ముఖ్యమంత్రి పదవిలో ఉండికూడా సాదాసీదా జీవితం గడిపిన నేతలు వీరే!
x

ముఖ్యమంత్రి పదవిలో ఉండికూడా సాదాసీదా జీవితం గడిపిన నేతలు వీరే!

జగన్,కేసీఆర్, కేజ్రీవాల్ వంటి నేతలు ఒకరకమైతే, నాణేనికి మరోవైపులాగా ముఖ్యమంత్రులుగా ఉంటూనే అత్యంత సామాన్యులలాగా జీవితాన్ని సాగించిన నేతలు కూడా కొందరు ఉన్నారు.


నిన్నటినుంచి తెలుగు రాష్ట్రాలలో ఏ ఇద్దరు కలిసినా రుషికొండ భవనాలలోని కళ్ళు చెదిరే నిర్మాణాల గురించే చర్చ! జనానికి కడుపు రగిలిపోతోంది(వైసీపీ అభిమానులకు మినహాయించి). మన డబ్బును వేరేవాళ్ళు మంచినీళ్ళలాగా ఖర్చుపెట్టి విలాసాలు అనుభవిస్తుంటే కడుపు మండకుండా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డే కాదు, తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో కేజ్రీవాల్‌లది కూడా ఇదే తంతు. జనం డబ్బుతో జల్సాలు చేసుకోవటం.

జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు సెంటు భూమి విదిల్చి, తాను మాత్రం 1.41 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బృహత్తర రాజప్రాసాదాన్ని నిర్మించుకుంటే, కేసీఆర్ 1.69 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రగతి భవన్ నిర్మించుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలను పేదలకు, పెత్తందార్లయిన ప్రత్యర్థులకు మధ్యజరిగే క్లాస్ వార్‌గా అభివర్ణించిన జగన్, రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి రు.45 కోట్లు ఖర్చుచేస్తే, పేదల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తానని చెప్పుకున్న కేసీఆర్ రు.45.91 కోట్లు(అధికారిక గణాంకాలు) ఖర్చుచేశారు. తమ భవనాలలో దేశవిదేశాలకు చెందిన అత్యంత ఖరీదైన, విలాసవంతమైన నిర్మాణ సామాగ్రిని వినియోగించారు. విచిత్రంగా అవినీతిపై పోరాట ఉద్యమం ద్వారా ఫోకస్‌లోకి వచ్చి, తదనంతరం ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ కూడా ఇదే విధంగా తన భవనం పునర్మిర్మాణానికి ఇంతే మొత్తంలో రు.45 కోట్లు ఖర్చుపెట్టారు. మొదటిసారి ఢిల్లీ ఎన్నికలలో పోటీ చేసే సమయంలో, తాను ముఖ్యమంత్రినయితే సాదాసీదా జీవితం గడుపుతానని, తనకు నాలుగైదు గదుల ఇల్లు చాలని చెప్పిన కేజ్రీవాల్, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్ధతులన్నీ మార్చేశారు. తన ఇంటి పునర్నిర్మాణానికి విడతలవారీగా రు.45 కోట్లు ఖర్చుపెట్టి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఇంటికి భారీగా ఖర్చుపెట్టటం విషయంలో ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏమీ తక్కువ తినలేదు. 2014-19 కాలంలో జుబ్లీహిల్స్‌లోని తమ ఇంటి పునరుద్ధరణ పనులు జరుగుతుండటంతో చంద్రబాబు కుటుంబం కొన్ని నెలలపాటు ఫైవ్ స్టార్ హోటల్ పార్క్ హయత్‌లో విడిది చేసింది. కనీసం నెలపాటు మకాం వేసేవారికోసం ఆ హోటల్‌లో మూడు బెడ్ రూమ్‌ల సర్వీస్ అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. బాబు కుటుంబం అలాంటి అపార్ట్‌మెంట్స్ రెండింటిని అద్దెకు తీసుకుంది. ఇది కాక ఓటుకు నోటు కేసు జరగటానికి ముందు హైదరాబాద్‌లో ఏపీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంకోసం, హైదరాబాద్ సెక్రెటేరియట్ కోసం కొన్ని కోట్లు ఖర్చుపెట్టి లేక్ వ్యూ అతిథి గృహాన్ని బాగుచేయించారు. ఓటుకు నోటు కేసు తర్వాత ఆ ఇంటిని వదిలేసి అమరావతికి వెళ్ళిపోయారు.

మరోవైపు ఏ కొద్ది దూరానికి వెళ్ళాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా ఛార్టర్డ్ విమానంలోనే వెళ్ళేవారు. ఒక పక్క కట్టుబట్టలతో తరిమేశారని చెబుతూనే ఇలాంటి దుబారాకు పాల్పడటం జనానికి నచ్చకపోవటం వల్లనే అప్పట్లో ఆయనను ఇంటికి పంపేశారు.

జగన్,కేసీఆర్, కేజ్రీవాల్ వంటి నేతలు ఒకరకమైతే, నాణేనికి మరోవైపులాగా ముఖ్యమంత్రులుగా ఉంటూనే అత్యంత సామాన్యులలాగా సాదాసీదా జీవితాన్ని సాగించిన నేతలు కూడా మనదేశంలో కొందరు ఉన్నారు. ఈశాన్య భారతంలోని త్రిపురకు ముఖ్యమంత్రులుగా చేసిన మాణిక్ సర్కార్, నృపేన్ చక్రవర్తి, మొన్నటిదాకా ఒడిషా ముఖ్యమంత్రిగా చేసిన నవీన్ పట్నాయక్, గోవా ముఖ్యమంత్రిగా చేసిన మనోహర్ పారిక్కర్ వంటివారు ఆ పదవిలో ఉంటూ కూడా అతి సామాన్య జీవితాన్ని గడిపారు.

నృపేన్ చక్రవర్తి-మాణిక్ సర్కార్

త్రిపురకు 1978 నుంచి 1988 దాకా ముఖ్యమంత్రిగా చేసిన నృపేన్ చక్రవర్తి నివాసముండే ప్రభుత్వ బంగళాలో కనీసం ఏసీ కూడా ఉండేది కాదు. ఆయన తన బట్టలు తానే ఉతుక్కునేవారు. 1988లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవటంతో తన ట్రంకుపెట్టెను తీసుకుని ఒక రిక్షాలో అధికారిక బంగళాను ఖాళీచేసి వెళ్ళారు. ఇక అదే రాష్ట్రానికి 1998లో ముఖ్యమంత్రి అయిన మాణిక్ సర్కార్‌ది కూడా అదేరకం జీవనశైలి. ముఖ్యమంత్రి అయినా కూడా తమ ముత్తాతలనాటి ఇంట్లోనే నివాసం ఉండేవారు. తనకు సీఎమ్‌గా వచ్చే జీతం మొత్తాన్నీ పార్టీకి ఇచ్చేసేవారు, రు.5,000 మాత్రం ఎలవెన్స్‌గా తీసుకునేవారు. ఆయన 20 ఏళ్ళపాటు ఆ పదవిలో ఉన్న సర్కార్‌కు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే అవసరమే ఎప్పుడూ రాలేదు. ఆయనగానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినిగా పని చేసిన ఆయన భార్యగానీ ఎప్పుడూ ప్రజా రవాణా వ్యవస్థల వాహనాలలోనే ప్రయాణించేవారు. ఆయన జీవనశైలిని ప్రత్యర్థిపార్టీలవారుకూడా మెచ్చుకునేవారు. 2018లో ఆయన పార్టీ ఎన్నికల్లో ఓడిపోవటంతో ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు.

నవీన్ పట్నాయక్

ఇక మొన్నటిదాకా ఒడిషా ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ విషయానికొస్తే, ఆయన 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఈ మొత్తంకాలం ఆయన తనకు వారసత్వంగా సంక్రమించిన ఇంటినే నివాసంగా వాడుకునేవారు. ఒక డొక్కు మారుతి ఎస్టీమ్ కారులోనే చాలా సంవత్సరాలు తిరిగారు. అయితే అది ఒకరోజు వర్షంలో ఆగిపోయి మొరాయించటంతో అధికారుల ఒత్తిడిమేరకు మారుతి కంపెనీదే ఎస్ఎక్స్4 కారు కొనుగోలు చేశారు.

మనోహర్ పారిక్కర్

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ కూడా ఇదే కోవకు చెందిన నాయకుడు. నిజాయితీకి, అత్యున్నత నైతిక విలువలకు ఆయన మారుపేరు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాకూడా అధికారిక నివాసాన్ని వాడుకోకుండా, తన సొంత ఇంట్లోనే ఉండేవారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు తనకు కేటాయించిన ఇన్నోవా వాహనాన్నే వాడేవారు. తరచూ తన సొంత స్కూటర్‌పై తిరుగుతూ కనిపించేవారు. కొన్నిసార్లు ప్రజా రవాణా వ్యవస్థ వాహనాలలోనే ప్రయాణిస్తుండేవారు. తన మొబైల్ ఫోన్ బిల్లులను కూడా ప్రభుత్వ ఎలవెన్సులనుంచి కాకుండా సొంతంగా కట్టుకునేవారు. ఈయన 2019లో క్యాన్సర్ కారణంగా చనిపోయారు.

Read More
Next Story