రాముడి పట్టాభిషేకానికి అయోధ్య సర్వాంగసుందరంగా తయారవుతోంది
శ్రీరాముడు సకల గుణాభిరాముడు, తేజోమయుడని ప్రతీతి. అటువంటి రాముడి పట్టాభిషేకానికి అయోధ్య సర్వాంగసుందరంగా తయారవుతోంది. సకల సంబరాలకు సిద్ధమవుతోంది. అయోధ్యను కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దేవాలయంగా తీర్చిదిద్దుతున్నారు.
ఇంకా 50 రోజులే..
ఇంకో 50 రోజుల్లో రామమందిరం పూర్తి కావాలి. గర్భగుడి సిద్ధం కావాలి. విగ్రహాలను ప్రతిష్టాపన జరగాలి. ఇలా ఎన్నో పనులు చకచక జరిగిపోతున్నాయి. రామమందిరాన్ని వచ్చే ఏడాది జనవరి 22న ప్రారంభించాలన్నది యోచన. తాజాగా అయోధ్య రామమందిరం గర్భగుడిలో మూలవిరాట్టును ప్రతిష్టించే పీఠం ఫొటోను రామమందిర ట్రస్టు.. ట్విట్టర్ ఎక్స్‌లో పోస్టు చేసింది. గర్భగుడి నిర్మాణం దాదాపు పూర్తయింది. శ్రీరాముడిని ఇందులో ప్రతిష్టించబోతున్నారు.
జనవరి 22న సెలవు ఇస్తారా?
అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట జరిగే జనవరి 22న నేషనల్ హాలిడే ఇవ్వాలని కూడా బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తోందట. మహారాష్ట్రకు చెందిన సాధువు మహంత్ అంకిత్‌శాస్త్రి మహారాజ్ ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈమేరకు విజ్ఞప్తి చేశారు. రాముడి ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగుతుందట. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 130 దేశాల ప్రతినిధులు, వేల సంఖ్యలో సాధువులు తరలివస్తారని సమాచారం.
500 ఏళ్ల నాటి చరిత్ర తెలిపేలా...
ఇప్పటికే 500 ఏళ్ల నాటి అయోధ్య రామాలయ చరిత్రను తెలిపేలా వెబినార్‌లు నిర్వహిస్తున్నారు. హిందూ యూనివర్సిటీ, అమెరికా విశ్వహిందూ పరిషత్ సంస్థలు సంయుక్తంగా ఈ వెబినార్‌ను చేపట్టాయి.
అయోధ్యకే అత్యధిక ఆదాయం...
అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంటే మరోవైపు అక్కడి భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. యూపీలో ఎన్నడూ లేనంతగా.. అయోధ్యలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఆదాయం.. 109.19 శాతం పెరిగింది. దీంతో రిజిస్ట్రేషన్ ఆదాయంలో యూపీలోనే అయోధ్య అగ్రస్థానంలో నిలిచింది.
ఎటుచూసినా రేట్లు మండిపోతున్నాయ్...
ప్రస్తుతం అయోధ్యలోని 15 కిలోమీటర్ల చుట్టుపక్కల పరిధిలో చదరపు అడుగు ధర 3వేల నుంచి 15వేల రూపాయలు పలుకుతోంది. భూముల ధరలు మరింత పెరగవచ్చని బిల్డర్లు అంచనా వేస్తున్నారు. 2019లో ఆలయ నిర్మాణానికి ముందు ఉన్న భూముల ధర కంటే 20 శాతం పెరిగాయని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య అయోధ్యలో 29 వేల 325 భూముల సేల్ డీడ్ రిజిస్టర్ అయ్యాయి.
264 కేంద్ర, రాష్ట్ర ప్రాజెక్టులు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అయోధ్య నగరాభివృద్ధికి 264 ప్రాజెక్టులు చేపట్టాయి. పేరున్న హోటళ్లు సైతం అయోధ్యకు క్యూ కడుతున్నాయి. దీంతో అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ బూమ్ ఏర్పడింది. ప్రస్తుతం 32వేల కోట్లరూపాయలతో జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ టౌన్ షిప్, అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రాల నిర్మాణం సాగుతోంది.
దేశంలోనే తొట్టతొలిసారిగా కృత్రిమ మేధతో నడిచే యంత్రాలను అయోధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులకు ఇబ్బందులు లేకుండా పర్యాటకులకు సౌకర్యంగా ఉండేలా సైన్ బోర్డులు వెలుస్తున్నాయి. ఎక్కడికక్కడ స్కానర్లు పెట్టి ప్రయాణీకులు ఎటు నుంచి పోయి ఎటు రావాలో తెలియజేయబోతున్నారు. మొత్తం మీద అయోధ్య వచ్చే ఏడాది నుంచి పెద్ద పర్యాటక కేంద్రంగా అవతరించబోతోంది.
Next Story