ఎన్నెన్నో ఉపాధి ఆశలతో మలేషియాకు వెళ్లిన మన తెలుగు రాష్ట్రాల కార్మికులు అక్కడ నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్మికులు మలేషియా దేశానికి వెళ్లారు. వారిలో 60వేలమందికి పైగా తెలుగు వలస కార్మికులు మలేషియాలో వెట్టిచాకిరీ చేస్తూ అక్కడి యజమానుల కబంధ హస్తాల్లో చిక్కుకు పోయారు.
ఏజెంట్ల మోసపు మాటలు విని లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఏజెంట్లకు ఇచ్చి, విమానం ఎక్కి మలేషియా వెళ్లిన తెలుగు కార్మికులు నిత్యం కష్టాలు, కన్నీళ్లతో కాలం గడుపుతున్నారు. మలేషియా దేశంలోని మారుమూల అడవుల్లో రబ్బరు తోటలు, పామాయిల్ తోటల్లో, హోటళ్లు, రెస్టారెంట్లు, కారు షెడ్లలో పనిచేస్తూ చాలీచాలని జీతంతో నిత్యం జీవన సమరం సాగిస్తున్నారు. కష్టాల్లో ఉన్న యువకులకు ఏజెంట్లు మాయమాటలు చెప్పి మంచి ఉద్యోగాలంటూ తీసుకువచ్చి మలేషియా వెట్టి ఊబిలో దించారు. మలేషియాలో తెలుగు కార్మికులు పడుతున్న కష్టాలు, కడగండ్లు వింటే కన్నీళ్లు రాక మానవు. మన తెలుగు కార్మికుల వాస్తవ కన్నీటి కథలను ‘ఫెడరల్ తెలంగాణ’ వెలికితీసింది. ఒక్కొక్క కార్మికుడిది ఒక్కో దీనగాథ...
ఫ్రీ వీసా అంటూ తీసుకువచ్చి ‘అడవి’ పాలు చేశారు...
ఫ్రీ వీసా అంటూ తీసుకువచ్చి తనను ‘అడవి’ పాలు చేశారంటారు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రవీణ్. మలేషియా నుంచి ప్రవీణ్ ఫోన్ లో హైదరాబాద్ లోని ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ తన గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘నా పేరు ప్రవీణ్...నాది నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ గ్రామం. నేను నిజామాబాద్ జిల్లాలో సెక్యూరిటీ గార్డుగా, భవన నిర్మాణ మేస్త్రీగా పనిచేసేవాడిని. ఇంటర్ వరకు చదివాక పెళ్లి చేసుకోవడంతో ముగ్గురు పిల్లలు పుట్టారు. రెక్కాడితే గానీ డొక్కాడని నాకు సొంత ఇల్లు కూడా లేకపోవడంతోపాటు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో రూ.3లక్షల దాకా అప్పులు కూడా అయ్యాయి. తాను కష్టపడి పనిచేసి అప్పులు తీర్చుకుందామని, భార్య పిల్లలకు ఆసరాగా నిలుద్దామని భావించి ఫ్రీ వీసా అంటే రబ్బరు తోటలో కూలీగా మలేషియాకు వచ్చాను. ఫ్రీ వీసాపై వచ్చినా నా విమాన టికెట్ కొనేందుకు తెలిసిన వారి వద్ద ఉన్న తులం బంగారం తీసుకొని దాన్ని అమ్మి వచ్చాను. ఉపాధి ఆశతో ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవచ్చని మలేషియా వస్తే, ఇక్కడ నన్ను మారుమూల అటవీప్రాంతంలోని రబ్బరు తోటల్లోకి పంపించారు.
పాములు, ఉడుములు, అడవి పందుల మధ్య...
ప్రతీరోజు రాత్రి ఆరు గంటలు అవుతుందంటే చాలు ట్రాక్టర్లలో మమ్మల్ని అడవిలోకి తీసుకువచ్చి మూలకొకర్ని వదిలి వెళతారు...కాళ్లకు గమ్ బూట్లు ధరించి, తలకు హెడ్ లైట్ పెట్టుకొని గొడ్డళ్లు చేత్తో పట్టుకొని రబ్బరు తోటల్లో రాత్రి వేళ రోజుకు 700 రబ్బరు చెట్లు నరకాలి. ఆ చెట్లను నరికిన తర్వాత వచ్చే పాలతో రబ్బరు తయారు చేస్తుంటారు. అడవిలోని దట్టమైన రబ్బరు తోటల్లో పెద్ద పెద్ద పాములు, కొండచిలువలు, ఉడుములు, అడవి పందులు తిరుగుతుంటాయి. పాముల బారిన పడకుండా సెల్ ఫోనులో దేవుడి పాటలు పెట్టుకొని, దేవుడిపైనే భారం వేసి అలికిడి చేసుకుంటూ చిమ్మచీకట్లో చెట్లు నరుకుతుంటాం, రాత్రి 6 గంటల నుంచి ఉదయం ఆరు గంటల దాకా నిరంతరాయంగా రబ్బరు చెట్లను చేతులు కాయలు కాసేలా నరకాలి. చెట్ల పొదల్లో పాములు నక్కి ఉంటాయి. ఒళ్లు హూనం అయ్యేలా పనిచేసి ఆపై డ్యూటీ అయిపోయాక మమ్మల్ని ట్రాక్టరులో అడవిలోనే ఉన్న షెడ్లలోకి తీసుకువెళ్లి వదులుతారు. డే డ్యూటీ అని చెప్పి మమ్మల్ని మలేషియాకు తీసుకువచ్చి రాత్రి డ్యూటీ వేశారు. మేం నివశించే షెడ్లలోనూ కట్లపాములు, తేళ్లు, విషపురుగులు తిరుగుతుంటాయి. వాటి మధ్యనే కింద పడుకోవాలి. తినడానికి భోజనం కూడా సరిగా పెట్టరు.
రబ్బరు తోట నుంచి పారిపోయాను...
నిత్యం అడవిలో జంతువుల మధ్య నానా కష్టాలు పడుతూ పనిచేయలేక యజమానికి చెప్పకుండా పారిపోయి కారు షెడ్ లో పనికి కుదిరాను. అక్రమంగా కార్లు కడిగే పనిలో చేరడంతో నెలకు 1500 రింగ్ గిట్లు ఇస్తారు... అంటే మన కరెన్సీలో 26,400 రూపాయలు. వర్క్ పర్మిట్ లేకుండానే కార్లు కడుగుతూ కాలం వెళ్లబుచ్చుతున్నాను. చాలీ చాలనీ జీతంతో పనిచేస్తుండగా, మా ఊరి నుంచి అప్పులు చెల్లించాలని ఫోన్లు చేస్తున్నారు. చేసిన అప్పులు తీర్చలేక, ఇక్కడ పనిచేయలేక నానా పాట్లు పడుతున్నాను. అక్రమ వలస కార్మికులకు మలేషియా ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించిన నేపథ్యంలో నాకు 500 రింగ్ గిట్ల జరిమానా చెల్లించి, హైదరాబాద్ కు విమాన టికెట్ ఇచ్చి స్వదేశానికి వచ్చేందుకు ప్రభుత్వం సహకరించండి’’ అని వేడుకున్నారు వలస కూలీ ప్రవీణ్. మలేషియాలోని ఈ బందీఖానా నుంచి నన్ను కాపాడండి మొర్రో అంటూ మలేషియాలోని తెలుగు సంఘాల ప్రతినిధులకు ప్రవీణ్ విన్నవించుకుంటున్నారు.
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కు పోయాను...
ఎరక్కపోయి మలేషియా వచ్చి రెస్టారెంట్ రాకెట్ లో ఇరుక్కుపోయానంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి ప్రాంతానికి చెందిన యువకుడు దేవా. మలేషియా నుంచి దేవా తన కష్టాలను ‘ఫెడరల్ తెలంగాణ’కు వివరించారు. ‘‘నా పేరు దేవా. నాది అనకాపల్లి పట్టణంలోని బీఆర్టీ కాలనీ. మా నాన్న తోట శ్రీను బట్టల వ్యాపారం చేస్తుండగా, మా అమ్మ అన్నపూర్ణ గృహిణి. నాకు చెల్లి శాంతి, తమ్ముడు ఉన్నారు. ఐటీఐ చదివిన నాకు స్వస్థలంలో ఉద్యోగం దొరకలేదు. దీనికి తోడు చెల్లి పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చడానికి మలేషియాలో ఉద్యోగం చేద్దామని నా స్నేహితులతో కలిసి మలేషియా వస్తే ఇక్కడ కష్టాలు ఎదురయ్యాయి. నేను లక్షరూపాయలు అప్పు చేసి ఏజెంటుకు కట్టి మలేషియా వచ్చాను. నెలకు రూ.50వేల జీతం, హోటల్ లో వెయిటరుగా పనిచేయాలి అంటూ ఏజెంటు మాయమాటలు చెప్పి మలేషియా తీసుకువచ్చి ఇక్కడి రెస్టారెంటులో పడేశారు.
బాత్రూంల క్లీనింగ్,గిన్నెలు కడగటంతోపాటు అన్నీ పనులూ చేయాల్సిందే...
మా పాస్ పోర్టును లాగేసుకొని, మూడేళ్లపాటు కాంట్రాక్టు అని బాండుపై సంతకం చేయించుకున్నారు. మేం ముగ్గురం కలిసి వస్తే మమ్మల్ని ఒక చోట హోటల్ లో నియమించకుండా వేర్వేరు ప్రాంతాల్లోని హోటళ్లలో నియమించారు. నెలకు 27వేలరూపాయలే ఇస్తూ మాతో హోటల్ లో బండెడు చాకిరీ చేయించుకుంటున్నారు. హోటల్ లో గిన్నెలు కడగడం, బాత్రూంలు క్లీన్ చేయడం, టేబుళ్లు తుడవటం, హోటల్ ప్రాంగణాన్ని ఊడ్చటం ఇలా అన్నీపనులను మాతో బలవంతంగా చేయిస్తున్నారు. మలేషియాలో హోటళ్లు 24 గంటలూ పనిచేస్తుంటాయి. రాత్రి 7గంటల నుంచి ఉదయం ఏడు గంటలవరకు 12గంటల పాటు నిరంతరాయంగా పని చేపిస్తున్నారు.
కిడ్నీలో రాళ్లు ఏర్పడటంతో కడుపునొప్పి వస్తోంది...
నాకు కిడ్నీలో రాళ్లు ఏర్పడటంతో తరచూ కడుపునొప్పి వస్తున్నా కనీసం డాక్టరు వద్దకు తీసుకువెళ్లి చికిత్స చేయించే వారే లేరు. కడుపునొప్పి తీవ్రమైతే నేనే డ్రైవరు సాయంతో దగ్గరలోని డాక్టరు వద్దకు వెళితే స్కానింగ్, మూత్రపరీక్షలు చేసి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పారు. కడుపునొప్పి వస్తున్నా ఆగకుండా పనిచేయాల్సిందే. లేదంటే యజమాని మమ్మల్ని దూషించడంతోపాటు అన్నం కూడా పెట్టరు. కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయి నేను మా ఊరికి వెళతాను అంటే లక్ష రింగెట్లు చెల్లించి వెళ్లాలంటున్నారు. నా పాస్ పోర్టు కూడా రెస్టారెంట్ యజమాని లాగేసుకున్నారు. ఇక్కడ నేను పడుతున్న కష్టాలను నా తల్లిదండ్రులకు చెబితే వారు తిరిగి ఇంటికి రమ్మన్నా, వెళ్లాలంటే యజమాని అనుమతి ఇవ్వటం లేదు. ఎవరైనా మాకు సాయం చేసి మలేషియా సర్కారు ప్రకటించిన క్షమాభిక్ష పథకం కింద జరిమానా చెల్లించి, విమాన చార్జీలు ఇప్పించి తమను స్వదేశానికి తీసుకువెళ్లండి’’అంటూ మలేషియాలో కనిపించిన తెలుగువారిని వేడుకుంటున్నారు అనకాపల్లి దేవా.
వెల్డర్ పనికి అని చెప్పి తెచ్చి రెస్టారెంట్లో వేశారు...
ఏజెంటు వెల్డర్ పనికి అని చెప్పి మలేషియా తీసుకువచ్చి రెస్టారెంట్లో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని అనకాపల్లి మామిడిపాలెం గ్రామానికి చెందిన మోహన్ విలపిస్తూ చెప్పారు. ‘‘నా పేరు మోహన్. మాది అనకాపల్లి సమీపంలోని మామిడిపాలెం.ఇంటరు వరకు చదివి వెల్లింగ్ పని నేర్చుకున్నాను. మా నాన్న దేముడు క్వారీలో రాళ్లు కొట్టేవారు, మా నాన్న మద్యం తాగి మత్తులో కిందపడటంతో కాలు విరిగి మంచానికే పరిమితమయ్యాడు. అమ్మ అఫ్జాలమ్మ గేదెలు కాస్తూ అమ్మిన పాలతో కుటుంబాన్ని పోషిస్తోంది. నా చెల్లెలు పెళ్లి కోసం రూ.14 లక్షలు అప్పు చేశాం. చేసిన అప్పు తీర్చేందుకు మార్గం లేక ఏజెంటు భోగాపురం శ్రీనివాసరావు మలేషియాలో మంచి ఉద్యోగం ఇప్పిస్తా అంటే ఆయనకు లక్ష రూపాయలు ఇచ్చి, మెడికల్ కు 10వేల రూపాయలు చెల్లించి మలేషియా వచ్చాను.
పాస్ పోర్టు లాగేసుకున్నారు...
మలేషియాకు రాగానే విమానాశ్రయంలోనే మా వద్ద నుంచి పాస్ పోర్టును లాగేసుకున్నారు. ఒక రెస్టారెంటుకు తీసుకువెళ్లి అక్కడ పనిచేయాలని కోరారు. హోటల్ లో వంటమాస్టరు వద్ద అసిస్టెంటుగా కూరలు తరగడం, గిన్నెలు తోమటం, హోటల్ ఊడవటం, బాత్రూంలు కడగటం... వెయిటరుగా, ఇలా అన్నీ పనులను మాతో బలవంతంగా చేపిస్తున్నారు. మోషన్స్ అవుతున్నా పనిచేయాల్సిందేనని బలవంతం పెట్టారు. జ్వరం వచ్చినా కనీసం టాబ్లెట్లు కూడా ఇవ్వరు. పనిచేయకుంటే జీతం కట్, భోజనం పెట్టరు. షెడ్లలో కింద పడుకోవాలి. ఇక్కడ నల్లులు, పురుగులు కుడుతుండటంతో మా చేతులకు మచ్చలు ఏర్పడ్డాయి.
మమ్మల్ని మనుషుల్లా చూడటం లేదు...
మా నాన్నకు ఆరోగ్యం బాగా లేదని, చూసేందుకు పంపించమని వేడుకున్నా, వారి నుంచి స్పందన లేదు. కనీసం మమ్మల్ని మనుషుల్లా కూడా చూడటం లేదు. యంత్రాల్లా మాతో పనిచేయించుకుంటున్నారు. ఆరోగ్యం బాగా లేకున్నా, శరీరం సహకరించకున్నా పని చేయాల్సిందే...తిరిగి స్వదేశానికి వెళదామంటే లక్షరూపాయలు చెల్లించాలని అంటున్నారు. వేరే యువకుడి తండ్రి మరణించినా, అతని తండ్రి కడచూపు కోసం కూడా పంపించలేదు. కర్కశంగా వ్యవహరిస్తూ బందీఖానాల్లో ఉంచి మాతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. మాకు సెలవులు కూడా ఇవ్వకుండా రోజూ పనిచేయించుకుంటున్నారు. దీంతో పాటు ఇరుకు గదుల్లో నల్లులు, పురుగుల మధ్య నేలపైనే పడుకోవాల్సి వస్తుంది’’ అని మోహన్ విలపిస్తూ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
జైళ్లలో తెలుగు కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారు...
మన తెలుగు రాష్ట్రాల కార్మికులు ఏజెంట్ల మోసాల వల్ల విజిట్ వీసాపై వచ్చి మలేషియాలో చిక్కుకుపోతున్నారని మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కొంతమంది కార్మికుల కష్టాలు వెలుగుచూస్తుండగా, వెలుగుచూడని వారెందరో ఉన్నారని ఆయన తెలిపారు. మరికొందరు అక్రమంగా నివాసముంటూ మలేషియా పోలీసుల చేతికి చిక్కి జైలు పాలవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
సాయం చేయండి
జైలులో వేసి, వారి బట్టలు ఊడదీసి పడుకోబెట్టి పిర్రలపై కొరడా దెబ్బలు కొడుతుంటారని, దీంతో చాలామంది తెలుగు కార్మికులు ఒళ్లంతా పుండ్లు ఏర్పడి నడవలేక, కూర్చోలేక వీల్ ఛైర్ల పాలవుతున్నారని, అలాంటి వారిని తాము భారతీయ రాయబారి సహాయంతో స్వదేశానికి పంపిస్తున్నామని మోహన్ రెడ్డి చెప్పారు. గుండెపోటుతో లేదా అనారోగ్యంతో మరణించినా, వారి మృతదేహాలను స్వదేశానికి పంపించాలంటే లక్షన్నర రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన చెప్పారు. మలేషియా ప్రభుత్వం అక్రమ వలస కార్మికులకు క్షమాభిక్ష ప్రసాదించిన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఒక్కొక్కరికి రూ.30వేలు సాయం అందించి వారిని స్వదేశాలకు తరలించాలని మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలుగు వలస కార్మికులను సర్కారు సాయం చేయాలి
తెలుగు వలస కార్మికులను సర్కారు సాయం చేయాలని తెలుగు ఎక్స్ పాట్స్ అసోసియేషన్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ కంచర్ల ఆనంద్ డిమాండ్ చేశారు. మలేషియాలో తెలుగు కార్మికుల కష్టాలపై కంచర్ల ఆనంద్ ‘ఫెడరల్ తెలంగాణ’తో మాట్లాడారు. ఏజెంట్ల చేతుల్లో మోసపోయి మలేషియాలో దుర్భర జీవితం గడుపుతున్న వలస కార్మికులు ఎందరో ఉన్నారని వారిని, స్వదేశానికి తరలించేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని ఆయన కోరారు. మంచి ఉద్యోగాలంటూ ప్రలోభపెట్టి మలేషియా తీసుకువచ్చి వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆయన చెప్పారు. దీనిపై కార్మికులు ఫిర్యాదు చేస్తే తాము రాయబార కార్యాలయాలు, మలేషియా సెంట్రల్ పోలీసులకు చెప్పి వారిని రక్షిస్తామని చెప్పారు. అనారోగ్యం పాలై మరణించిన కార్మికులున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళలను ఉద్యోగాల పేరిట తీసుకువచ్చి మలేషియాలో వ్యభిచారం రొంపిలో దించుతున్నారని ఆనంద్ ఆవేదనగా చెప్పారు. తమ సంఘం బాధితులకు బాసటగా నిలుస్తుందని పేర్కొన్నారు.