తెలంగాణ ఎలక్టోరల్ బాండ్ల  బాహుబలి మేఘా
x
Electoral Bonds (Photo Credit : Facebook)

తెలంగాణ ఎలక్టోరల్ బాండ్ల బాహుబలి మేఘా

ఎలక్టోరల్ బాండ్ల బండారం బయట పడింది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బడా సంస్థలు అధికార పార్టీలకు అత్యధికంగా బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చారు.


బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 4లక్షల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ, కాళేశ్వరం, తదితర పలు ప్రాజెక్టుల పనులను చేపట్టారు. ఈ బడా కాంట్రాక్టు పనులను అధిక భాగం మెగా ఇంజినీరింగ్ సంస్థ చేపట్టింది. దీంతో మెఘా కంపెనీ అందరికంటే అత్యధికంగా బాండ్ల రూపేణా అధికార పార్టీకి నిధులు ఇచ్చిందని వెల్లడైంది. ఎలక్ట్రోరల్ బాండ్లలో తెలంగాణలో అత్యధికంగా ఇన్ ఫ్రా, రియాల్టీ, ఫార్మా సంస్థలే ముందున్నాయి. ఆయా రంగాలకు లబ్ధి చేకూర్చినందువల్లే వారు బాండ్ల రూపంలో తిరిగి పార్టీలకు బాండ్లు ఇచ్చారని చెబుతున్నారు.


బాండ్ల కొనుగోలులో మెగానే టాప్
హైదరాబాద్ నగరానికి చెందిన బడా నీటిపారుదల శాఖ కాంట్రాక్టర్లు, ఇన్ ఫ్రాస్టక్చర్ సంస్థలు, రియల్టర్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఎన్నికల బాండ్ల రూపేణా అత్యధికంగా నిధులు చెల్లించారు. దేశంలో మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ పలు నీటిపారుదల, ఇన్ ఫ్రాస్టక్చర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. ఈ మెఘా సంస్థ దేశంలోనే రెండవ అతిపెద్ద బాండ్సు కొనుగోలు చేసిన సంస్థగా నిలిచింది. రూ.966 కోట్లను బాండ్లను కొనుగోలు చేసింది.చిన్న కాంట్రాక్టరు నుంచి ఎదిగిన మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ బడా సంస్థగా ఎలా ఎదిగిందో ఈ ఎలక్టోరల్ బాండ్లను చూస్తే విదితమవుతోంది.

యశోదా ఆసుపత్రి సెకండ్ ప్లేస్
ఘజియాబాద్ కేంద్రంగా ఉన్న టాప్ కార్పొరేట్ ఆసుపత్రి యశోదా సూపర్ స్పెషాలిటీ రూ.162 కోట్లను బాండ్ల రూపంలో వెచ్చించింది.దేశంలోనే రెండవ అతిపెద్ద బాండ్ల కొనుగోలు దారుగా యశోదా ఆసుపత్రి నిలిచింది.ఫార్మా జెయింట్ డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీ రూ.80కోట్లు, నాట్కో ఫార్మా రూ.70 కోట్లు, నవయుగ ఇంజినీరింగ్ రూ.66కోట్లు, అరబిందో ఫార్మా రూ.50కోట్లు, హెటిరో డ్రగ్స్ రూ.69 కోట్లు, ఎంఎస్ఎన్ ఫార్మా గ్రూప్ రూ.38 కోట్లు, గ్రీన్ కో, రాజపుష్ప గ్రూపులు రూ.35కోట్లు, హైదరాబాద్ నగరంలోని అతిపెద్ద బిల్డర్ అయిన మై హోం గ్రూప్ రూ.20 కోట్లు వెచ్చించాయి.

కాంట్రాక్టర్లు ఎందరో...
దివీస్ లేబోరేటరీ, యునైటెడ్ ఫాస్పరస్ ఇండియా. రామ్ కో సిమెంట్, శ్రీ చైతన్య, ఇనార్బిట్ మాల్, ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థలు బాండ్ల రూపేణా డబ్బులు చెల్లించాయి.హైదరాబాద్ నగరంలోని పలువురు కాంట్రాక్టర్లు ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున కాంట్రిబ్యూట్ చేశారు. బాండ్లు కొన్న కాంట్రాక్టర్లలో గుల్లపల్లి కోటేశ్వరావు, పొనుగంటి హేమందర్ రావు, మందాడి రాములు, పప్పిరెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి, పెద్దిరెడ్డి రామాంజనేయ రెడ్డి, సాంగిరెడ్డి తిరుపతిరెడ్డి, స్వప్న రామాంజనేయ రెడ్డి, సంగిరెడ్డి తిరుపతిరెడ్డి, స్వప్న చెన్నవరం, పి శివశంకర్ రెడ్డి, పోలిన జ్ణానేశ్వర్ రావు తదితరులున్నారు.

ప్రజాధనం కొల్లగొట్టి బాండ్లు కొన్నారు...
గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకే అధికంగా సంస్థలు విరాళాలు అందించాయని హైదరాబాద్ నగరానికి చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రాజకీయ పార్టీలకు ఎవరు ఎంత చెల్లించారు అనేది రహస్యంగా ఉంచారని ఆయన చెప్పారు. ‘‘వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందిన బడా కాంట్రాక్టు సంస్థలే అధికార బీఆర్ఎస్ కు బాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చాయి, ఈ కాంట్రాక్టుల టెండర్లను పారదర్శకంగా ఇవ్వలేదు, ఫార్మా, ప్రాజెక్టు కాంట్రాక్టర్లు ప్రజా ధనాన్ని కొల్లగొట్టి, తిరిగి బాండ్ల రూపంలో ఆయా అధికార పార్టీకి ఇచ్చారు’’ అని సోమ శ్రీనివాసరెడ్డి చెప్పారు.

ఏ పార్టీకి ఎంత ఇచ్చారనేది గోప్యం
బడా కార్పొరేట్ కంపెనీలకు, రాజకీయ పార్టీలకు ఉన్న బంధం తాజాగా వెలుగు చూసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్టకేలకు విడుదల చేసింది. అయితే ఏ కంపెనీ ఏ రాజకీయ పార్టీకి విరాళాలు అందించిందనే వివరాలను మాత్రం ఎస్‌బీఐ గోప్యంగా ఉంచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర ఇన్ ఫ్రాస్టక్చర్ కాంట్రాక్టులు చేసిన బడా ఇంజినీరింగ్ కంపెనీలు అధికార పార్టీలకు పెద్ద ఎత్తున ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు చెల్లించిందని వెల్లడైంది. పలు ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, పలు ఇన్ ఫ్రాస్టక్చర్ కాంట్రాక్టులు చేసిన బడా కంపెనీలు తమకు వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని కాంట్రాక్టులు ఇచ్చిన అధికార పార్టీలకు బాండ్ల రూపంలో చెల్లించడం వెనుక మతలబు తెలియాల్సి ఉంది.

అధికార పార్టీలకే అధికంగా ఎలక్ట్రోరల్ బాండ్లు : ఉస్మానియా మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, వైసీపీ పార్టీలకే కాంట్రాక్టర్లు, బడా సంస్థలు బాండ్ల రూపేణా విరాళాలు ఇచ్చాయని ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘రాజకీయ పార్టీలకు విరాళాలను రహస్యంగా ఇవ్వకుండా బాండ్ల రూపేణా ఇవ్వాలని గతంలో అరుణ్ జైట్లీ కేంద్రమంత్రిగా ఉన్నపుడు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు, కానీ ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందిన కార్పొరేట్ కంపెనీలు ప్రతిగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో విరాళాలను అందిస్తున్నాయి’’ అని తిరుపతిరావు పేర్కొన్నారు. ‘‘ఎవరు? ఎవరికి విరాళాలు ఇచ్చారు అన్నది తెలియకుండా ఉండాలంటే ఈ బాండ్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్, లేదా రిజర్వు బ్యాంకుకు అప్పగించాలి’’ అని కోరారు. బాండ్ల విధానం లేకపోతే క్విడ్ ప్రో కో పేరిట లంచాల బాగోతానికి తెర లేస్తుందని ప్రొఫెసర్ తిరుపతి రావు అభిప్రాయపడ్డారు.

బీఆర్ఎస్ దేశంలోనే 4వస్థానం
2014 లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు పరిపాలించిన భారత రాష్ట్ర సమితి ఎన్నికల బాండ్లలో దేశంలోనే నాల్గవ స్థానంలో నిలిచింది. 2017-18 నుంచి 2022-23 వరకు రూ.913 కోట్ల బాండ్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గత పదేళ్లలో రూ. 382 కోట్లు రావడంతో దేశంలో బాండ్లలో ఏడవస్థానంలో నిలిచింది. తెలుగుదేశంపార్టీ రూ.147 కోట్లతో 8వస్థానంలో ఉంది. 30 విడదతలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 29 బ్రాంచీల నుంచి ఈ విరాళాలు వెల్లువెత్తాయి.

ఎలక్టోరల్ బాండ్లు రాజకీయ పార్టీలకు ఇచ్చే లంచాలే: బీఎస్ రాములు ఆరోపణ
ప్రాజెక్టులు, నిర్మాణ కాంట్రాక్టులు పొందిన బడా కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో విరాళాలు అందించాయని, ఇవన్నీ లంచాలేనని తెలంగాణ బీసీ సీనియర్ నాయకుడు బీఎస్ రాములు ఆరోపించారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందిన వారు దానిలో కొంత కమీషన్ ను బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు చెల్లించాయని రాములు చెప్పారు. దేశంలో బడా కార్పొరేట్ కంపెనీలన్నీ బీజేపీకి అత్యధికంగా బాండ్లు ఇచ్చారని వెల్లడి అయిందని రాములు చెప్పారు.

బీజేపీకి అత్యధిక బాండ్లు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే అత్యధిక శాతం అంటే రూ.6,560 కోట్లను వివిధ కార్పొరేట్ కంపెనీలు బాండ్ల రూపంలో చెల్లించాయి. లక్ష్మీ మిట్టల్, భార్తీ ఎయిర్ టెల్, ఫ్యూచర్ గేమింగ్, వేదాంత గ్రూపులు భారీ ఎత్తున రాజకీయ పార్టీలకు విరాళాలు అందించాయి. బాండ్ల విరాళాల్లో బీజేపీ తర్వాత వరుస స్థానాల్లో తృణమూల్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నిలిచాయి. అధికారంలో లేని రాజకీయ పార్టీలకు అరకొర బాండ్లు దక్కాయని విశ్లేషణలో తేలింది. అధికార పార్టీలకే కంపెనీలు బాండ్ల రూపంలో చెల్లించాయని వెల్లడైంది.









Read More
Next Story