బీఆర్ఎస్‌పై తెలంగాణ బొగ్గుగని సంఘం తిరుగుబావుటా
x
kalvakuntla kavitha (Photo Credit : Facebook)

బీఆర్ఎస్‌పై తెలంగాణ బొగ్గుగని సంఘం తిరుగుబావుటా

బీఆర్ఎస్ ఓటమి, కల్వకుంట్ల కవిత అరెస్ట్ వ్యవహారం ఆ పార్టీకి శాపంగా మారాయి. కవిత నేతృత్వంలోని బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని సంఘం తిరుగుబావుటా ఎగురవేసింది.


తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు అప్పటి ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గౌరవ అధ్యక్షురాలిగా సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఏర్పాటు అయింది. కవిత ఆధ్వర్యంలో ఏర్పడిన సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ కార్మిక సంఘంగా పనిచేసింది. గత ప్రభుత్వ హయాంలో సింగరేణి పరిధిలోని కొత్తగూడెం, సత్తుపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, గోదావరిఖని ప్రాంతాల్లో హవా నడిపిన ఈ కార్మిక సంఘం బీఆర్ఎస్ ఓటమి, గౌరవ అధ్యక్షురాలు కవితను ఈడీ అరెస్ట్ చేసిన ఘటనతో కకావికలం అయింది. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి వలస పోతున్నారు. మరో వైపు మహారాష్ట్రలో బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్థుతం బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం కూడా ఆ పార్టీకి దూరమైంది.


బొగ్గు కార్మిక సంఘానికి కవిత నేతృత్వం
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో 20వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిందని, డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకునే కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించామని టీబీజీకేఎస్ సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసిన కల్వకుంట్ల కవిత గతంలో కార్మికుల సమావేశంలో ప్రకటించారు. సింగరేణిని లాభాల బాటలో నడిపించిన ఘనత కేసీఆర్ దేనని అప్పట్లో కవిత పేర్కొన్నారు. గతంలో కేంద్రం సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కవిత పిలుపు మేరకు సింగరేణి కార్మికులు సమ్మె కూడా చేశారు.

గని కార్మికుల యూనిఫాం ధరించి...పిడికిలి బిగించిన కవిత
సింగరేణి బొగ్గు గని కార్మికుల యూనిఫాం ధరించి తలకు లైటు పెట్టుకొని,పోరాటానికి గుర్తుగా చేయి పైకెత్తి పిడికిలి బిగించి కార్మికులతో కలిసి కవిత పలు సమావేశాలు నిర్వహించారు. కొవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో ఈ వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘం అధ్యక్షురాలైన కవిత సింగరేణి అదికారులను కోరారు. సింగరేణి కార్మికుల మద్ధతు బీఆర్ఎస్ పార్టీకి దక్కాలని కవిత గతంలో పలు ప్రయత్నాలు చేశారు. బొగ్గుగని కార్మిక పక్షపాతి కేసీఆర్ అంటూ కార్మిక వర్గాల్లో కవిత గతంలో ప్రచారం కూడా చేశారు. సింగరేణిని కాపాడింది కేసీఆరే నంటూ పలు కార్మిక సమావేశాల్లో కవిత పాల్గొని ప్రచారం చేశారు. అదంతా గతం.

కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవి ఊస్ట్
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిన అనంతరం ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి నేతల వలసలు, కేసీఆర్ కుటుంబంపై నమోదవుతున్న వరుస కేసులు, అక్రమాలపై దర్యాప్తులు సాగుతున్నాయి. ఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవితపై, కేసీఆర్, హరీష్ రావుపై కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై, ఓఆర్ఆర్ లీజు, కారు రేసింగ్ లో బాగోతాలపై కేటీఆర్ పై, భూకబ్జాలు, భూబాగోతాలపై మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై దర్యాప్తులు సాగుతున్నాయి. దీంతో వరుస విచారణలు, కేసులతో దెబ్బ మీద దెబ్బ అన్నట్లు బీఆర్ఎస్ అనుబంధ బొగ్గుగని కార్మికుల సంఘం టీబీజీకేఎస్ తిరుగుబావుటా ఎగురవేసింది. తాము బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ కార్మిక సంఘంగా ఉండబోమని ఆదివారం కార్మిక నేతలు ప్రకటించారు. కవిత వైఖరి వల్ల తమ కార్మిక సంఘానికి తీరని నష్టం జరిగిందని తాము బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉండబోమని కార్మిక నేతలు చెప్పారు. దీంతో టీబీజీకేఎస్ సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవిత పదవి ఊడినట్లయింది. తమ కార్మిక సంఘంలో బీఆర్ఎస్ జోక్యాన్ని సహించబోమని కార్మిక నాయకులు స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ వల్ల ఇబ్బందుల పాలయ్యాం : సింగరేణి కార్మిక సంఘం నేతలు
తాము బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా సింగరేణి బొగ్గు గనుల కార్మిక సంఘాన్ని నడపటం వల్ల తాము చాలా ఇబ్బందులు పడ్డామని ఆ సంఘం కార్మిక నేతలు తాజాగా చెప్పారు. అందుకే తమ యూనియన్ కు రాజకీయ జోక్యం అవసరం లేదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ మిర్యాల రాజిరెడ్డి చెప్పారు. గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో సంఘం నేత నూనె కొమురయ్య అధ్యక్షతన జరిగిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు.

స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా మిర్యాల రాజిరెడ్డి

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా తనను ఎన్నుకున్నందుకు మిర్యాల రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు కార్యచరణ గురించి పలు విషయాలు చెప్పారు. తాము రాజకీయాలకు అతీతంగా కార్మిక సంఘాన్ని పునర్నిర్మాణం చేస్తామని రాజిరెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి 11 డివిజన్‌ల నుంచి యూనియన్‌ నాయకులు బడికల సంపత్‌కుమార్‌, పెట్టం లక్ష్మణ్‌, మల్రాజ్‌ శ్రీనివాస్‌రావు, మేడిపల్లి సంపత్‌, పర్లపల్లి రవి, మాదాసి రామమూర్తి, రాజశేఖర్‌, మంగీలాల్‌, వడ్డెపల్లి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Read More
Next Story