అసదుద్దీన్,మాధవీలతల మధ్య రాజుకున్న బోగస్ ఓటింగ్ వివాదం
x
అసదుద్దీన్ ఒవైసీ, మాధవీలత మధ్య రాజుకున్న వివాదం

అసదుద్దీన్,మాధవీలతల మధ్య రాజుకున్న బోగస్ ఓటింగ్ వివాదం

హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ పర్వానికి ముందే బోగస్ ఓటింగ్ వివాదం రాజుకుంది.అసదుద్దీన్ ఒవైసీ, కొంపెల్లి మాధవీలత మధ్య బోగస్ ఓట్ల వివాదం రగులుతోంది.


- హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బోగస్ ఓటింగ్‌ వ్యవహారంపై తాను కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశానని బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత శనివారం ఆరోపించారు. బోగస్ ఓట్ల బండారాన్ని ఢిల్లీ దృష్టికి తీసుకువెళ్లి ఏఐఎంఐఎం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధింపజేస్తామని మాధవీలత ప్రకటించారు.

- హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో 6 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని మాధవీలత ఆరోపించారు.
- బోగస్ ఓట్లు ఉన్నాయని బీజేపీ అభ్యర్థి మాధవీలత చేసిన ఆరోపణలను సిట్టింగ్ ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ఓట‌ర్ల జాబితా గురించి ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని, దీనిలో తన పాత్ర ఏమీ ఉండదని అసదుద్దీన్ స్పష్టం చేశారు.

బుర్ఖాతో ఓటేయడానికి ముస్లిం మహిళలను అనుమతిస్తే ఆందోళన చేస్తా...
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముస్లిం ఓటర్ల ప్రాబల్య ప్రాంతమైన పాత బస్తీలో పోలీసులు బూటకపు ఓటింగ్‌కు అనుమతిస్తే, తాను ఢిల్లీకి ఫిర్యాదు చేసి ఆందోళనకు దిగుతానని హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీలత శనివారం హెచ్చరించారు. పాత నగరంలో ముస్లిం మహిళలు బుర్ఖా ధరించి ఓటు వేయడంపై కూడా మాధవీలత నిరసన వ్యక్తం చేశారు. ‘‘ముస్లిం మహిళలు బుర్ఖా ధరించి వచ్చి ఓటు వేయడానికి అనుమతిస్తే నేను మౌనంగా ఉండను’’ అని మాధవీలత చెప్పారు.

కేంద్ర బలగాల పహరా మధ్య పోలింగ్ జరపాలి
పాతబస్తీలో బోగస్ ఓటింగ్, రిగ్గింగ్ నివారణకు పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని కేంద్రప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరినట్లు మాధవీలత చెప్పారు. ఈ సారి అసదుద్దీన్ ఆగడాలు సాగవని, కేంద్ర పారామిలటరీ బలగాల పహరా మధ్య పోలింగ్ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.

ప్రచారంలో ఫిర్యాదులెన్నో...
గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన శ్రీ రామనవమి ర్యాలీలో బీజేపీ అభ్యర్థి మాధవీలత మసీదు వైపు రామబాణాన్ని వేస్తున్నట్లు సంజ్ఞ చేసినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఫ్ జిందాబాద్ అంటూ మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం చేసిన ఘటనపై మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ఎన్నికల ప్రచారం పర్వంలో బీజేపీ, మజ్లిస్ పార్టీలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.

ముస్లిం ఓటర్లదే నిర్ణయాత్మక పాత్ర
హైదరాబాద్‌ పార్లమెంట్ బరిలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో మాధవీలత పోటీ చేస్తున్నారు. మజ్లిస్ పార్టీ గత యాభై ఏళ్లుగా ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఈ నియోజకవర్గంలో 60శాతం కంటే అధికంగా ఉన్న ముస్లిం ఓటర్లే విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒవైసీ ఐదు లక్షల ఓట్లతో గెలుపొందారు. అప్పట్లో బీజేపీకి 2.35 లక్షల ఓట్లు వచ్చాయి. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మాధవీలత వినూత్న ప్రచారంతో వార్తల్లో నిలిచారు.

5 లక్షలకు పైగా బోగస్ ఓట్ల తొలగింపు
హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఏడాది జనవరి నుంచి 5 లక్షలకు పైగా బోగస్ ఓట్లను ఎన్నికల అధికారులు తొలగించారు. తొలగించిన బోగస్ ఓట్లలో పాతబస్తీలో అధికం కావడం విశేషం. బోగస్ ఓట్లపై కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత బోగస్ ఓట్లను తొలగించాలని కోరారు. ఒక్క నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోనే 21,407 బోగస్ ఓట్లను అధికారులు తొలగించారు. తొలగించిన ఓట్లలో 15,963 మంది ఇళ్లు మారారని, 2,843 మంది మరణించారని వెల్లడైంది.

డూప్లికేట్ ఓటర్ల తొలగింపు
జిల్లాలో 2,601 మంది డూప్లికేట్ ఓటర్లు ఉండటంతో వారిని జాబితా నుంచి తొలగించారు. పాత బస్తి పరిధిలోని చాంద్రాయణగుట్ట, బహదూర్ పురా పరిధిలో బోగస్ ఓట్లను అధికారులు పెద్ద మొత్తంలో తొలగించజిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 5,41,259 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వీరిలో 47,140 మంది మరణించారని, 4,39,801 మంది ఇళ్లు మారారని, మరో 54,259 నకిలీ ఓటర్లు ఉన్నారని అధికారులు గుర్తించారు.

హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమీర్ వలీవుల్లా, భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఆ పార్టీ నాయకుడు గడ్డం శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ బరిలో నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం మజ్లిస్, బీజేపీల మధ్యనే ఉంది. బోగస్ ఓట్ల వివాదం రాజుకున్న నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీగా ఎవరు విజయం సాధిస్తారనేది జూన్ 4వతేదీ ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.


Read More
Next Story