తెలంగాణ బీజేపీ టికెట్ వెరీ హాట్...నేతల పోటాపోటీ
x
BJP

తెలంగాణ బీజేపీ టికెట్ వెరీ హాట్...నేతల పోటాపోటీ

తెలంగాణలో బీజేపీ టికెట్ల కోసం నేతల మధ్య పోటీ పెరగడంతో ఈ టికెట్ కేటాయింపు వ్యవహారం వెరీ హాట్‌గా మారింది. బీఆర్ఎస్ నేతల ఆసక్తి‌తో పార్టీ ఫిరాయింపులకు తెర లేచింది.


దేశంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ (బీజేపీ) మూడోసారి విజయం సాధించి, మోదీ ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ఫెడరల్-పుతియతలైమురై యాప్ట్ 2024 ప్రీ -పోల్ సర్వేతో పాటు పలు సర్వేలు వెల్లడించిన నేపథ్యంలో తెలంగాణలో బీజేపీలో చేరేందుకు పలు పార్టీల నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. నరేంద్రమోదీని మూడో సారి ప్రధానమంత్రిని చేసేందుకు అధిక ఎంపీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో వరుస యాత్రలు చేపడుతున్న తెలంగాణ బీజేపీ నేతలు బలమున్న బీఆర్ఎస్ నేతలకు గాలం వేశారని సమాచారం. నాగర్ కర్నూలు సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ రాములు ఇటీవల జరిగిన కేటీఆర్ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై గ్రాఫ్ కోల్పోయిన బీఆర్ఎస్ అభ్యర్థిగా కంటే ప్రచారంలో ముందున్న బీజేపీ ఎంపీగా బరిలోకి దిగేందుకు రాములు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. దీనిలో భాగంగా ఎంపీ రాములుతోపాటు ఆయన కుమారుడు కూడా బీజేపీలో చేరనున్నట్లు బీజేపీ నేతలు చెప్పారు. దీంతోపాటు ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఒకరిద్దరు కీలక నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశముంది.


ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీకి అనుకూలమా?
ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో పరిధిలో బీజేపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు దక్కాయి. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ సీట్లలో బీజేపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడంతో ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీకి అనుకూలంగా ఉందని ఆ పార్టీ జరిపిన సర్వేలోనూ తేలింది. దీంతో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు అభ్యర్థిత్వంపై బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, మాజీమంత్రి గెడం నగేష్ ను బీజేపీలోకి చేర్చుకొని టికెట్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చెప్పారు. మరో వైపు ఆదిలాబాద్ ఎంపీ సీటును తనకే ఇవ్వాలని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రమేష్ రాథోడ్ కోరుతున్నారు.

రిజర్వుడ్ స్థానాల్లో నేతల మధ్య పోటాపోటీ
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని సర్వేలు వెల్లడించడంతో తెలంగాణలోని రిజర్వుడ్ సీట్లలో టికెట్ల కోసం ఆ పార్టీ నేతల నుంచి పోటీ నెలకొంది. ఆదిలాబాద్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలు ఎస్టీలకు, వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి ఎంపీ సీట్లను ఎస్సీ అభ్యర్థులకు రిజర్వు చేశారు. ఆదిలాబాద్ ఎంపీ సీటును సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఆశిస్తుండగా, స్థానికంగా ఉన్న నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నగేష్ అభ్యర్థిత్వం వైపు ఆసక్తి చూపిస్తున్నారని ఆ పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. మాజీ ఎంపీ అయిన రమేష్ రాథోడ్ కూడా ఈ సీటును ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ, పార్టీలో సీనియర్ అయిన తనకే టికెట్ ఇవ్వాలని కోరామని రమేష్ రాథోడ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పార్టీలో ఉన్న తనను కాదని బీఆర్ఎస్ నేతకు టికెట్ ఎలా ఇస్తారని రమేష్ రాథోడ్ ప్రశ్నించారు.

నేతల మధ్య టికెట్ల పంచాయతీ
బీజేపీ నాయకుల మధ్య ఎంపీ టికెట్ల పంచాయతీ నెలకొంది. మహబూబాబాద్ సీటును బీజేపీకి చెందిన హుసేన్ నాయక్ ఆశిస్తుండగా ఇతర పార్టీ నుంచి నేతను చేర్చుకొని టికెట్ ఇవ్వాలని బజీేపీ నేతలు భావిస్తున్నారని సమాచారం. మరో వైపు నాగర్ కర్నూల్ సీటు కోసం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి ఆసక్తి చూపిస్తుండగా, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములును పార్టీలోకి చేర్చుకొని టికెట్ ఇవ్వాలని యోచిస్తున్నారు. వరంగల్ సీటు కోసం మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ పోటీ పడుతుండగా బీఆర్ఎస్ నాయకుడిని చేర్చుకొని ఆయనను అభ్యర్థిగా రంగంలోకి దించాలని కమలనాథులు భావిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు చెప్పారు. పెద్ద పల్లి ఎంపీ స్థానం కోసం కుమార్, మిట్టపల్లి సురేందర్ లు పోటీ పడుతున్నారు. ఈ సారి రిజర్వుడ్ స్థానాల కోసం బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఆసక్తి చూపిస్తుండటం విశేషం.

పార్లమెంట్ ప్రచారంలో కమలదళం ముందంజ
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో వికసిత భారత్, విజయ సంకల్ప యాత్రల పేరిట బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే వివిధ కార్యక్రమాలతో కమలనాథులు ప్రజల్లోకి వెళుతున్నారు. మోదీ పదేళ్లలో సాధించిన విజయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రాజకీయ వాతావరణం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో పార్లమెంటు బీజేపీ అభ్యర్థిత్వం కోసం పార్టీ నేతలతోపాటు బయటి పార్టీల నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

మూడు సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థుల ఖరారు
తెలంగాణలో బీజేపీకి నాలుగు ఎంపీ సిట్టింగ్ స్థానాలున్నాయి. వీటిలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధినేత జి కిషన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేయనుందని ఆ పార్టీ వర్గాల సమాచారం. దీంతోపాటు కరీంనగర్ ఎంపీ సీటును బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కు, నిజామాబాద్ పార్లమెంటు సీటును ప్రస్థుత సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఖరారు చేశారు. మరో సిట్టింగ్ అయిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అభ్యర్థిత్వాన్ని మాత్రం బీజేపీ పెండింగులో పెట్టింది. చేవేళ్ల సీటును గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి సీటును మాజీ బీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కు ఖరారు చేసిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

11 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు
తెలంగాణలో బీజేపీకి నాలుగు సిట్టింగ్ స్థానాలుండగా, ఈ సారి ఎన్నికల్లో వీటి సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణలోని 12 ఎంపీ సీట్లపై గురి పెట్టిన కమలనాథులు దీనికి అనుగుణంగా బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించాలని నిర్ణయించారు. దీనికోసం ఇతర పార్టీల నుంచి నేతలను పార్టీలోకి తీసుకునేందుకు బీజేపీ నేతలు వ్యూహాలు రూపొందించారు. రామమందిర నిర్మాణం, పదేళ్ల అభివృద్ధి పనులతో మోదీ పట్ల ఓటర్లలో ఆదరణ పెరిగిన నేపథ్యంలో కనీసం 8 స్థానాలనైనా సాధించాలని బీజేపీ నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు. దీనిలో భాగంగా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సత్తాను చూపించేందుకు నేతలు పట్టుదలగా దీటైన వ్యూహాలతో ముందుకు పోతున్నారు. బలమైన అభ్యర్థుల ఎంపిక పర్వం నాలుగైదు రోజుల్లో ఒక కొలిక్కి వస్తుందని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



Read More
Next Story