తెలంగాణ అసెంబ్లీ గరం.. గరం..  వాడివేడీ చర్చలతో లైవ్లీగా సాగిన సభ
x
అసెంబ్లీలో ప్రసంగిస్తున్న కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ గరం.. గరం.. వాడివేడీ చర్చలతో లైవ్లీగా సాగిన సభ

గ‌త ప‌దేండ్ల‌లో ర‌క్తాన్ని రంగ‌రించినం.. మెద‌ళ్ల‌ను క‌రిగించినం, ప్రాణం పెట్టి ప‌ని చేసినం.. బండ్లు ఫ్రీ, బంగారం ఫ్రీ.. అన్లే


సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ సాగాయి. పరస్పర వాగ్భాణాలు, దెప్పిపొడుపులు, ఎత్తిపొడుపులు, వ్యంగాస్త్రాలతో శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. వెల్ లోకి దూసుకురావడాలు, స్పీకర్ ముందు అరుపులు, కేకలు షరా మామూలుగానే నడిచాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఉదయం పదిన్నరకు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై నిన్న ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ వాడివేడిగా సాగింది.

రేవంత్ పై విరుచుకుపడిన కేటీఆర్...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు జవాబు ఇచ్చిన తర్వాత కూడా సభలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదనలు సాగుతూనే వచ్చాయి. చాలా కాలం తర్వాత తెలంగాణ సభ జరిగిన తీరు ప్రజల్ని ఆకట్టుకుంది. ప్రతిపక్ష పార్టీ తరఫున మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చర్చ ప్రారంభంలోనే సీఎం రేవంత్ పై విమర్శల దాడి చేశారు.

అన్ని అనర్థాలకు కాంగ్రెస్సే మూలమన్న కేటీఆర్

అన్ని అనర్థాలకు కాంగ్రెస్సే మూలమంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. “2009-2013 మ‌ధ్య కాలంలో కాంగ్రెస్ ప‌రిపాల‌న‌లో 8,198 మంది రైతులు క‌రెంట్ షాకుల‌తో చ‌నిపోయారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో విద్యుత్ రంగం గురించి చాలా అవాస్త‌వాలు చెప్పారు. వాస్త‌వాలు చెప్పాల్సిన బాధ్య‌త మా మీద ఉంది. కాంగ్రెస్ హ‌యాంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మ‌ర్లు, అర్ధ‌రాత్రి వ‌చ్చే క‌రెంట్ కోసం బావుల కాడికి పోవుడు. 2009 నుంచి 2013 మ‌ధ్య‌లో 8198 మంది రైతులు క‌రెంట్ షాకుల‌తో చ‌నిపోయారు రైతులు. గ‌త ప‌దేండ్ల కాలంలో పాల‌మూరులో వ‌ల‌స‌లు బంద్ అయినాయి. రాష్ట్రంలో వ‌రి నాట్ల కోసం 14 రాష్ట్రాల నుంచి కూలీలు వ‌చ్చి నాట్లు వేస్తున్నారు. ఫ్లోరోసిస్ నుంచి న‌ల్ల‌గొండ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ విముక్తి క‌ల్పించారు. ఫ్లోరోసిస్ ర‌హిత రాష్ట్రంగా కేంద్రం ప్ర‌క‌టించింది. నేత‌న్న‌ల ఆత్మ‌హ‌త్య‌లు బంద్ అయిన‌య్. నేడు సిరిసిల్ల సిరిశాల‌గా మారింది. సంక్షేమంలో స్వ‌ర్ణ‌యుగం సృష్టించాం. 200 ఉన్న పెన్ష‌న్‌ను 2 వేలు చేశాం. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో అంకాపూర్, గంగాదేవిప‌ల్లి గురించి చెప్పేవారు. అది కూడా ఆ గ్రామ‌స్తులు అభివృద్ధి చేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో జాతీయ పంచాయ‌తీ అవార్డుల్లో 30 శాతం గెలుచుకున్నాం. ప‌ల్లెప్ర‌గ‌తితో ప‌ల్లెలు అభివృద్ధి చెందాయి” అన్నారు కేటీఆర్.

కేటీఆర్ ప్రసంగానికి పలువురు అధికార పక్ష సభ్యులు అడ్డు తగిలినా ఆయన ఏమాత్రం లెక్క చేయకుండానే కొండకచో చురకలు వేస్తూనే “ఓట్ల కోసం బ‌స్సులు ఫ్రీ, బంగారం ఫ్రీ, బండి ఫ్రీ” అన్నమాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏమేమి సాధించామో చెప్పుకొచ్చారు. “గ‌త ప‌దేండ్ల‌లో ర‌క్తాన్ని రంగ‌రించినం.. మెద‌ళ్ల‌ను క‌రిగించినం, ప్రాణం పెట్టి ప‌ని చేసినం కాబ‌ట్టే ఇవాళ ఒక్కొక్క రంగంలో తెలంగాణ భార‌త‌దేశంలోనే అగ్ర‌గామిగా నిలిచింది” అంటూ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌కు గట్టి కౌంటరే ఇచ్చారు. సీఎం రేవంత్ కి మ‌ర్యాద‌క‌రంగా మాట్లాడడం రాదని కూడా వ్యాఖ్యానించారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం..

రేవంత్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మరో మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహా స్పందించారు. కేటీఆర్ ప్ర‌సంగానికి అడ్డుప‌డిన ఆయ‌న‌.. పార్టీలో మెజారిటీ ఉన్న‌ప్పుడు మేం హైక‌మాండ్‌కు అప్ప‌జెప్పుతాం. హైక‌మాండ్ తీసుకున్న నిర్ణ‌యానికి శిర‌సావహిస్తాం. అది మేం పాటిస్తాం అని దామోద‌ర రాజ‌న‌ర్సింహ చెప్పారు. దానిపై మళ్లీ కేటీఆర్ మాట్లాడుతూ.. ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్య‌మంత్రి అని చెప్పాను. వంద‌ల కోట్ల మంది భార‌తీయుల‌ను కాద‌ని బ‌య‌టి దేశం వాళ్ల‌ను తీసుకొచ్చి అధ్య‌క్షుల‌ను చేసుకున్న‌ది ఎవ‌రు..? ఈ దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నారైల గురించి మాట్లాడితే ఎట్ల‌..? అని కేటీఆర్ విమ‌ర్శించారు.

గడ్డిపోచల్లా పదవుల్ని వదిలేశామన్న హరీశ్...

2004 ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిందే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉట్టిగ‌నే త‌మ‌కు ప‌ద‌వులు ఇచ్చింద‌ని రేవంత్ రెడ్డి మాట్లాడ‌టం స‌రికాద‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కాకుండానే హ‌రీశ్‌రావును మంత్రిని చేసిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీది అని రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌కు హ‌రీశ్‌రావు వివ‌ర‌ణ ఇచ్చారు.

కాంగ్రెస్ కు జీవం పోసిందే మేమన్న హరీశ్..


“చంద్ర‌బాబు హ‌యాంలో క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌ని కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీతో హిమాచ‌ల్ భ‌వ‌న్‌లో చ‌ర్చ‌లు జ‌రిగిన‌ప్పుడు వెంక‌ట‌స్వామి, మాజీ ఎంపీ సురేంద‌ర్ రెడ్డి, కేసీఆర్, ఆలే న‌రేంద్ర నేను ఆ చ‌ర్చ‌ల్లో ఉన్నాను. పొత్తుల చ‌ర్చ‌లు జ‌రిగిన‌ప్పుడు త‌ప్ప‌కుండా ఈ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామ‌ని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే నా ఇంట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం తీసుకొని పో అని ప్ర‌ణ‌బ్ అన్నారు. మేం పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. మీరు ఏదో గెలిస్తే మాకు ప‌ద‌వులు ఇవ్వ‌లేదు. మేం కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికి స‌హ‌క‌రించాం” అని హ‌రీశ్‌రావు విరుచుకుపడ్డారు. ఆ తర్వాత మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఆరంభ శూరత్వం కాకుండా తుది కంటా ప్రజలకు మేలు చేయాలని కోరారు. అందుకు తాము సహకరిస్తామని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు జవాబు ఇచ్చారు.

Read More
Next Story