బిగ్‌బాస్‌ ఫైనలిస్ట్స్‌ వీరే

మరో వారంలో ముగింపు


బిగ్‌బాస్‌ సీజన్‌-7 ఫైనలిస్టుల ఉత్కంఠకు తెరపడింది. ఫైనల్ పోరులో ఉండబోయే వాళ్లెవరో తెలిపోయింది. బిగ్‌బాస్‌ సీజన్‌-7 ముగింపుకొచ్చింది. వచ్చే వారంతో ముగుస్తుంది. ఫైనలిస్టుల పేర్లను వ్యాఖ్యాత, సినీనటుడు నాగార్జున ప్రకటించారు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన శోభాశెట్టి ఎలిమినేట్‌ అయ్యారు. ఫైనలిస్టులుగా అమర్‌, అర్జున్‌, ప్రియాంక, యావర్‌, పల్లవి ప్రశాంత్‌, శివాజీ మిగిలారు. హౌస్‌ లోపలి నుంచి బయటికొచ్చిన శోభ బావురుమన్నారు. ఆమెను ఓదార్చడం నాగార్జునకు కష్టమైంది.

హౌస్‌ నుంచి బయటికి వచ్చిన శోభాశెట్టి ఫైనలిస్టులుగా ఉన్న వాళ్ల బలం, బలహీనతలేమిటో ఏకరవు పెట్టారు. అర్జున్‌కి బ్యాడ్‌సైడ్‌ అంటూ ఏమి లేదన్నారు. కాకపోతే కాస్తంత నెగటివ్‌ టోన్‌ వినపడుతోందని, దాన్ని మార్చుకోవాలని సలహా ఇచ్చారు. ప్రియాంకా బాగానే ఆడుతోందని, గొడవ పడినా తొందరగా కలిసిపోతుందని చెప్పుకొచ్చారు. చెప్పేటప్పుడు మన మాట వినదట. ఇక యావర్‌ కాన్ఫిడెన్స్‌గా ఉన్నా ఎదుటి మనుషులను మాత్రం అర్థం చేసుకోడట. ప్రశాంత్‌కి అన్నీ బెస్ట్‌ క్వాలిటీసేనన్నారు. పరిస్థితులను బట్టి రియాక్ట్‌ అవుతాడని మెచ్చుకున్నారు. శివాజీ హౌస్‌ను బాగా గైడ్‌ చేస్తున్నారని, ఆయన పెద్దరికం బాగా పనికివస్తుందని ముక్తాయించారు. అమర్‌ ట్రోఫీతో అనంతపురానికి వెళ్లాలంటే ఆవేశం వదిలేయాలని సలహా ఇచ్చారు.
అంతకుముందు నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ‘నా సామిరంగ’ ప్రమోషన్స్‌లో భాగంగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి వచ్చి సందడి చేశారు. ఇప్పటికి 14 వారాలుగా నడుస్తున్న బిగ్‌ బాస్‌ 7 సీజన్‌లో ఎవరెవరు ఏమేమి నేర్చుకున్నారో చెప్పుకొచ్చారు.
గేమ్‌ విషయంలో ప్రశాంత్‌ చాలా సూటిగా ఉంటాడని, ఆయన్నుంచి నిజాయితీ నేర్చుకున్నానని అమర్‌ చెబితే ఓపికతో ఎలా ఉండాలో శివాజీని చూసి నేర్చుకున్నానని యావర్‌ చెప్పుకొచ్చారు. ఫౌల్‌ గేమ్స్‌ ప్లే చేయకూడదని అమర్‌ నుంచి నేర్చుకున్నట్టు వివరించింది ప్రియాంక. ఇక అర్జున్‌ ఇతరులతో లౌక్యంగా ఎలా ఉండాలో శివాజీ దగ్గరి నుంచి నేర్చుకున్నానన్నారు. హౌస్‌లో చాలా నేర్చుకున్నా వాటిని ఆచరించడం కుదురుతుందా అన్నది సందేహమేనన్నారు అర్జున్‌. ఎవరి దగ్గరా ఏమీ నేర్చుకోలేదని, పరిస్థితులను బట్టి అందరూ మారిపోతుంటారని ముక్తాయించింది శోభ. అయితే ఆమె ఓ విషయాన్ని కచ్చితంగా పాటిస్తానంటూ ఫోన్‌ వాడకాన్ని తగ్గిస్తాననడం అందర్నీ ఆకట్టుకుంది. హౌస్‌లో ఆకలి రుచేమిటో యావర్‌ నుంచి తెలుసుకున్నానని శివాజీ చెప్పుకొస్తే ప్రశాంత్‌ మాత్రం శివాజీ నుంచి చాలా నేర్చుకున్నానని, ఎదుటి వాళ్లు బాధలో ఉన్నప్పుడు మనం నవ్వితే వాళ్లు కూడా ఆ బాధ నుంచి బయట పడతారని శివాజీ సిద్ధాంతంగా ఉందట.



Next Story