పాత పైళ్లే కదలడం లేదు, కొత్త రైళ్లొస్తాయా?
x
తెలంగాణలో ప్రతిపాదనల్లోనే కొత్త రైలుమార్గాల నిర్మాణం...పట్టాలెక్కేదెన్నడు?

పాత పైళ్లే కదలడం లేదు, కొత్త రైళ్లొస్తాయా?

తెలంగాణ పట్టాలు ఎక్కని కొత్త రైళ్లప్రతిపాదనలు


తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా పలు రైల్వే ప్రాజెక్టులు పెండింగులోనే ఉన్నాయి. కొత్త రైలు మార్గాలు నిర్మించాలనే ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి మోక్షం లభించడం లేదు.


రాష్ట్రం చొరవ తీసుకున్నా పట్టాలెక్కని కొత్త రైలు మార్గాలు
తెలంగాణ రాష్ట్రంలో పలు రైల్వే కొత్త ప్రాజెక్టులు పెండింగులోనే ఉన్న నేపథ్యంలో కొత్త రైలు మార్గాల నిర్మాణం కోసం రైల్వేశాఖకు భూసేకరణతోపాటు రాష్ట్రం నుంచి పూర్తి సహాయ సహకారాలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్ణయించారు.ఇటీవల రైల్వేశాఖ ఉన్నతాధికారులతో సీఎం రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షించారు.ఈ సమీక్ష తర్వాత చర్లపల్లి- యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పట్టాలెక్క వచ్చని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. ఏళ్ల తరబడిగా పెండింగులో ఉన్న యాదాద్రి రైలుమార్గం మరో మూడేళ్లలో నెరవేరుతుందని ఇటీవల కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. రైల్వే జీఎం, కేంద్రమంత్రి ప్రకటించినా రైలు మార్గం నిర్మాణపనులు మాత్రం ప్రారంభం కాలేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

పాత ప్రాజెక్టులు పెండింగులోనే...కాని మళ్లీ తెరపై కొత్త ప్రతిపాదనలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవతో తెలంగాణ రైల్వే రంగంలో కొత్త ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. దశాబ్దాల క్రితం ప్రతిపాదించి, డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధమైన పలు రైల్వే మార్గాలకు రైల్వే మంత్రిత్వశాఖ నిధులు విదల్చలేదు. కేంద్ర రైల్వేశాఖ ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చి, నిధులు కేటాయిస్తూ, దక్షిణ మధ్య రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తుందని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సీహెచ్ శంకర్ రావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పాత ప్రాజెక్టు ప్రతిపాదనలను గాలి కొదిలి కొత్త ప్రాజెక్టులను తెర మీదకు తెస్తున్నారని ఆయన ఆరోపించారు.

కొత్త రైలుమార్గాల ప్రతిపాదనలు
- భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు దానికి అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉంది.
- హైదరాబాద్‌ ‌- చెన్నై, హైదరాబాద్‌‌ - బెంగుళూరు హైస్పీడ్ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్‌మెంట్ ప్రతిపాదనలకు మోక్షం కల్పించాలని రైల్వే మంత్రిత్వశాఖను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
- హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకత, 362 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగ్ రైలు ఏర్పాటు చేయాలని కేంద్రంపై సీఎం ఒత్తిడి తీసుకువచ్చారు. రీజనల్ రింగ్ రైలు వల్ల హైదరాబాద్ మహా నగరం భవిష్యత్తు స్వరూపం మారిపోతుందన్నారు.
-గతంలో ప్రతిపాదించిన వికారాబాద్ -కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే మంత్రిత్వశాఖను కోరింది.
- గద్వాల‌‌‌‌‌‌ - డోర్నకల్ రైల్వే లైన్ పనుల డీపీఆర్ పూర్తి చేసి వేగంగా పనులు చేపట్టాలని సీఎం రైల్వే మంత్రిని కోరారు.
- వరంగల్‌ జిల్లాలో రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. కాజీపేట జంక్షన్‌లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.
- ప్రస్థుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్థుతం పలు రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులు చేపట్టినందున వాటిని సత్వరం పూర్తి చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించాలని సీఎం కోరారు.

ప్యాసింజర్ రైళ్లకు దిక్కులేదు కానీ బుల్లెట్ రైళ్లకు ప్రతిపాదనలు
కొత్త రైలు మార్గాల నిర్మాణం, ప్యాసింజర్ రైళ్లకు దిక్కులేదు కానీ బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టు రిపోర్టులను రైల్వే అధికారులు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో దశాబ్దాల క్రితం ప్రతిపాదించిన రైలు మార్గాలకు, ప్యాసింజర్ రైళ్లకు మోక్షం కల్పించకుండా బుల్లెట్ రైళ్ల గురించి ఆలోచిస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ సహాయ కార్యదర్శి చిలుక స్వామి ఆరోపించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నైలకు బుల్లెట్ రైళ్లు నడిపేలా హైస్పీడ్ కారిడార్ల నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే డీపీఆర్ లు రూపొందిస్తున్నారు. హైదరాబాద్ - బెంగళూరు హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ను రైల్వే అధికారులు తయారు చేస్తున్నారు. హైదరాబాద్ - విజయవాడ మార్గాల్లో సరకు రవాణాకు వీలుగా మూడు, నాలుగో లైన్ల నిర్మాణం చేపడతామని చెబుతున్నా, అవి ఎప్పటికీ చేపడతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

పాత ప్రాజెక్టులు పెండింగులో ఉంచి...
పాత ప్రతిపాదనలను పెండింగులో ఉంచి కొత్త రైలు మార్గాల గురించి కొత్త ప్రతిపాదనలు రూపొందించారు. రైల్వే ప్రాజెక్టులన్నీ ప్రతిపాదనల్లోనే మగ్గుతున్నాయి. హైదరాబాద్ - బెంగళూరు హైస్పీడ్ కారిడార్ ను 300 కిలోమీటర్ల దూరం నిర్మించనున్నారు. హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ కారిడార్ 464 కిలోమీటర్ల దూరం, కాచిగూడ- చిట్యాల- జగ్గయ్యపేట కొత్త రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయించారు. సత్తుపల్లి- కొండప్లి కొత్త రైల్వే లైన్, కొత్తగూడెం - కిరండోల్ కొత్త రైలు మార్గం, కాజీపేట- విజయవాడ రైల్వే లైన్ నిర్మాణాలు చేపట్టేందుకు డిటైల్డ్ ప్రాజెక్టు రూపొందించే పనిలో రైల్వే ఇంజినీర్లు మునిగిపోయారు.

తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులకు సహకారం అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి
స్పష్టం చేశారు.రైల్వేశాఖ రాష్ట్ర వాటా నుంచి అవసరమైన నిధులను సమకూర్చటంతో పాటు భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్‌మెంట్‌ ఉండాలని దూరాభారం తగ్గించి, అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలని సీఎం సూచించారు.తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల విషయాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రైల్వేతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తోడ్పడే ప్రత్యేక రైల్వే లైనుతో పాటు పలు ప్రాజెక్టులను వివరించారు.

రైలు కనెక్టివిటీ పెంచండి
తెలంగాణలో ప్రధానంగా పర్యాటక కేంద్రాలు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని, విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్ట్ కనెక్టివిటీని అధునాతనంగా అభివృద్ధి చేయాలని సీఎం ఎ రేవంత్ రెడ్డి సూచించారు.భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాలని సీఎం సూచించారు.భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, అందుకు సంబంధించి 300 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌ ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం తయారు చేసిందన్నారు. హైవే వెంట రైలుమార్గం ఉండాలని, హైవేకు ఇరువైపులా ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌ను విస్తరించాలనే ప్రతిపాదనలున్నాయని చెప్పారు.

రింగ్ రైలు నిర్మించండి
కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్‌ ‌- చెన్నై, హైదరాబాద్‌‌ - బెంగుళూరు హైస్పీడ్ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్‌మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి రైల్వే అధికారులకు సూచించారు.హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకతను ముఖ్యమంత్రి గారు అధికారులకు వివరించారు. దాదాపు 362 కి.మీ మేరకు రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగ్ రైలు ఏర్పాటు చేయటంతో హైదరాబాద్ మహా నగరం భవిష్యత్తు స్వరూపం మారిపోతుందన్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులకు సూచించారు.

నెరవేరని ప్రయాణికుల వినతులు
రామగుండంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్‌ను అధికారులతో కలిసి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఇటీవల పరిశీలించారు. రైల్వేల ద్వారా లోడింగ్ సౌకర్యాల మెరుగుదలలపై చర్చించారు. మంచిర్యాల్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనుల్లో భాగంగా కొత్తగా నిర్మాణంలో ఉన్న వెయిటింగ్ హాల్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పరిశీలించారు.రైలు వినియోగదారుల సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో జనరల్ మేనేజర్ పర్యటన సందర్భంగా కలిసి వివిధ డిమాండ్ల ప్రాతినిధ్యాలను సమర్పించినా అవి నెరవేర్చలేదు.డోర్నకల్‌ నుంచి సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌కు రైల్వే లైన్లు కావాలని ఎంపీ మల్లు రవి కోరినా అవి ప్రతిపాదనలు కూడా రూపొందించలేదు. వనపర్తి నుంచి గద్వాల్; కల్వకుర్తి నుంచి మాచర్ల, జడ్చర్ల నుంచి నంద్యాల మీదుగా నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ కు రైలు మార్గాలు నిర్మించాలని మల్లు రవి కోరారు.

కల్వకుర్తి- మాచర్ల కొత్త రైల్వే లైనుకు నిధులేవి?
కల్వకుర్తి- మాచర్ల కొత్త రైల్వే లైను నిర్మాణానికి రైల్వేశాఖ రూపొందించిన ప్రతిపాదనలు పెండింగులోనే ఉన్నాయి. కల్వకుర్తి నుంచి వయా వంగూర్, దేవరకొండ, చలకుర్తి, తిరుమలగిరి, మీదుగా మాచర్ల కొత్త రైల్వే లైను నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి గత ఏడాది జనవరి నెలలో కేంద్ర రైల్వేశాఖ మంత్రికి నంబరు 662 రైల్వేస్ తో లేఖ రాశారు. గద్వాల్ -డోర్నకల్, కల్వకుర్తి -మాచర్ల కొత్త రైలు మార్గం 126 కిలోమీటర్ల మేర నిర్మిస్తే గుంటూరుకు కలపవచ్చని లేఖలో సీఎం పేర్కొన్నా రైల్వే మంత్రిత్వశాఖ నుంచి కదలిక లేదు.

వికారాబాద్ -కృష్ణా కొత్త రైలుమార్గం
వికారాబాద్ -కృష్ణా కొత్త రైలుమార్గం నిర్మాణానికి రైల్వే మంత్రిత్వశాఖ నిధులు విడుదల చేయాలని కోరినా రైల్వే బడ్జెట్ లో పైసా కూడా విదల్చలేదు. వికారాబాద్ నుంచి వయా పరిగి, కొండంగల్ , చిట్లపల్లి, టేకల్ కోడే, రావల్ పల్లి, మాటూరు, దౌల్తాబాద్, దామరగిద్ద, నారాయణపేట్ మఖ్తాల్ గ్రామాల మీదుగా కృష్ణాను కలిపేలా కొత్త రైలు లైను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి గత ఏడాది డిసెంబరు 11వతేదీన రైల్వే శాఖ మంత్రికి నంబరు 594 రైల్వేస్ తేదీ 11.11.2024 వతేదీన లేఖ రాసినా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి కదలిక లేదు.

ఇద్దరు కేంద్రమంత్రులు, ఆరుగురు ఎంపీలున్నా...
తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది పార్లమెంటు సభ్యులున్నా రాష్ట్రంలోని పెండింగులో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు మోక్షం లభించడం లేదు. తెలంగాణలో కొన్నిపాత రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ, ఆధునికీకరణ పనులు తప్పితే కొత్త రైలు మార్గాలకు రైల్వే మంత్రిత్వశాఖ పచ్చజెండా ఊపడం లేదు. తెలంగాణ రాస్ట్రం నుంచి జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ లు కేంద్రమంత్రులుగా, బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్, గోడం నగేష్, ఈటెల రాజేందర్, మాధవనేని రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణలు ఎంపీలుగా ఉన్నా రైల్వే కొత్త ప్రాజెక్టుల్లో కదలిక లేదు.



Read More
Next Story