తెలంగాణలో సమాచారహక్కు చట్టంపై సర్కారు చిన్నచూపు
x

తెలంగాణలో సమాచారహక్కు చట్టంపై సర్కారు చిన్నచూపు

తెలంగాణలో సమాచార హక్కు చట్టం అమలు చేసే వారే కరువయ్యారు. ఏడాదిన్నర కాలంగా సమాచార హక్కు చట్టం కమిషనరేట్ కార్యాలయంలో చీఫ్ కమిషనర్, సమాచార కమిషనర్లు లేరు.


తెలంగాణలో సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది.2023 ఫిబ్రవరి 25వతేదీన తెలంగాణ సమాచార హక్కు చట్టం కార్యాలయంలో కమిషనర్లు పదవీ విరమణ చేశారు. దీంతో ఈ కార్యాలయంలో ప్రజలకు సమాచారాన్ని అందించే వారు కరవయ్యారు. ఏడాదిన్నర కాలం గడచినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ప్రస్థుత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కమిషనర్ల నియామకంపై దృష్టి సారించలేదు.


నోటిఫికేషన్ జారీ చేశారు...నియామకం మరిచారు
తెలంగాణ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలుకు స్టేట్ చీఫ్ ఇన్‌ఫర్‌మేషన్ కమిషనర్, స్టేట్ ఇన్‌ఫర్‌మేషన్ కమిషనర్ల నియామకం కోసం దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారి మెమో నంబరు 3504 తో ఈ ఏడాది జూన్ 11వతేదీన ప్రకటన జారీ చేశారు. సమాచార కమిషన్ లో కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసినా వారి నియమకం మాత్రం చేపట్టలేదు.

దరఖాస్తు చేసే గడవు ముగిసింది...
సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం తెలంగాణలో ఖాళీగా ఉన్న స్టేట్ చీఫ్ ఇన్‌ఫర్‌మేషన్ కమిషనర్, స్టేట్ ఇన్‌ఫర్‌మేషన్ కమిషనర్ల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసినా, ఇంతవరకు వీరి నియామకం జరగలేదు. చట్టాలు, సైన్సు అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీసు, మేనేజ్ మెంట్, జర్నలిజం, మాస్ మీడియా , ప్రభుత్వ అధికారులుగా పనిచేసినవారు సమాచార కమిషనర్ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల దాఖలుకు చివరితేదీగా జులై 4వతేదీగా ప్రభుత్వం నిర్ణయించింది.

బీఆర్ఎస్ హయాంలో కమిషన్ ఖాళీ
2023 వ సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కార్యాలయంలో చీఫ్ కమిషనర్, కమిషనర్ల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లో 281 దరఖాస్తులు వచ్చాయి. అయితే వారు కమిషనర్ల నియామకం చేపట్టలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ తాజాగా సమాచార కమిషనర్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు.

పెండింగులోనే అప్పీళ్లు, ఫిర్యాదులు
తెలంగాణ రాష్ట్రంలో సమాచార హక్కు కమిషన్ లో 14వేలకు పైగా అప్పీళ్లు, దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. సమాచారం ఇవ్వాలని కోరుతూ ప్రజలు 7,537 అప్పీళ్లను రాష్ట్ర కమిషన్ కు ఇచ్చారు. మరో 4,591 ఫిర్యాదులను కమిషన్ కు సమర్పించినా వీటిపై విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేయడానికి చీప్ కమిషనర్, సమాచార కమిషనర్లు లేరు.

నియామకం కోసం సీఎం అధ్యక్షతన కమిటీ
తెలంగాణ సమాచార కమిషనర్ల నియామకం కోసం తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన, సీనియర్ మంత్రి, ప్రతిపక్షనాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సభ్యులుగా కమిటీ ఉంది. ఈ కమిటీ సమావేశమై చీఫ్ సమాచార కమిషనర్, కమిషనర్లను నియమించాలి. వీరి సమావేశం జరగక పోవడంతో సమాచార కమిషన్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది.

వెంటనే సమాచార హక్కు చట్టం కమిషన్ ను నియమించండి : యం పద్మనాభరెడ్డి
తెలంగాణలో సమాచార హక్కు చట్టం కమిషన్ ను నియమించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేర సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కమిషన్ పై నిర్లక్ష్యం చూపించిందని ఆయన చెప్పారు. ప్రస్థుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వెంటనే కమిషన్ ను ఏర్పాటు చేయాలని పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు.సమాచార కమిషన్ ఖాళీగా ఉండటంతో వేల సంఖ్యంలో ఫిర్యాదులు, అప్పీళ్లు పెండింగులోనే ఉన్నాయని, సమాచార హక్కు చట్టం గురించి పట్టించుకునే వారే కరువయ్యారని పద్మనాభరెడ్డి చెప్పారు.


Read More
Next Story