ఆదిలాబాద్ పులి ఆంధ్రప్రదేశ్‌లో హల్‌చల్
x
ఏలూరు జిల్లాలో ఎట్టకేలకు కెమెరా ట్రాప్ కు చిక్కిన తెలంగాణ పులి

ఆదిలాబాద్ పులి ఆంధ్రప్రదేశ్‌లో హల్‌చల్

అడవికి రాజైన పులి ఊరుబాట…ఏలూరు జిల్లా గ్రామాల్లో పులి దాడులతో ఉలిక్కిపడ్డ ప్రజలు


తెలంగాణ నుంచి వలస వచ్చిన పులి ఆంధ్రప్రదేశ్ అడవుల్లో సంచరిస్తుండటంతో ఏలూరు జిల్లా గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ పులుల అభయారణ్యం నుంచి బయలుదేరిన ఈ పులి పశువులపై దాడులు చేసి ఐదు ఆవులను చంపడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.పొలాలకు వెళ్లాలంటే భయం…తమ ఆవులపై పులి వరుస దాడులు చేస్తుండటంతో రైతలకు రాత్రివేళ కునుకు పట్టడం లేదు. తెలంగాణ నుంచి వచ్చిన పులి ఆంధ్రాలోని ఏలూరు జిల్లా గ్రామాల్లో సంచరిస్తూ ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది.


తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పులి ఆంధ్రాలో సంచరిస్తుండటం సంచలనం రేపింది. ఒక వైపు జాతీయ స్థాయిలో పులుల గణన సాగుతుండగా తనకు ఎల్లలు లేవని నిరూపిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ పులుల అభయారణ్యానికి చెందిన పులి తెలంగాణలోని కావడిగుండ్ల ప్రాంతం నుంచి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లింది. తెలంగాణ పులి ఆంధ్రాలో సంచరిస్తూ రైతులను అల్లాడిస్తోంది.



అయిదు ఆవులను చంపిన పులి

బుట్టాయగూడెం మండలం అంతర్వేదిగూడెం, నాగులగూడెం గ్రామాల్లోని పశువుల మందలపై పులి దాడులు చేసి అయిదు ఆవులను చంపిందని తేలింది. గత నాలుగు రోజులుగా ఏలూరు అడవుల్లో కల్లోలం సృష్టించిన పులి ఎట్టకేలకు శనివారం కెమెరా ట్రాప్ కు చిక్కింది.నాగులగూడెంలో రెండు ఆవులను చంపిన పులి ఆవు కళేబరాల వద్ద కు వచ్చి తింటుండగా కెమెరాట్రాప్ చిత్రం రికార్డు చేసింది.అంతర్వేదిగూడెం వద్ద పశువుల కొట్టాలపై దాడి చేసిన ఆవులను చంపిన పులి కొర్రాజుల కొండపైకి ఎక్కినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.

మన్యం గ్రామాల్లో అలెర్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా పందిరిమామిడి గూడెం,బుట్టాయిగూడెం, దెందులూరు, చల్ల చింతలపూడి ప్రాంతంలో తెలంగాణ పులి సంచరించినట్లు ఆంధ్రా అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. గుబ్బల మంగమ్మ గుడి ప్రాంతంలోనూ పులి సంచరించిందని స్థానికులు గుర్తించారు. అంతర్వేది గూడెం, ఇసుమూరు, గాడిదబోరు, పందిరిమామిడి గూడెం చుట్టు పక్కల గ్రామాల్లో పులి సంచరించడంతో ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.అంతర్వేదిగూడెం, నాగులగూడెం గ్రామాల్లోపులి కదలికలను అటవీశాఖ అధికారులు గమనించారు. పులి సంచారం నేపథ్యంలో పలు గ్రామాల రైతులు, కూలీలు పొలాలకు వెళ్లడం లేదు. తెలంగాణ నుంచి దారి తప్పి ఆంధ్రాలోని ఏలూరు జిల్లాలోకి వచ్చిన పులిని బంధించాలని ప్రజలు కోరుతున్నారు.



ప్రత్యేక కంట్రోల్ రూం

ఏలూరు జిల్లా గ్రామాల్లో పులి సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి పులి కదలికలపై నిఘా వేశారు.ప్రజలు రాత్రివేళల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒంటరిగా బయట తిరగవద్దని రైతులకు అధికారులు సూచించారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారుల సూచనలతో పులి సంచరిస్తున్న గ్రామాల్లో అటవీశాఖ అధికారులు కెమెరా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి వల్ల తమకు ప్రాణహాని పొంది ఉన్నందున దాన్ని బంధించాలని అటవీశాఖ అధికారులను ప్రజలు కోరారు. మిరప, మొక్కజొన్న పొలాల్లో పులి రాత్రివేళ తిరుగుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పాపికొండలు, కవ్వాల్ పులుల అభయారణ్యం మీదుగా పులి ఆంధ్రాలోకి వచ్చింది. నాలుగైదు రోజులుగా పులి సంచారంతో గ్రామస్థులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. పులిని బంధించేందుకు బోన్లను సైతం రంగంలోకి దించారు. పులి పాదముద్రలను గుర్తించిన ప్రజలు పులి సంచారంతో తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.

అడవిలోకి పశువులను తీసుకువెళ్లొద్దు
ఏలూరు ప్రాంతంలో గతంలో పులి సంచరించిందని అటవీశాఖ అధికారులు చెప్పారు. పశువులను మేత కోసం అడవిలోకి తీసుకు వెళ్లరాదని అటవీశాఖ అధికారులు కోరారు. ప్రజల భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.స్థానికులను హెచ్చరించడానికి పబ్లిక్ అనౌన్స్‌మెంట్లు, సాంప్రదాయ డప్పుల చాటింపు మరియు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశారు.

అఖిల భారత పులుల గణన 2026
దేశవ్యాప్తంగా సాగుతున్న పులుల గణన తెలంగాణలోని అన్ని అటవీ బీట్లలో కొనసాగుతోంది. పులుల గణన ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పులులు జనవాసాల్లో సంచరిస్తున్నాయి. అటవీశాఖ సిబ్బంది,వాలంటీర్లు పులుల ఆనవాళ్లు, వేటాడే జంతు జాతులు, ఆవాస స్థితి, జీవవైవిధ్య డేటాను నమోదు చేయడానికి క్రమబద్ధమైన క్షేత్ర సర్వే చేస్తున్నారు.

పులి సంచారం నేపథ్యంలో ప్రజల భద్రతే లక్ష్యంగా అటవీశాఖ అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పులిని సురక్షితంగా పట్టుకుని తిరిగి అడవిలోకి తరలించే వరకు గ్రామాల్లో అప్రమత్తత కొనసాగుతుందని అటవీ శాఖ అధికారులు చెప్పారు.అడవుల్లో ఉండాల్సిన పులి జనవాసాల వైపు రావడంతో గ్రామాల జీవనం స్తంభించింది. పులిని బంధించే క్షణం కోసం ఏలూరు జిల్లా మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.వన్యప్రాణుల ఆవాసాలు పోడ సేద్యం వల్ల కుచించుకుపోతున్న నేపథ్యంలో పులులు జనవాసాల వైపు రావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. పులి–మనిషి మధ్య ఘర్షణలు నివారించేందుకు సమన్వయ చర్యలు అవసరమని వన్యప్రాణి నిపుణులు ఏ శంకరన్ సూచించారు.


Read More
Next Story