‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’కు  తమిళనాడు వ్యతిరేకం..
x

‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’కు తమిళనాడు వ్యతిరేకం..

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’ విధానానికి, డీలిమిటేషన్‌ ప్రక్రియను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది.


తమిళనాడు అసెంబ్లీ రెండు కీలక తీర్మానాలను ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఒకే దేశం - ఒకే ఎన్నికలు’ విధానానికి, అలాగే 2026 అనంతరం జనాభా లెక్కల ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్‌ ప్రక్రియను వ్యతిరేకిస్తూ.. ఈ రెండు తీర్మానాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బుధవారం (ఫిబ్రవరి 14న) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనికి శాసనసభలో ఆమోదం లభించింది.

ఒకటి ‘‘నిరంకుశం’’, మరొకటి ‘‘కుట్ర’’..

రెండు తీర్మానాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన స్టాలిన్‌..వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదనను ‘‘నిరంకుశం’’ అని, డీలిమిటేషన్‌ ప్రక్రియను ‘‘కుట్ర’’గా అభివర్ణించారు. డీలిమిటేషన్‌ వల్ల తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రం రెండు ప్రతిపాదనలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని, వాటిని వ్యతిరేకించాలని స్టాలిన్‌ కోరారు. ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’ ప్రతిపాదనతో రాష్ట్ర అసెంబ్లీలను ముందుగానే రద్దు చేసే అవకాశం ఉందన్నారు.

మద్దతు పలికిన పార్టీలు..

తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలకు వివిధ పార్టీలు మద్దతు పలికాయి. కాంగ్రెస్‌, వీసీకే, ఎండీఎంకే, వామపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీర్మానాలకు సమర్థించారు. డీలిమిటేషన్‌ వ్యవహారంపై ఏఐఏడీఎంకేకు చెందిన అరుణ్‌మొళి తేవన్‌ మాట్లాడుతూ 1971 జనాభా లెక్కల ఆధారంగా దీనిని నిర్వహిస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని అన్నారు.

బీజేపీకి చెందిన వానతీ శ్రీనివాసన్‌ మాట్లాడుతూ..‘‘ మీ ఆందోళనను మేం అర్థం చేసుకున్నాం, అవసరమైన చర్యలు మా పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

మూజువాణి పద్ధతిలో అమోదం..

రెండు తీర్మానాలను మూజువాణి పద్ధతిలో ఆమోదించారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్‌ ఎం.అప్పావు ప్రకటించారు.

జమిలీ ఎన్నికలు..

దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై ఏర్పాటుచేసిన కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వం వహిస్తున్నారు. జమిలీ ఎన్నికలకు లా కమిషన్‌ సిఫారసులు చేయగా.. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.

Read More
Next Story