నాయకుడి ఒంటెత్తు పోకడ కొంపముంచుతుందేమోననే ఆందోళనలో వైఎస్సార్‌సీపీ ద్వితీయ క్యాడర్
నాయకుడి ఒంటెత్తు పోకడ కొంపముంచుతుందేమోననే ఆందోళనలో వైఎస్సార్‌సీపీ ద్వితీయ క్యాడర్
తెలంగాణలో కేసీఆర్ ఓడితే ఆంధ్రా ఉలిక్కిపడిందా.. కేసీఆర్ ప్రభావం జగన్ పై ఉందా.. తెలుగు ప్రజల ఆలోచనంతా ఒకేరీతిగా ఉంటుందా.. వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం సంకటస్థితిని ఎదుర్కొంటుందా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు, రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం ఏపీ జనమే ఎక్కువగా ఎదురు చూశారంటే అతిశయోక్తి కాదు. కారణం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఏపీ నుంచి ఇంటికో మనిషి హైదరాబాద్ మహానగర పరిథిలో ఉన్నారు. అందుకే అంత ఆసక్తి. సరిగ్గా ఈ దశలో కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ ఓడింది. అదెలా ఓడిందో ప్రొఫెసర్ హరగోపాల్ మాటల్లో చెప్పాలంటే.. అహంకారానికి ఆత్మాభిమానానికి జరిగిన పోరులో గులాబి జెండా కిందపడింది. నిరంకుశ పోకడలకు తెరపడింది. ప్రజాభిప్రాయం గెలిచింది.. కాస్త కుడి ఎడంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి నాయకుడు ఇదే మాట చెప్పారు. సరిగ్గా ఈమాటలే ఇప్పుడు వైసీపీ నేతల్లో గుబులు రేపుతున్నాయి..
వైఎస్సార్‌సీపీలో ఉన్న ద్వితీయ క్యాడర్ మాత్రం మా నాయకుడి ఒంటెత్తు పోకడ ఎక్కడ కొంపముంచుతుందోననే ఆందోళనలో ఉన్నారు. బయట పడి చెప్పేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. వారి మనసులో మాట మాత్రం ఇదే. ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసే ఎవరినైనా తెలుగు ప్రజలు క్షమించరని తెలంగాణ ఎన్నికలు స్పష్టం చేశాయి. కేసీఆర్ బహిరంగంగానే వ్యంగాస్త్రాలు వదిలే వారు. ప్రశ్నించే వారికి ఎదురు ప్రశ్నలు వేసి వారి ఇజ్జత్ తీసేవారు. అందుకే ఆయనంటే కొందరికి నవ్వులాటగా ఉంటే, మరికొందరికి ఆగ్రహం తెప్పిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో బయటకు అటువంటిదేమీ కనిపించకపోయినా వైఎస్సార్‌సీపీ కేడర్‌లో మాత్రం తీవ్ర అసంతృప్తి ఉంది. స్కూల్లో క్లాసు చెప్పినట్లు ఎమ్మెల్యేలను క్యాంపు కార్యాలయానికి పిలిపించి క్లాసులు చెప్పటాన్ని చాలా మంది ఎమ్మెల్యేలు జీర్ణించుకోవడం లేదు. పైగా నేను చెప్పింది వినాలే తప్ప ఎవరూ ఎదురు ప్రశ్నించకూడదనే భావన సీఎంలో ఉందని బయట పడేందుకు అంగీకరించని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. నేను ముందుగానే చెబుతున్నా నాకు వచ్చిన రిపోర్టుల ప్రకారం నియోజకవర్గాల్లో సరిగా పనిచేయని వారికి టిక్కెట్లు ఇచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల జరిగిన సభల్లో మీ నియోజకవర్గం నుంచి ఈయనే మీ నాయకుడంటూ పరిచయాలు కూడా చేశారు. ఇది మరికొందరికి మింగుడు పడటం లేదు.
ఎక్కడైనా ప్రెస్‌తో మాట్లాడాలన్నా ముఖ్యమంత్రి కార్యాలయం తయారు చేసిన ప్రెస్‌నోట్ చూసి మాత్రమే మాట్లాడాలి. ఎవరికి వారు సొంతంగా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మాట్లాడేందుకు వీలు లేదు. నియోజకవర్గాల్లో ఏ చిన్న హామీనైనా ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు వెనుకంజవేస్తున్నారు. ఎందుకంటే తాము హామీ ఇచ్చి ముఖ్యమంత్రి వద్ద ఫెయిల్ అయితే తిరిగి నియోజకవర్గంలో తల ఎత్తుకునే అవకాశం లేదనేది నాయకుల మనసుల్లో ఉన్న భావన.
ప్రస్తుతం నియోజకవర్గాల్లో వాలంటీర్లకు ఉన్న విలువ ఎమ్మెల్యేలకు లేకుండా పోయిందనే నిరాశలో ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను బటన్ నొక్కుతున్నాను. మీరు నియోజకవర్గంలో తిరిగి మనం చేసిన సంక్షేమాన్ని చెప్పండంటున్నాడు ముఖ్యమంత్రి. ఇప్పటి వరకు అప్పుడప్పుడైనా ఎమ్మెల్యేలు స్వేచ్చగా సీఎంను కలిసే అవకాశమే లేకుండా పోయిందనే ఆవేదన ఎమ్మెల్యేల్లో ఉంది.
సంక్షేమ మంటే కేసీఆర్ చెయ్యలేదా.. ఆయనను ఎందుకు ప్రజలు ఓడించారు. ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల్లో అక్కడ జరిగిందే ఇక్కడ రిపీట్ అయితే పెట్టెబేడా సర్దుకోవాల్సిందేనంటూ రెండో క్యాడర్ నాయకులు వాపోతున్నారు.
సీఎం జగన్‌కు ఉన్న అహంకారం అంతా ఇంతా కాదని పలు సందర్బాల్లో జనసేన నేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాదయాత్రలో ఎలాగైతే కలిసాడో ఆ స్థాయిలో సీఎం జగన్ ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉందా? ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆయన వ్యూహం ఏమిటో ఇంతవకు మాకు తెలియడం లేదని కొందరు ఎమ్మెల్యేలు లబోదిబోమంటున్నారు.
Next Story