క్యాన్సర్‌కు యూపీ మంత్రి పరిష్కారం: ఆవుల చావిడిలో పడుకుంటే జబ్బు నయం!
x

క్యాన్సర్‌కు యూపీ మంత్రి పరిష్కారం: ఆవుల చావిడిలో పడుకుంటే జబ్బు నయం!

ఆవు వీపుపై నిమరటం, తట్టటంద్వారా రక్తపోటును తగ్గించుకోవచ్చని కూడా మంత్రి చెప్పారు.


ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్ గంగ్‌వర్ క్యాన్సర్ చికిత్సకు కొత్త పరిష్కారం కనుగొన్నారు. ఆవుల చావిడిని శుభ్రం చేసి, ఆ చావిట్లో పడుకుంటే క్యాన్సర్ నయం అయిపోతుందని చెప్పారు.

యూపీలోని పిలిభిత్ నియోజకవర్గంలో ఒక గోశాలను ప్రారంభిస్తూ మంత్రి ఇలా వ్యాఖ్యానించినట్లు పలు జాతీయ దినపత్రికలలో ఇవాళ వార్తలు వచ్చాయి. ఆవు వీపుపై నిమరటం, తట్టటంద్వారా రక్తపోటును తగ్గించుకోవచ్చని కూడా చెప్పారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇలా చేసి ఆ ఆవుకు సేవ చేసుకుంటే రక్తపోటు గణనీయంగా తగ్గిపోతుందని అన్నారు. ఇలా చేయకముందు బీపీకి 20 మి.గ్రా. డోస్ వేసుకుంటే, చేసిన తర్వాత 10 మి.గ్రా. సరిపోతుందని చెప్పారు.

ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చటంద్వారా దోమలు పారిపోతాయని అన్నారు. ఆవునుంచి వచ్చే ప్రతిదీ ఏదో ఒక రకంగా ఉపయోగకరమని చెప్పారు. పశువులు పొలాలలోకి దిగి మేసినా ఫిర్యాదు చేయకూడదని, అలా చేయటం ఆవుల పట్ల గౌరవం లేకపోవటమని అన్నారు. మనం తల్లికి సేవ చేయటంలేదు కనుక, తల్లి మనకు ఏదో ఒక రకంగా చెడు చేస్తోందని చెప్పారు. వివాహ వార్షికోత్సవాలు ఆవుల చావిడిలో చేసుకోవాలని అన్నారు. ముస్లిమ్‌లు ఈద్ రోజున సేమియాను ఆవుపాలతో చేసుకోవాలని మంత్రి సలహా ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలోనూ, ప్రతి మున్సిపాలిటీలోనూ గోశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

గంగ్‌వర్ మొదట బీఎస్‌పీలో ఉండేవారు, 2012లో ఆ పార్టీనుంచి పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరి 2017లో పిలిభిత్ నియోజకవర్గంనుంచి పోటీచేసి గెలిచారు. 2022లో కూడా అదే సీటునుంచి గెలిచి మంత్రి అయ్యారు.

Read More
Next Story