తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు తెర లేచింది!
x
రేషన్ కార్డుల ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు తెర లేచింది!

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకను ప్రకటించనుంది. ఇవాళో రేపో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రకటన ఇవ్వనుంది. ఆ కార్డుల్ని ఎలా పొందాలంటే..


కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇస్తామన్న రేషన్ కార్డులకు తెర లేచింది. నూతన సంవత్సర కానుకగా ప్రకటించింది. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులిచ్చే ముహూర్తాన్ని ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఇదొకటి. ఇప్పుడా హామీని అమలు పరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం కట్టింది. రంగాన్ని సిద్ధం చేసింది.

28 నుంచే దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియకు కసరత్తు ముమ్మరమైంది. ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకోనుంది. అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అవసరమైన పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాక వీటి పరిశీలన మొదలవుతుంది. అర్హుల ఎంపిక ప్రక్రియ గ్రామాల్లో గ్రామసభలు.. నగరాలు, పట్టణాల్లో బస్తీసభల ద్వారా జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహరాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా నోడల్‌ అధికారులు ఉంటారు.

ఈ కార్డు ఎందుకు పనికి వస్తుందంటే...

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 89.98 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. ఇందులో జాతీయ ఆహారభద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద జారీ చేసిన కార్డులు 54.39 లక్షలు. రాష్ట్ర ఆహారభద్రత కార్డులు 35.59 లక్షలు. ఇవి కాక రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల కోసం లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. బియ్యం వంటి సరకుల కోసమే కాకుండా ఆరోగ్యశ్రీ వంటి పలు పథకాలకూ రేషన్‌ (ఆహార భద్రత) కార్డు ఉండాలన్న నిబంధన ఉంది.

ఆరోగ్య శ్రీ కి రేషన్ కార్డే ఆధారం...

ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. అర్హత కలిగినప్పటికీ అనేక కుటుంబాలు రేషన్‌ కార్డుల్లేక ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి పొందలేకపోతున్నాయి. రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికీ 6 కిలోల చొప్పున బియ్యం అందుతున్నాయి. హైదరాబాద్‌లో గోధుమలు కూడా ఇస్తున్నారు. గతంలో కిలో బియ్యం రూపాయికే ఇవ్వగా.. కొవిడ్‌ ప్రభావం నేపథ్యంలో మూడేళ్లుగా ఉచితంగానే బియ్యం ఇస్తున్నారు. అన్నపూర్ణ అంత్యోదయ యోజన కార్డులు ఉన్నవారికి నెలకు కిలో చక్కెర ఇస్తున్నారు.

మార్గదర్శకాలు ఏమిటంటే...

రేషన్‌ కార్డుల జారీకి అర్హుల ఎంపికకు మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉన్నా గతంలో ఉన్న మార్గదర్శకాలే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కొత్త రేషన్‌ కార్డులకు అర్హుల ఎంపిక గ్రామ, బస్తీ సభల్లోనే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

పెండింగ్ లో 11 లక్షల దరఖాస్తులు...

రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులు.. తప్పులను సరిచేయడానికి సైతం ఈనెల 28వ తేదీ నుంచి అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చిన దరఖాస్తులు దాదాపు 11.02 లక్షలు. ప్రస్తుతం ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు చేర్చాలని దరఖాస్తుదారులు కోరారు. ఎడిట్‌ ఆప్షన్‌ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆ ప్రక్రియ ఇన్నాళ్లూ ముందుకు సాగలేదు. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. కొత్త కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల్ని చేర్చేందుకు అనుమతివ్వాలని నిర్ణయించింది. 11.02 లక్షల దరఖాస్తులకు సంబంధించి 15.87 లక్షల మంది పేర్లను ఆహారభద్రత కార్డుల్లో చేరాలని ఇప్పటికే దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇవీ లెక్కలు...

పౌరసరఫరాలశాఖ లెక్కల ప్రకారం.. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇచ్చిన రేషన్ కార్డులు 6,47,297. ఈ కార్డులపై లబ్ధిదారులు 20,69,033మంది. రాష్ట్ర జనాభా మొత్తం 4 కోట్లకు పైగా ఉంటే రేషన్ లబ్ధిదారుల సంఖ్య 2.82 కోట్ల మందికి పైగా ఉంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో ప్రకటన ఇస్తుందని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి కథనం.

Read More
Next Story