
డిసెంబర్ 26 నుంచి రైలు చార్జీల పెంపు.
సబర్బన్ రైలు ప్రయాణికులకు మినహాయింపు
రైలు చార్జీలు(Train fare) డిసెంబర్ 26 నుంచి పెరగనున్నాయి. ఎక్కువ దూరం ప్రయాణించే వారిపై మాత్రమే ఈ భారం పడనుంది. 215 కిలోమీటర్ల (కి.మీ) దూరం వరకు జనరల్-క్లాస్ టిక్కెట్ల ధరలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి కి.మీ.కు 1 పైసా, మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్ల(Railways)లో ప్రయాణానికి, ఎయిర్ కండిషన్డ్ (AC), నాన్-ఎయిర్ కండిషన్డ్ (నాన్-AC)ల్లో ప్రయాణించే వారికి కి.మీ.కు 2 పైసలు అదనంగా వసూలు చేయనున్నారు. మొత్తంగా చూస్తే.. 1,000 కిలోమీటర్ల ప్రయాణానికి అదనంగా రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. సబర్బన్ రైలు ప్రయాణికులకు మినహాయింపు ఇచ్చారు.
పెరగనున్న వార్షిక ఆదాయం..
ఛార్జీల పెంపు వల్ల రైల్వే వార్షిక ఆదాయం రూ.600 కోట్లు పెరగనున్నట్లు సమాచారం. గత పదేళ్లలో పెరిగిన రైల్వే నెట్‌వర్క్, కార్యకలాపాల నిర్వహణకు మరింత మంది సిబ్బంది అవసరం. ప్రస్తుతం జీతాల ఖర్చు రూ.1,15,000 కోట్లకు పెరిగింది. పెన్షన్ ఖర్చు రూ.60వేల కోట్లకు పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం నిర్వహణ ఖర్చులు రూ.2,60,000 కోట్లు దాటిపోయాయి. పెరుగుతోన్న ఖర్చుల నేపథ్యంలో ఛార్జీలను పరిమిత స్థాయిలో పెంచక తప్పడం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు.
అత్యధిక మంది ప్రయాణించే సబర్బన్ సర్వీసులు, నెలవారీ సీజన్ టిక్కెట్ల ఛార్జీల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని స్పష్టం చేశారు. 2025లో ఛార్జీలను పెంచడం ఇది రెండవసారి. జూలైలో AC ప్రయాణం కి.మీ.కు 2 పైసలు పెరిగింది. నాన్-AC విషయంలో ఒక పైసా మాత్రమే.
రైలు ఛార్జీల తాజా పెంపు తర్వాత ముంబై - ఢిల్లీ మధ్య బేస్ ఛార్జీ రూ. 28; ఢిల్లీ - కోల్‌కతా మధ్య రూ. 29; ఢిల్లీ - చెన్నై మధ్య రూ. 44; కోల్‌కతా - చెన్నై మధ్య రూ. 33 పెరిగే అవకాశం ఉంది.

