ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం...  సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం నోటీసులు
x
Supreme Court

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం... సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం నోటీసులు

ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై విచారణను మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది....


ఓటుకు నోటు కేసులో శుక్రవారం సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2015వసంవ్సరం నాటి ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై విచారణను మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జరిగిన విచారణను బదిలీ చేయాలంటూ తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను సుప్రీం విచారణకు స్వీకరించింది.


పిటిషన్ ఎవరు దాఖలు చేశారంటే...


ఓటుకు నోటు కేసులో ఏ-1 నిందితుడిగా రేవంత్ రెడ్డి ఈ కేసు విచారణ అవసరాన్ని నొక్కి చెబుతూ, దీన్ని మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు బదిలీ చేయాలని పిటిషన్‌లో కోరారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ్ దవే, దామ శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ ను అడ్వకేట్ ఆన్ రికార్డ్ పి. మోహిత్ రావు ద్వారా పిటిషన్ దాఖలు చేశారు.


తెలంగాణలో పెండింగులో ఉన్న ఓటుకు నోటు కేసు

తెలంగాణ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట విచారణ పెండింగులో ఉన్న ఈ కేసులో నిందితులు ఎ రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇతరులున్నారు. 2015వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగుకు దూరంగా ఉండాలని లేదా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు అడ్వాన్సుగా రూ.50లక్షలు ఇచ్చారని పిటిషన్ లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అప్పటి తన మాజీ బాస్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లంచం ఇవ్వమని ఆదేశించారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ పట్టపగలే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.


పిటిషనర్ ఏం చెప్పారంటే...


అయితే ప్రధాన నిందితుడు తెలంగాణా ప్రస్తుత ముఖ్యమంత్రి, హోం మంత్రిగా కూడా ఉన్నందున, విచారణ సజావుగా జరిగేలా స్వతంత్ర రాష్ట్రానికి ఈ కేసును బదిలీ చేయాలని పిటిషనర్ కోరారు. అంతే కాకుండా సీఎం రేవంత్ పై 88 కేసులు పెండింగులో ఉన్నాయని కూడా పిటిషనర్ ఎత్తి చూపించారు. నిందితుడు ఉన్నతమైన అధికార హోదాలో ఉన్నందున ఫిర్యాదుదారుని, అధికారులను నేరుగా ప్రభావితం చేయగలరని పిటిషనర్లు ఆరోపించారు.


తెలంగాణలో చర్చనీయాంశం...


ఓటుకు నోటు కేసులో నిందితులు స్టే పొందారని, వారు 2015వ సంవత్సరం నుంచి విచారణకు ఆటంకం కలిగిస్తున్నారని సుప్రీంకు సమర్పించిన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో విచారణను పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు సీఎం రేవంత్ కు నోటీసులు జారీ చేయడం తెలంగాణలో సంచలనం రేపింది.

Read More
Next Story