిన నెయ్యి లడ్డూల తయారీలో వాడినది కాదని, తిరస్కరించబడిన నెయ్యి అని పేర్కొంది. దేముళ్ళను రాజకీయాలకోసం వాడుకోవద్దని వ్యాఖ్యానించింది.

Read More
Next Story