తడిసి నేలవాలిన వరిపంట

కోస్తా జిల్లాల్లో లక్షల ఎకరాల్లో వరి ధాన్యం నేలపాలు, కోతకు గురైన చప్టాలు, చెరువులు, వాగులు, రోడ్లు బుధవారం సాయంత్రానికి నష్టం వివరాలు అందే అవకాశం


ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో మిగ్‌జాం తుపాన్‌ బీభత్సం సృష్టించింది. వర్షానికి, చలికి ప్రజలు వణికి పోతున్నారు. పూరిగుడిసెల్లో ఉండే వారు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. పునరావాస కేంద్రాలకు తరలించినా అక్కడ కప్పుకునేందుకు దుప్పట్లు లేవు. ఇండ్ల వద్ద నుంచి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు బాధితులు వచ్చారు. భారీ చెట్లు నేల కూలాయి. విద్యుత్‌ స్తంభాలు కిందపడ్డాయి. కొన్ని చోట్ల ట్రాన్స్‌ఫారాలు కూడా దిమ్మెలపై నుంచి కిందపడ్డాయి. ప్రధానంగా వరి రైతులను నీట ముంచింది. పండించిన పంట రెండు రోజులుగా కళ్లముందే నీళ్లలో పోయింది. మంత్రులు, ఉన్నతాధికారులు కొన్ని చోట్ల నీటిలో ఉన్న ధాన్యాన్ని వాహనాల ద్వారా స్కూలు కాంపౌండ్స్, మెరక ప్రాంతాలకు తరలించారు. కొన్ని చోట్ల ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలించారు. కొన్ని జిల్లాల్లో మిర్చి, పొగాకు పంటలు కూడా నీట మునిగాయి. అరటి తోటలు పూర్తిగా నేలకూలాయి. చాలా చోట్ల జామ, బత్తాయి, నిమ్మ, దానిమ్మ వంటి పండ్లతోటల్లో చెట్లు నేలకొరిగాయి. గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులు వంటి పశు సంపద రెండు రోజులుగా మేతలేక అల్లాడుతున్నాయి. కల్లాల్లో నిల్వ ఉంచిన ఎండుగడ్డి కూడా తడిసిపోయింది.


కృష్ణా జిల్లాలో..
మంగళవారం మధ్యాహ్నం వరకు అధికారులు వేసిన అంచనాల ప్రకారం 294 గ్రామాల్లో 1,18,875 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. కొంత నీట మునగగా, కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముదై్దంది. అలాగే వేరుశనగ 1,706 గ్రామాల్లో వర్షాలకు పనికి రాకుండా పోయింది. ఇది ప్రాథమిక అంచానా మాత్రమే డిసెంబరు 6వ తేదీ సాయంత్రానికి నష్టం పూర్తి వివరాలు అందే అవకాశం ఉంది. దెబ్బతిన్న గ్రామాలు ప్రధానంగా పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కొండూరు, మువ్వ, ఘంటసాల, పెదపారుపూడి, నందివాడ, పామర్రు, గుడ్లవల్లేరు, కంకిపాడు, తోట్లవల్లూరు, వుయ్యూరు, ఉంగుటూరు, పమిడిముక్కల, పెనమలూరు, బాపులపాడు మండలాల్లో ఉన్నాయి. 25 మండలాల్లోని 294 గ్రామాలను వరద ముంచెత్తింది.
బాపట్ల జిల్లా..
జిల్లాలో 18 మండలాల పరిధిలోని 177 గ్రామాల్లో తుపాన్‌ ప్రభావం ఉంది. 68,770హెక్టార్లలో వరి పంట నీటిపాలైంది. 485 హెక్టార్లలో వేరు శనగ, 1511 హెక్టార్లలో పొగాకు, 477 హెక్టార్లలో మొక్కజొన్న, 4957 హెక్టార్లలో వేరుశనగ, 2947 హెక్టార్లలో మినుము, 889 హెక్టార్లలో మిగిలిన పంటలు పూర్తిగా ధ్వసమైనట్లు ప్రాథమిక అంచనాకు అధికారులు వచ్చారు. ఇది బుధవారం సాయంత్రానికి రెట్టింపయ్యే అవకాశం ఉందని కొందరు అధికారులు తెలిపారు. పంటలే కాకుండా విద్యుత్‌ శాఖకు కూడా తీవ్ర నష్టం జరిగింది. అక్కడక్కడ పూరి గుడిసెలు, కాంపౌండ్‌ గోడలు పడిపోయాయి.
తూర్పుగోదావరి జిల్లా..
జిల్లాలో 9,300 ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, కలెక్టర్‌ హిమాన్స్‌శుక్ల పంటలు దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. బుధవారం సాయంత్రానికి నష్టం వివరాలు అందుతాయని కలెక్టర్‌ హిమాన్స్‌ శుక్ల చెప్పారు.
ఏలూరు జిల్లాలో...
నష్టం వివరాలు తెలుసుకునేందుకు గ్రామాల్లో బృందాలు అంచనాలు తయారు చేస్తున్నాయి. బుధవారం సాయంత్రానికి పూర్తిస్థాయిలో వివరాలు వచ్చే అవకాశం ఉంది. సుమారు లక్ష ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే 1.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు కలెక్టర్‌ వి ప్రసన్న వెంకటేశ్‌ తెలిపారు. బాదిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 2500లు ఇస్తామని, వ్యక్తులకు రూ. 1000లు ఇస్తామని వెంకటేశ్‌ తెలిపారు.






Next Story