హైదరాబాద్‌లో రూ.1500 కోట్ల రోడ్ల పనులకు ‘టెండర్’
x
రోడ్ల నిర్మాణ పనులు

హైదరాబాద్‌లో రూ.1500 కోట్ల రోడ్ల పనులకు ‘టెండర్’

హైదరాబాద్‌లో రూ.1500కోట్లతో రోడ్ల నిర్మాణ పనులకు ‘టెండర్’పెట్టారు. ఈ పనులను బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


హైదరాబాద్ నగరంలో రూ.1500కోట్ల బ్యాంకు రుణాలతో 49 రోడ్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖ జులై 10వతేదీన జి.ఓ.నంబరు.296 తో జారీ చేసిన ఉత్తర్వులతో వివాదం రాజుకుంది. బడ్జెట్ నిధులు కాకుండా బ్యాంకు రుణాలతో నగరంలో నిర్మించనున్న ఈ రోడ్ల నిర్మాణ కాంట్రాక్టుకు పిలిచిన టెండర్లలో పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

- ప్రభుత్వ పూచీకత్తుతో రూ.1500కోట్ల బ్యాంకు రుణాలు తీసుకొని,ఈ నిధులతో హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో కీలకమైన 49 రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని మున్సిపల్ శాఖ అధికారులు నిర్ణయించారు.

బడా కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకే...
49 రోడ్ల పనులకు వేర్వేరుగా టెండరు పిలవకుండా రూ.1500 కోట్ల రోడ్ల నిర్మాణ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజీలో రూ.698 కోట్లు, రెండవ ప్యాకేజీ కింద రూ.802 కోట్ల అంచనాతో టెండరు పిలిచారు.రెండు ప్యాకేజీల పనులను బడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టేలా టెండరు నిబంధనల్లో ప్రత్యేక నిబంధనలు చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా టెండరు నోటీసు జారీ చేయడం ఏమిటని, ఈ టెండర్లలో బడా కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకేనని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి ఆరోపించారు.

నాలుగు మున్సిపల్ విభాగాలున్నా...
హైద‌రాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో రోడ్ల‌ను నిర్మించ‌డం జీహెచ్ఎంసీ బాధ్య‌త‌.రోడ్లు నిర్మించడానికి,వాటిని నిర్వ‌హించ‌డానికి పెద్ద సంఖ్య‌లో ఇంజ‌నీర్ల‌తో కూడిన ప్రత్యేక మున్సిపల్ ఇంజ‌నీరింగ్ విభాగం ఉంది.పాత‌న‌గ‌రంలో పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీకి అనుబంధంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఛైర్మ‌న్‌గా కులీ కుతుబ్ షా అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.దీంతో పాటు హైద‌రాబాదు మెట్రోపాలిటిన్ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ కూడా ఉంది.దీంతో పాటు నగరంలో డ్రైనేజీ, మంచినీటి సరఫరా కోసం హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఉంది. ఈ నాలుగు మున్సిపల్ విభాగాలను కాదని స్పెషల్ పర్పస్ వెహికల్ కింద స్ట్రాట‌జిక్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్యక్ర‌మం ద్వార రోడ్ల నిర్మాణ ప‌నులు చేప‌డుతున్నారు.దీనివల్ల నాలుగు ప్రధాన ఇంజినీరింగ్ విభాగాలకు పని లేకుండా పోతోంది.

రహస్యంగా రోడ్ల నిర్మాణ పనులు
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత అన్ని స్థానిక సంస్థ‌ అయిన జీహెచ్ఎంసీ పూర్తిగా నిర్ల‌క్ష్యానికి గురైంది.గతంలో బ‌డ్జెట్ ప‌రిమితుల కార‌ణంగా రోడ్ల‌ నిర్మాణ పనులు పెద్ద‌గా జ‌ర‌గ‌లేదు. జీహెచ్ఎంసీ చేపట్టే పనులను జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదించి, ఆయా పనుల వివరాలను జ‌న బాహుళ్యంలో ఉంచ‌డంతో ప్రజలంద‌రికి ప‌నుల వివ‌రాలు,చేసిన నిర్మాణ వ్యయం తెలుస్తుంది.కానీ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ లిమిటెడ్ చేపట్టిన రెండు విడతల పనుల వివరాలను మాత్రం అత్యంత రహస్యంగా ఉంచారు. అంటే ఈ పనుల కాంట్రాక్టులు, టెండర్లలో గోల్ మాల్ జరిగిందని యం పద్మనాభరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

గుట్టుగా రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులు
హైదరాబాద్ నగరంలో నాలుగు మున్సిపల్ సంస్థ‌లు ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ మ‌ళ్లీ దురుద్దేశంతో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నపుడు తెలంగాణ ప్ర‌భుత్వం జి.ఓ.నంబరు 106, తేదీ 11-3-2017 ద్వారా హైద‌రాబాదు రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేష‌న్ గుట్టు చ‌ప్పుడు కాకుండా వేల కోట్ల‌ రూపాయలను ప్ర‌భుత్వ పూచీ క‌త్తుతో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని త‌మ వారికి కాంట్రాక్టులు క‌ట్ట‌బెడుతున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి ఫిర్యాదు చేశారు.

హైద‌రాబాదు రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ లిమిటెడ్ ఏర్పాటు
గత కేటీఆర్ హయాంలో మొద‌టి, రెండోద‌శ‌ల్లో హైద‌రాబాదు రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ లిమిటెడ్ తీసుకున్న వేల కోట్ల రుణాల వివరాలు, చేసిన రోడ్ల నిర్మాణ పనులు జీహెచ్ఎంసీ బ‌డ్జెట్‌లో గాని, రాష్ట్ర బ‌డ్జెట్‌లో గాని క‌నిపించ‌డం లేదు.ప్ర‌స్థుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రూ.1500 కోట్ల రుణంతో మూడ‌వ‌ద‌శ‌ రోడ్ల నిర్మాణ పనులను కూడా రాష్ట్ర బడ్జెట్ లో చేర్చ‌లేదు.

విచారణ జరపాలని సీఎంకు వినతి
రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులు, టెండర్లలో పార‌ద‌ర్శ‌క‌త ,జ‌వాబుదారీత‌నం లోపించినందు వల్ల వేల కోట్ల సొమ్ము దుర్వినియోగం అవుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ రాస్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి ఫోరం పక్షాన పద్మనాభరెడ్డి లేఖ రాశారు.బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు బ‌డ్జెట్‌లో క‌నిపించ‌దని, రోడ్ల నిర్మాణానికి చేసిన ఖ‌ర్చు ఎవ‌రికీ తెలియ‌దని ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన జీఓలతో కొత్త‌గా ఎన్నికైన ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తుందని ఆయన చెప్పారు. రోడ్ల నిర్మాణ టెండర్ల బాగోతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించి, ఈ వ్యవహారాన్ని సమీక్షించి ఆన్ లైన్ టెండరు నోటిఫికేషన్ ను ఆపివేయాలని పద్మనాభరెడ్డి కోరారు. ఈ రోడ్ల టెండర్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ పక్షాన ముఖ్య‌మంత్రిని పద్మనాభరెడ్డి అభ్య‌ర్థించారు.


Read More
Next Story