తెలంగాణ నుంచి పార్లమెంటుకు ఇద్దరు మహిళల ప్రాతినిథ్యం
x
ఎంపీలుగా ధ్రువీకరణ పత్రాలు అందుకుంటున్న కడియం కావ్య, డీకే అరుణ

తెలంగాణ నుంచి పార్లమెంటుకు ఇద్దరు మహిళల ప్రాతినిథ్యం

తెలంగాణలో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నా వారి ప్రాతినిథ్యం మాత్రం ఆశించిన విధంగా పెరగలేదు.ప్రధాన పక్షాల నుంచి ఆరుగురు మహిళలు పోటీ చేసినా ఇద్దరే గెలిచారు.


దేశంలో 18వ లోక్‌సభలో తెలంగాణ నుంచి మహిళల ప్రాతినిథ్యం పెరిగింది. 17వ పార్లమెంటులో తెలంగాణ నుంచి ఒకే మహిళా ఎంపీగా మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత ప్రాతినిథ్యం వహించారు. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓట్లతో పాటు సీట్ల సంఖ్య రెండుకు పెరిగింది.

- వరంగల్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కడియం కావ్య, మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఎంపీలుగా విజయం సాధించారు.
-
వీరిద్దరితో పాటు మొట్టమొదటి సారి తెలంగాణ నుంచి మహిళా అభ్యర్థి రేణుకాచౌదరి రాజ్యసభకు ఎంపికయ్యారు. దీంతో ముగ్గురు మహిళా మణులు పార్లమెంట్ ఉభయ సభల్లో అడుగుపెట్టనున్నారు. దీంతో ముగ్గురు మహిళా ఎంపీలు తెలంగాణలోని మహిళల సమస్యలపై గళం విప్పుతారని ఆశిస్తున్నట్లు మహిళా సంఘాల ప్రతినిధులు చెప్పారు.

డాక్టర్ కడియం కావ్య
సీనియర్ రాజకీయ వేత్త, కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజకీయ వారసురాలిగా ఆరంగ్రేటం చేసిన డాక్టర్ కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. వృత్తిరీత్యావైద్యురాలైన కావ్య గతంలో కడియం ఫౌండేషన్ ను నెలకొల్పి సేవా కార్యక్రమాలు చేశారు. బీఆర్ఎస్ టికెట్ వచ్చినా, కాదని తండ్రితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కావ్య 2,20,339 ఓట్ల మెజారిటీతో ఎంపీగా ఘనవిజయం సాధించారు. కుమార్తె కావ్య విజయం కోసం తండ్రి కడియం శ్రీహరి శ్రమించారు.

పార్లమెంటులో మొదటిసారి అడుగుపెట్టనున్న డీకే అరుణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన డీకే అరుణ మొదటిసారి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన అరుణకు 5,10,747 ఓట్లు సాధించారు.తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై డీకే అరుణ 4,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

తెలంగాణలో మహిళా ఓటర్లే అధికం
తెలంగాణలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 1,63,01,705 మంది మహిళా ఓటర్లే ఉన్నారు. మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా కేవలం ఇద్దరు మహిళలే ఎంపీలుగా విజయం సాధించారు. ఆరుగురు మహిళా అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచినా నలుగురు పరాజయం పాలయ్యారు.జనాభా ప్రాతిపదికన మహిళా ఎంపీల ప్రాతినిథ్యం ఉండటం లేదు.

ఓటమి పాలైన అతివలు
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు మహిళా అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన ఆత్రం సుగుణ, మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన సునీతా మహేందర్ రెడ్డి పరాజయం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొంపెల్లి మాధవీలత కూడా ఓటమి పాలయ్యారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మాలోతు కవిత కూడా ఓడిపోయారు. తెలంగాణలో ఆరుగురు మహిళలు పోటీ చేయగా ఇద్దరు మాత్రమే విజయం సాధించారు. నలుగురు మహిళా అభ్యర్థులు ఓటమి చవి చూశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుతో పెరగనున్న మహిళల ప్రాతినిథ్యం
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కానున్న నేపథ్యంలో భవిష్యత్తులో మహిళల ప్రాతినిథ్యం పెరగనుంది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం అంటే మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. అప్పటి దాకా తెలంగాణ నుంచి ముగ్గురు మహిళలే ఉబయ పార్లమెంటు సభల్లో ప్రాతినిథ్యం వహించనున్నారు.


Read More
Next Story