తెలంగాణలో ఆ బుడిబుడి అడుగులు ‘తప్పిపోతున్నాయి’
x
నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా లెక్కలు చేస్తే భయమవుతుంది

తెలంగాణలో ఆ బుడిబుడి అడుగులు ‘తప్పిపోతున్నాయి’

తెలంగాణ పసిపిలల్లు పెద్ద ఎత్తున తప్పిపోతున్నారు. రోజున పదిమంది పిల్లలు తప్పిపోతున్నట్లు అధికారిక లెక్కలు. అసలేం జరుగుతోంది?


చిన్న పిల్లలు ఆడుకుంటూ కాస్త దూరంగా వెళ్తేనే తల్లిదండ్రులు పరుగెత్తుకుంటూ వచ్చి దగ్గరికి తీసుకుంటారు. అనుక్షణం కంటికి రెప్పలా కాచుకుంటారు. అలాంటి తల్లిదండ్రులు కాస్త ఏమరపాటుగా ఉన్నక్షణంలో ఆ పిల్లలు కనిపించకుండా పోతే.. పరిస్థితి ఎలా ఉంటుంది. మాటల్లో చెప్పడం కాదు.. ఊహకు సైతం అందదు. కానీ మన రాష్ట్రంలో గడిచిన మూడే ళ్లలో(2020-2022) ఎంతమంది పిల్లలు మిస్ అయ్యారో తెలుసా... పదివేల మంది.. అవును అక్షరాల పదివేలమంది పిల్లలు తప్పిపోయినట్లు జాతీయ నేర గణాంక సంస్థ(నేషనల్ (National Crime Record Bureau NCRB)రికార్డులు తెలియజేస్తున్నాయి.

అంటే సగటున తెలంగాణలో ప్రతిరోజు పదిమంది పిల్లలు అపహరణకు లేదా మానవ అక్రమ రవాణాకు గురి అవుతున్నారు. ఇలా ప్రతి పదివేల కుటుంబాలకు ఒక అపహరణ కేసు నమోదు అవుతున్నట్లు గడిచిన మూడు సంవత్సరాల రికార్డులు పరిశీలిస్తే అర్దమవుతుంది. గడిచిన సంవత్సరం అంటే 2022లో తెలంగాణలో 4097 కేసుల్లో 3,443 పిల్లలు మానవ అక్రమరవాణా లేదా తప్పిపోయినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 654 పిల్లల జాడ ఇప్పటి వరకూ తెలియదు. అందులో 391 ఆడ పిల్లలు ఉండటం గమనార్హం. ఈ మిస్సింగ్ గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

2020లో 3100 పిల్లలు తప్పిపోయినట్లు ఫిర్యాదులు రాగా వారిలో 1230 మంది మగ పిల్లలు, 1870 మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఇందులో 293 మంది మగ పిల్లలు, 362 మంది ఆడపిల్లల మొత్తంగా 655 పిల్లల జాడ దొరకలేదు. అలాగే 2021లో 3,956 కేసులు నమోదు కాగా అందులో మగ పిల్లలు 1382, ఆడపిల్లలు 2574 మంది ఉన్నారు. వారిలో 777 మంది పిల్లల జాడ దొరకలేదు. ఇందులో మగ పిల్లల వాటా 357, ఆడ పిల్లల సంఖ్య 420. కాగా 2022 లో ఈ సంఖ్య కాస్త తగ్గింది. ఈ సంవత్సరంలో మొత్తం 3,443 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 1448 మగ పిల్లలు, 1995 ఆడ పిల్లలు ఉన్నారు. ఇందులో తిరిగి ఇంటికి చేరిన వారు మొత్తం 654 కాగా, మగ పిల్లల సంఖ్య 263, ఆడ పిల్లలు 391గా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఆ ఒత్తిళ్లు భరించలేక.. ఇంట్లో వాతావరణ బాలేక..

చాలా సందర్భాల్లో ఇంటి నుంచి పిల్లలు వెళ్లిపోవడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల ప్రవర్తనే కారణమని సామాజిక కార్యకర్త కండె రమేష్ చెబుతున్నారు. చదువు అంటే పిల్లలకు ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోకుండానే చదవండని ఒత్తిడి పెట్టడం, వాళ్లు అనుకున్న ర్యాంకులు రాకపోతే చులకనగా చూడటంతో పిల్లలు భరించలేక ఇంటినుంచి పారిపోతున్నారని ఆయన అంటున్నారు.‘కొంతమంది తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఆశిస్తున్న ఆప్యాయత కొరవడం, ఎలాంటి బాండింగ్ ఏర్పడకపోవడం కూడా ఒక కారణం’అని ఆయన చెబుతున్నారు.

ఇలా ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు చెడు సావాసం చేస్తూ, నేరాలను ప్రోత్సహించే ముఠాలకు ఉదాహరణకు బెగ్గింగ్ మాఫియా,మానవ అక్రమ రవాణా ముఠాలకు చిక్కినట్లయితే వారి జాడ కనిపెట్టడం చాలా కష్టమని కండె రమేష్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకూ పిల్లలను ఓ కంట కనిపెడుతూ, వారి అభిరుచులకు అనుగుణంగా నడుచుకుంటే ఇంటి నుంచి పారిపోవడాన్ని సాధ్యమైనంతా వరకూ అరికట్టవచ్చునని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటి నుంచి పారిపోతున్న లేదా అపహరణకు గురి అవుతున్న వారిలో ఆడ పిల్లల వయస్సు సగటున 12-16 మధ్య ఉందనే విషయం చాలా ఆందోళన కలిగించే పరిణామంగా చెప్పవచ్చు. వీరిలో చాలామంది జాడ పసిగట్టడం దర్యాప్తు అధికారులకు సవాల్ గా మారింది. అపహరణకు గురవుతున్న చిన్న పిల్లల వయస్సు సగటున 3-7 సంవత్సరాల మధ్య ఉంటుంది. వీరిని ఎక్కువగా బెగ్గింగ్ మాఫియాలో ఉపయోగిస్తారని సోషల్ ఆక్టివిస్టులు చెబుతున్నారు.

మన రాజధాని పిల్లలకు సేఫ్ కాదా?

రాజధానిలో పిల్లలపై జరుగుతున్న అకృత్యాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూనే, పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ పిల్లలపై జరిగే దాడులు మాత్రం ఆగుతున్నట్లు కనిపించట్లేదు. జాతీయ నేరగణాంక సంస్థ వివరాలు పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది. 2020 లో పిల్లలకు వ్యతిరేకంగా జరిగిన నేరాలపై 467 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. 2021 లో 621, 2022 లో 645 నేరాలు జరిగాయి. కేసులు నమోదయిన వాటిలో 510 కిడ్నాప్ కు సంబంధించినవి కాగా, మిగిలినవి అత్యాచారం, లేదా హత్యకు గురైతే నమోదైనవి. అంటే ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్న నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదని వాస్తవం.

ర్యాంకుల గోల ఆపితే బెటర్

పిల్లలు స్కూల్, ఇల్లు అంటే ఆహ్లదకర వాతావరణం గుర్తుకు వచ్చే విధంగా తల్లిదండ్రులు నడుచుకోవాలని ప్రముఖ సైక్రియాటిస్టు సీ. రాజిరెడ్డి అంటున్నారు. ‘దేశంలో అర్భనైజేషన్ పెరిగింది. కార్పొరేట్ విద్య కోసం పట్టణాలకు వలస వచ్చి అద్దె ఇంటిలో నివసిస్తున్నాం. కాబట్టి మా పిల్లలు చదువులో ఫస్ట్ ర్యాంకు రావాల్సిందే’ అని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఇదే పిల్లలు ఇంటి నుంచి పారిపోవడానికి ప్రధానకారణంగా ఆయన చెబుతున్నారు. పిల్లలకు ర్యాంకులు రాకపోతే బతుకంతా వేస్ట్ అని బలంగా ఇన్ ప్లూయెన్స్ చేస్తున్నారు. ఈ పద్దతి తప్పు. క్రమశిక్షణ, సామాజిక బాధ్యత నేర్పాలి కానీ అది కూడా బలవంతంగా కాదని సైక్రియాటిస్టు డాక్టర్ రాజిరెడ్డి అంటున్నారు.

చేధిస్తున్న కేసులు 87% పైనే

రాష్ట్రంలో నమోదవుతున్న మిస్సింగ్ కేసుల్లో 87 శాతం సాల్వ్ చేస్తున్నట్లు పోలీసు అధికారులు అంటున్నారు. పిల్లలు అపహరణకు గురి అవుతున్న సమాచారం రాగానే మొదట సీఆర్పీపీసీ సెక్షన్ 154 ప్రకారం మిస్సింగ్ కేసు నమోదు చేస్తున్నమని చెబుతున్నారు. నిరంతరం సమాచారం కోసం ఆధునాతన టెక్నాలజీని వాడుతున్నట్లు వివరిస్తున్నారు. అపహరణకు గురవుతున్న వారిలో చాలామందిని తిరిగి వారి కుటుంబాలను చేరడానికి కేవలం మూడు నుంచి నాలుగు గంటలే తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ వారి జాడ నాలుగు నెలలు అయినా తెలుసుకోకపోతే ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ కు వెళ్తుందని వారు చెబుతున్నారు. మిస్సింగ్ కేసు నమోదయిన సందర్భంలోనే వారి ఫోటోలు, ఇతర వివరాలు నమోదు చేసి పోలీస్ స్టేషన్లు కు పంపిస్తామని వారు అంటున్నారు.

Read More
Next Story