టీడీపీ-వైసీపీల 12 గం. పోస్టులపై వీడిన ఉత్కంఠ!
ఇవాళ మధ్యాహ్నం 12 గం.కు ఆ ఉత్కంఠ వీడిపోయింది. దాదాపుగా రెండు పార్టీలు బయటపెట్టినదానిలో అంత పస ఏమీ లేదని తేలిపోయింది.
నిన్న తెలుగుదేశం, వైసీపీ పార్టీలు రెెండూ పోటాపోటీగా… ‘అక్టోబర్ 24 గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఎక్స్‌లో బిగ్ ఎక్స్‌పోజ్’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 12 గం.కు ఆ ఉత్కంఠ వీడిపోయింది. దాదాపుగా రెండు పార్టీలు బయటపెట్టినదానిలో అంత పస ఏమీ లేదని తేలిపోయింది.
నిన్న మొదట తెలుగుదేశం పార్టీ ట్వీట్ వెలువడింది. అది చూడగానే, గత వైసీపీ ప్రభుత్వం తాలూకు కుంభకోణం ఏదైనా బయటపడతారో, లేదా జగన్‌ను ఇరుకున పెట్టే అంశమేదైనా తెరపైకి తెస్తారో అని అందరూ అనుకున్నారు. అసలే నిన్న వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేస్తూ, జగన్‌కు ఆడవాళ్ళంటే ఏమాత్రం గౌరవం లేదని, దొంగ ప్రేమ నటిస్తాడని అభాండాలు వేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వైసీపీపై మరో బండరాయి పడుతుందేమోనని అందరూ ఊహించుకున్నారు. నిన్న టీడీపీ ట్వీట్ వచ్చిన కొద్ది సేపటికే వైసీపీ కూడా ట్వీట్ చేసింది రేపు సంచలన విషయం బయటపెడతాం అంటూ. కూటమి సర్కార్‌ను బర్తరఫ్ చేయాలంటూ మొదటి నెలనుంచే డిమాండ్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం తాలూకు ఏదైనా కుంభకోణాన్ని బయటపెడుతుందా అనే చర్చ జరిగింది.
ఇంత ఆసక్తి రేకెత్తిస్తూ ట్వీట్ చేసిన టీడీపీ, తన సంచలన సమాచారంలో కొంత భాగాన్ని నిన్నే ప్రకటించటంతో దానిపై ఉత్సుకత పోయింది. అది జగన్-షర్మిల ఆస్తి వ్యవహారాలకు సంబంధించి షర్మిల తన అన్నకు రాసిన లేఖ. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంపాదించిన ఆస్తుల్లో తనకు, తన పిల్లలకు దక్కాల్సిన వాటా ఇవ్వకుండా అన్యాయం చేశావు అంటూ ఆ లేఖలో షర్మిల తన అన్న జగన్‌ను అడిగారు.
మరోవైపు వైసీపీ ముందు చెప్పినట్లుగానే ఇవాళ 12 గంటలకు ఎక్స్‌లో ఎక్స్‌పోజ్ ట్వీట్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ అధినేత కొడుకు మాదకద్రవ్యాలకేసులో ఉండటాన్ని గురించి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ కేసు రికార్డుల స్క్రీన్ షాట్‌ను ఎక్స్‌లో పెట్టారు. దానిలో వ్యక్తుల, సంస్థల పేర్లను మాత్రం కనిపించకుండా బ్లర్ చేశారు. సదరు టీవీ అధినేత కొడుకు డ్రగ్స్ దందాకు సంబంధించి 15 మందితో 2,500 సార్లు కాల్స్‌లో మాట్లాడారని, మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియా నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా అని వైసీపీ ట్వీట్‌లో రాశారు. అయితే ఈ వార్త ఇప్పటికే కొద్ది రోజులుగా మీడియాలో నలుగుతుండటంతో అంతగా ఆసక్తి రేకెత్తించలేదనే చెప్పాలి. ఇంతకూ ఆ టీవీ ఛానల్ అధినేత ఎవరయ్యా అంటే, హైదరాబాద్‌లోని ఒక ధనవంతులు ఉండే ప్రాంతానికి సంబంధించిన హౌసింగ్ సొసైటీకి ఆయన అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.