తెలంగాణలో గులాబీ బాస్ ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్లకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు కేటాయించారు.
ఇందులో ఒకరు బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐపిఎస్ అధికారి డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. రెండో వ్యక్తి మాజీ ఐఎఎస్ అధికారి, ఒకపుడు రెండు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేసిన పి వెంకట్రామిరెడ్డి. వీళ్లిద్దరికి తెలంగాణ ఉద్యమంతో గాని, ఒక నాటి తెలంగాణ రాష్ట్రసమితిగాని సంబంధం లేదు.
టిఆర్ ఎస్ బిఆర్ ఎస్ గా మారేనాటికి ప్రవీణ్ కుమార్ బహుజనుల సామాజిక న్యాయం కోసం పేరుతో బిఎస్ పి పార్టీలో చేరారు. అపుడాయన బిఆర్ ఎస్ బహుజనుల శత్రు పక్షంగా చూశారు. దీనికి విరుగుడు బహుజన్ సమాజ్ పార్టీ అన్నారు. అప్పటి నుంచి ఆ పార్టీ తరఫున భారత్ రాష్ట్ర సమితి (టిఆర్ ఎస్ కొత్త రూపం)తోె పోరాటం చేస్తున్నారు. బిఆర్ ఎస్ ను ఓడించాని పిలుపునిచ్చారు. ఆ పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు ఆయన సిర్పూర్ అసెంబ్లీ నియోవర్గంలో కోనేరు కోనప్పకు వ్యతిరేకంగా పోటీ చేశారు. కోనప్ప ఓడిపోయాడు గాని ప్రవీణ్ కుమార్ గెలవ లేదు. ఆయననే పార్టీ లో చేర్చుకుని బిఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక సర్ ప్రైజ్ సృష్టించారు. ప్రవీణ్ కుమార్ని లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు అభ్యర్థిగా ప్రకటించారు.
బిఆర్ ఎస్ నుంచి వచ్చిన మరొక సర్ ప్రైజ్ ఐఎఎస్ అధికారిన వెంకట్రామిరెడ్డని మెదక్ నియోజకవర్గానికి అభ్యర్థి అని ప్రకటించడం.
ఇటీవల జరిగిన ఓటమి అనంతరం బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీలోకి వలస పోతున్న నేపథ్యంలో గులాబీ బాస్ ‘వినూత్నం’గా ఆలోచించారు. ఈ రెండు పార్టీ టికెట్ల కేటాయింపు బీఆర్ఎస్ నేతలకు విస్మయం కలిగించింది.ఎందుకంటే, ఒకరిది పార్టీ మారిన చరిత్ర, మరొకరి పార్టీకి పని చేయని చరిత్ర. మాజీ అధికారులు రాజకీయాల్లో విజయం సాధించిన దాఖలాలు తక్కువగానే ఉన్నాయి. బిఆర్ ఎస్ పార్టీ ఇపుడు కష్టాల్లో ఉంది. చాలా మంది గెలిచిన వాళ్లు, ఓడిన వాళ్లు పార్టీ విడిచి వెళ్లిపోతున్నారు. మిగిలినవాళ్లలో చాలా మందికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. పోటీ చేస్తామని మొదట్లో ఉబలాటపడ్డా తర్వాత వెనక్కి వెళ్లిపోయారు. ఇలాంటి నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ ని, వెంకట్రామిరెడ్డిలను చంద్రశేఖర్ రావులే సరైన అభ్యర్థలని కెసిఆర్ భావించినట్లుంది. బిఆర్ ఎస్ పలుకుబడి తగ్గిపోతున్న సమయంలో ఈ మాజీ అధికారులు పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కుతారా?
బీఆర్ఎస్ తీర్థం తీసుకున్న బీఎస్పీ అధినేత
తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. బిఆర్ ఎస్ ఓడించందుకు ప్రవీణ్ కుమార్ చాలా ఉధృతంగా ప్రచారం చేశారు. కెసిఆర్ ని, ఆయన కుటుంబ అవినీతి ఏకిపారేశేవారు. ముఖ్యంగా టిఎస్ పిఎస్ గ్రూప్ వన్ పశ్నా పత్రం లీక్ యినపుడు ఆయన కెసిఆర్ కుమారుడు , మునిసిపల్, ఐటి మంత్రి కెటిఆర్ మీద సాగించిన పోరాటం అంతా ఇంతాకాదు. రాజకీయ ప్రక్షాళన అన్నారు. కుటంబపాలన పోవాలన్నారు. అవినీతి అంతం అన్నారు. ఇపుడు ఆయన అదే బిఆర్ ఎస్ లో చేరి పోయి కెసిఆర్ పార్టీకి ఓటేయాలని అడగాల్సి వస్తున్నది.
తప మీద,తన కుటుంబం మీద అంతటి బద్ద వైరం తో పనిచేసిన వ్యక్తిని కూడా కెసిఆర్ తనవైపు తిప్పుకోగలగడం గొప్పవిషయమే. అయితే, ప్రజలు ఇంత తొందరగా నిప్పులు చిమ్మిన ప్రవీణ్ కుమార్ ఉపన్యాసాలను మర్చిపోగలా?
తెలంగాణ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ చాలా మంచి పేరుతెచ్చుకున్న ప్రవీణ్ కుమార్ అనూహ్యంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. బిఎస్ పితో ఆయన చేసిన రాజకీయ ప్రయోగం సక్సెస్ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక సీఎం ఎ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ పదవి ఆఫర్ చేసినా, దాన్ని నిరాకరించారని స్వయాన రేవంత్ చెప్పారు. ఓటమి ప్రవీణ్ కుమార్ చాలా పరివర్తన తీసుకువచ్చింది.
బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తుతో తాను నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని మొదట ప్రకటించారు. కానీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు బిజెపి ఇష్టం లేదని, అందువల్ల పొత్తు తెంచేయాలని తన మీద వత్తడి వచ్చిందని చెబుతూ ఏకంగా బీఆర్ఎస్ తీర్థమే స్వీకరించారు. నాగర్ కర్నూల్ ఎస్పీ రిజర్వుడ్ స్థానం నుంచి బిఆర్ ఎస్ తరఫున గెలవాలనుకుంటున్నారు.
నాగర్‌కర్నూల్ లో త్రిముఖ పోరు నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో మూడు ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలో దించాయి. దీంతో ఈ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. ఇద్దరు ఉద్ధండులైన సీనియర్ నేతలతో యువనేత ఢీకొంటున్నారు.నాగర్‌కర్నూల్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ పి రాములు బీజేపీలోకి వలస పోవడంతో ఆ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే వారు కరవయ్యారు. సిట్టింగ్ ఎంపీ రాములుతోపాటు అతని కుమారుడు పి భరత్ ప్రసాద్ బీజేపీలో చేరడంతో ఆ పార్టీ కుమారుడికి టికెట్ ఖరారు చేసింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు మల్లు రవి ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తంమీద నాగర్ కర్నూల్ ఎంపీ స్థానంలో మూడు పార్టీల అభ్యర్థుల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.
మెదక్ సర్ ప్రైజ్ వెనక ఏముంది?
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అనూహ్యంగా మాజీ ఐఎఎస్ అధికారి పి వెంకట్రాంరెడ్డిని గులాబీ బాస్ ఎన్నికల బరిలోకి దించారు. వాస్తవానికి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ ఒక్క మెదక్ మినహా అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. దీంతో మొదట మెదక్ నుంచి తానే ఎన్నికల బరిలోకి దిగి పార్లమెంటుకు వెళ్లాలని మాజీ సీఎం కేసీఆర్ భావించారని చెబుతారు. రాష్ట్రాని కుమారుడు కెటిఆర్ కు, మేనల్లుడు హరీష్ రావు కు అప్పగించి ఆయన మకాం ఢిల్లీకి మారుస్తారని భావించారు. కానీ తన కుమార్తె అయిన కవిత అరెస్ట్ కేసీఆర్ ఆలోచనను విరమించుకున్నారని చెబుతున్నారు. అయినా సరే, పార్టీ నేతలెవరూ మెదక్ లో పోటీ చేసేందుకు ముందుకు రాకపోవడం, చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ అతి ‘విధేయుడై’న ఎమ్మెల్సీగా పనిచేస్తున్న మాజీ ఐఎఎస్ అధికారి పి వెంకట్రాం రెడ్డికి మెదక్ టికెట్ ఇచ్చారు.
కేసీఆర్‌కు వీరవిధేయుడిగా పేరు...
గతంలో పి వెంకట్రాంరెడ్డి ఐఎఎస్ అధికారిగా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల కలెక్టరుగా పనిచేశారు. నాడు కలెక్టరుగా ఉండి సీఎం కేసీఆర్ కు పాదాభివందనం చేసి వార్తలకెక్కి విమర్శల పాలయ్యారు తెలుగురాష్ట్రాల చరిత్రలో ఒక ముఖ్యమంత్రికి పాదాభివందనం చేసి తొలికలెక్టర్ అయ్యారు. అనంతరం వరి పంట వేస్తే రైతు ఉరి వేసుకోవడమేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వెంకట్రాంరెడ్డి మరింత వివాదాస్పదమయ్యారు. 1996వ సంవత్సరంలో గ్రూప్ వన్ అధికారి అయిన వెంకట్రాం రెడ్డి ప్రమోషన్ మీద 2007లో ఐఎఎస్ హోదా సాధించారు. ఐఎఎస్ అధికారిగా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన విధేయతకు గుర్తింపుగా కెసిఆర్ ఎమ్మెల్సీ పదవితో సత్కరించారు.
మెదక్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్‌కు దక్కేనా?
మెదక్ జాయింట్ కలెక్టరుగా, సిద్ధిపేట కలెక్టరుగా సుదీర్ఘకాలం పనిచేసిన వెంకట్రాంరెడ్డి రిజర్వాయర్లు, రైల్వే లైన్ల నిర్మాణం కోసం భూసేకరించారు. దీంతో పాటు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కృషి చేశారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలు నిర్మించిన ఘనత ఉండటం తమ అభ్యర్థికి ఎన్నికల్లో లాభిస్తుందని బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా, కాంగ్రెస్ నేతలు దాన్ని తిప్పికొడుతున్నారు. రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల నిర్మాణం పేరిట వ్యవసాయ భూములను తీసుకొని భూ నిర్వాసితులకు అన్యాయం చేసిన మాజీ కలెక్టర్ వెంకట్రాంరెడ్డికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెపుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాధా, రమణి అనే ఇద్దరు అనాథ పిల్లల ఆలనపాలనతో పాటు పలు సామాజిక సేవాకార్యక్రమాలు చేసిన వెంకట్రాంరెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానమైన మెదక్ ను కైవసం చేసుకుంటారని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా, నిర్వాసితులకు ద్రోహం చేసిన వెంకట్రాంను తాము ఓడించి తీరుతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొత్తంమీద మెదక్ ఎంపీ స్థానంలో అభ్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా మారనుంది.