నిప్పుల కొలిమిలో తెలంగాణ...ఎల్లో అలర్ట్ జారీ
x
heat waves

నిప్పుల కొలిమిలో తెలంగాణ...ఎల్లో అలర్ట్ జారీ

భగభగ మండుతున్న సూర్యుడితో తెలంగాణ నిప్పుల కొలిమి చందంగా మారింది. మండే ఎండలు, తీవ్ర వడగాలుల ప్రభావంతో జనం అల్లాడుతున్నారు. ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


రాబోయే ఏడు రోజుల పాటు తెలంగాణ భగభగ మండనుంది. సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపింపజేస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. - ఆదిలాబాద్, అసిఫాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలో ఈ నెల 29,30 తేదీల్లో వడగాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు.

- 21 జిల్లాల్లో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మే 1, 2 తేదీల్లోనూ వడగాలుల ప్రభావం వల్ల ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.
- మండే సూర్యుడితో వడగాలుల వాతావరణం మే 4వతేదీ వరకు కొనసాగుతుందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.
- తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెల వరకు వేడిగాలుల నుంచి ప్రజలకు ఉపశమనం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

మండుతున్న సూర్యుడు...వడదెబ్బతో ముగ్గురి మృతి
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి, దామరచర్ల,త్రిపురారం, కట్టంగూరు, హాలియా, నాంపల్లి, ములుగు జిల్లా ధర్మవరం, మంగపేట, భద్రాద్రి జిల్లా అశ్వాపురం, భూపాలపల్లి జిల్లా కొత్తపల్లెగొరి,వనపర్తి జిల్లా పనగల్ ప్రాంతాల్లో అత్యధికంగా 45 డిగ్రీల కంటే అదికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాలుల ప్రభావం వల్ల తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే ముగ్గురు వడదెబ్బతో మృత్యువాత పడ్డారని తెలంగాణ అధికారులు చెప్పారు.

ఈ జిల్లాల్లో 40డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్,మంచిర్యాల,మహబూబ్ నగర్, మహబూబాబాద్, కొమురంభీం, ఖమ్మం,ములుగు,వరంగల్, వనపర్తి, సూర్యాపేట, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, నారాయణపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, కరీంనగర్ జిల్లాల్లో సోమవారం 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. హైదరాబాద్, కామారెడ్డి, జనగామ, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నేడు,రేపు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు చెప్పారు.వర్షాల వల్ల అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలబడే అవకాశముందని, తడి వల్ల రోడ్లు జారే ప్రమాదముందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. గాలుల తీవ్రత వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడం, విద్యుత్, మంచినీటి సరఫరాలో అంతరాయం వాటిల్లే అవకాశముందని ఎల్లో అలర్ట్ లో ఐఎండీ పేర్కొంది.

మే 1వతేదీ ఆరంజ్ అలర్ట్
మే 1వతేదీన తెలంగాణాల్లోని పలు జిల్లాల్లో వడగాలుల తీవ్రత వల్ల ఐఎండీ అదికారులు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మండుతున్న ఎండలతోపాటు వడగాలులు వీచే అవకాశముంది.

ఇళ్లలో నుంచి బయటకు రావద్దు...
వడగాలుల వల్ల శిశువులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు. ప్రజలు అవసరం అయితే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని, దాహం వేయక పోయినా తగినంత మంచినీరు తాగాలని అధికారులు సూచించారు. తేలికైన, లేతరంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని కోరారు. ఎండలో వెళ్లినపుడు మీ తలను వస్త్రం లేదా టోపి, లేదా గొడుగుతో కప్పుకోవాలని ఐఎండీ అధికారులు సలహా ఇచ్చారు. వడగాలుల ప్రభావం వల్ల ఓఆర్ఎస్, లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ తాగాలని వారు సూచించారు.

ఎల్లో, ఆరంజ్ అలర్టులు అంటే ఏమిటి?
వాతావరణ పరిస్థితుల తీవ్రతను తెలియజేయడానికి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రంగుల రూపంలో హెచ్చరికలను జారీ చేస్తోంది. తొలి రోజుల్లో ఆకుపచ్చ రంగు, పసుపు, నారింజ రంగు అలర్ట్ అంటూ నాలుగు రకాల రంగులు వాడుతున్నారు. ఆకుపచ్చ అంటే ఎలాంటి చర్యలు అవసరం లేదని, పసుపు అంటే సిద్ధంగా ఉండమని, నారింజ అంటే సంసిద్ధులు కండి అని హెచ్చరికను చెబుతోంది.వాతావరణ పరిస్థితులు ఎండైనా, వడగాలులు, వర్షం అయినా ఈ రంగులతో అలర్ట్ లు జారీచేస్తుంటారు.
- ఎల్లో అలర్ట్ అనేది ఆరెంజ్ అలర్ట్‌గా మారుతుంది. వాతావరణ పరిస్థితులు మరింత దిగజారినప్పుడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. వర్షాలు, ఎండల తీవ్రత వల్ల రోడ్డు రవాణా, విమానాల రాకపోకలకు అంతరాయం, ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉన్న సమయాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. రెడ్ అలర్ట్ అంటే డేంజర్ పరిస్థితి. సహజంగా తుపాన్లు వచ్చినప్పుడు ఈ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంటారు.

ఎల్‌నినో బలహీనంతో రుతుపవనాలు అనుకూలం
ఈ ఏడాది రికార్డుస్థాయి ఉష్ణోగ్రతల నమోదుకు కారణమైన ఎల్‌నినో క్రమేణా బలహీనపడుతోంది. ఎల్‌నినో ప్రభావం మే నెల మొదటివారం నాటికి తటస్థ పరిస్థితికి చేరుకుంటుందని అమెరికా దేశ వాతావరణ శాఖ,మరో ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఎల్‌నినో కథ ముగిసిందని ఆస్ట్రేలియా వాతావరణశాఖ కూడా ప్రకటించింది. ఎల్‌నినో బలహీన పడటం వల్ల దేశంలో నైరుతి రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని స్కైమెట్ వెల్లడించింది. ఎల్‌నినో వచ్చేనెల నాటికి తటస్థ పరిస్థితులకు చేరుకున్నా వేసవి సీజన్‌లో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో మారిన పరిస్థతుల ప్రభావం వల్ల ఆ దిశ నుంచి వచ్చే చల్లని గాలులతో నైరుతి ఆశాజనకంగా మారుతుందని స్కైమెట్ వివరించింది.


Read More
Next Story