ప్రేమికులకు మధుర స్మృతులు మిగిల్చే ‘వాలెంటైన్స్ డే’
x
Valentines Day (Photo Credit : Facebook)

ప్రేమికులకు మధుర స్మృతులు మిగిల్చే ‘వాలెంటైన్స్ డే’

వాలెంటైన్స్ డే...ప్రతి ఏటా జరుపుకునే ఈ వేడుక ప్రేమికులకు మర్చిపోలేని మధుర స్మృతులను మిగల్చనుంది. హైదరాబాద్ నగరంలో ఈ సారి ఈ ప్రేమికుల దినోత్సవాన్ని విభిన్నంగా జరుపుకునేందుకు ప్రేమజంటలు సమాయత్తం అవుతున్నాయి. ప్రేమికుల రోజు ప్రత్యేక ఈవెంట్లపై కథనం...


ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది హైదరాబాద్ నగరంలో రొమాంటిక్ డిన్నర్ల నుంచి సృజనాత్మక ఈవెంట్లు నిర్వహించేందుకు పలు హోటళ్లు, రిసార్టులు సిద్ధం అయ్యాయి. ఫిబ్రవరి 14వతేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా బుధవారం ప్రేమజంటలు, ప్రేమించి పెళ్లాడిన దంపతులు పలు వినూత్న విందు వినోదాల్లో మునిగి తేలనున్నారు. దీనికోసం హైదరాబాద్ నగరంలోని హోటళ్లు,పబ్‌లు, బేకరీలను ముస్తాబు చేశారు. హైదరాబాద్ నగరం ప్రేమికులకు జీవితాంతం గుర్తుండి పోయేలా చేసే వేడుకలకు నిలయంగా మారింది. హైదరాబాద్ నగరంతోపాటు బృందావనం, బెంగళూరు ప్రేమికుల కలయికకు కేంద్రాలుగా నిలిచాయి. ఈ సారి ప్రేమికుల దినోత్సవాన్ని విభిన్నంగా రూపొందించామని హైదరాబాద్ నగరానికి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు శ్నీనివాసరెడ్డి చెప్పారు.

జీవిత భాగస్వామితో ఆనందంగా గడపండి...

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మీ భాగస్వామితో కలిసి మీకు ఇష్టమైన ఏడు రకాల పనులు చేయండి అంటున్నారు ఈవెంట్ల నిర్వాహకులు. చల్లని సాయంత్రం వేళ మీ భాగస్వామితో కలిసి కూర్చొని పాప్ కార్న్ తింటూ హాయిగా గడపవచ్చు. మీ పాత జ్ఞాపకాలతో మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడం కోసం స్క్రాప్‌బుక్‌ను రూపొందించుకోవచ్చు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, మర్చిపోలేని మధుర జ్ఞాపకాలతో పుస్తకాన్ని తయారు చేసుకోవచ్చు. ఇద్దరూ కలిసి రెస్టారెంట్ కు లేదా రొమాంటిక్ లొకేషన్ కు వెళ్ల వచ్చు. లేక పోతే ఇంట్లోనే కలిసి భోజనం వండుకొని వెరైటీగా క్యాండిలైట్ డిన్నర్ చేయవచ్చు. ఒకరి కొకరు గులాబీ రేకులతో కూడిన బహుమతులను ఇచ్చి పుచ్చుకోవచ్చు అంటారు ప్రేమికులు.

స్టార్ హోటళ్లలో రొమాంటిక్ డిన్నర్

వాలెంటైన్స్ డిన్నర్‌లో భాగంగా నక్షత్రాల కింద ప్రేమికులు కలిసి రొమాంటిక్ డిన్నర్ చేసేందుకు నోవోటెల్ హెచ్‌సీసీ హోటల్ సిద్ధం చేశారు. వీనుల విందుగా మ్యూజిక్ వినిపిస్తుండగా నక్షత్రాల కింద సరస్సు తీరంలో, పచ్చని మొక్కలతో మెరిసే లాన్ పక్కన టేబుల్ ముందు జంటగా ప్రేయసీ ప్రియులు కూర్చొని వైన్ తాగి రొమాంటిక్ డిన్నర్ చేసేలా మూడు ప్యాకేజీలను హోటల్ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. లాన్ సిట్టింగ్, పూల్ సైడ్ టేబుల్ పేరిట ప్రేమికుల కోసం రొమాంటిక్ డిన్నరును ఈ సారి విభిన్నంగా అదుబాటులోకి తీసుకువచ్చారు.

ఓపెన్ ఎయిర్ సినిమా ప్రదర్శన

ప్రేమికుల దినోత్సవాన్ని మరుపురాని రోజుగా రూపొందించేందుకు ప్రేమికులకు సన్ సెట్ సినిమా క్లబ్, ది లాప్ట్ తో కలిసి ఐకానిక్ ఫిలిం ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాను ప్రదర్శించనుంది. బీన్ బ్యాగ్ సీటింగ్ తో ఏర్పాటు చేసిన ఈ సినిమా ప్రదర్శనకు వివిధ రకాల టికెట్లను నిర్ణయించారు. ఈ సినిమాటిక్ డిలైట్ ప్రేమికులను ప్రేమ ప్రయాణంలో విహరింప చేయనుంది. లవ్ బర్డ్స్ తమ కళాత్మకతను ప్రదర్శించేందుకు వీలుగా వారి కోసం ప్రత్యేకంగా హౌస్ ఆఫ్ గౌర్మెట్‌ కుండల వర్క్ షాప్ ఏర్పాటు చేసింది. జంటలు వారి సృజనాత్మకతతో కుండలు తయారు చేసి వారి జ్ఞాపకాలను మదిలో దాచుకోవచ్చు.

రోమియో అండ్ జూలియట్ పార్టీ

నాటి ప్రేయసీ, ప్రియులైన రోమియో, జూలియట్ పార్టీ పేరిట జూబ్లీహిల్స్ లోని లా కుపులా క్యాండిల్ లైట్ డిన్నరును అందిస్తోంది. రాత్రి 7 గంటల నుంచి ప్రేమ జంటలు లైవ్ మ్యూజిక్, షాంపైన్ , థీమ్ మాస్కులు, గుండె ఆకారంలోని కేకులతో సందడి చేయనున్నాయి. లవర్స్ కోసం వినోద భరిత సమ్మేళనం కోసం ఎఫ్ హౌస్ సిప్ అండ్ సోషలైజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. నియాన్ పెయింటింగ్, స్పిన్ ది వీల్, ఫేస్ పెయింటింగ్, క్యాండిల్ లైట్ డిన్నర్ వరకు ఏర్పాటు చేశారు.

ఎన్నెన్నో వినూత్న ఈవెంట్లు...

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పలు హోటళ్లు వినూత్న కార్యక్రమాలను ప్రేమికులను అలరించేందుకు సిద్ధమయ్యారు. హార్డ్ రాక్ కేఫ్ లో కిస్ డే స్పెషల్ పేరిట కార్యక్రామాన్ని ఏర్పాటు చేశారు. ద పార్కు హోటల్ లో స్టార్స్ అండ్ హార్ట్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. రాడిసన్ హోటల్ లో వాలంటైన్స్ డిలైట్ వేడుక చేపట్టారు. ద స్ట్రీట్ లో మూన్ లిట్ వాలంటైన్స్ ఏర్పాటు చేశారు. జెగాలో షేర్ ద లవ్ పేరిట ప్రేమికుల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనున్నారు.

జీవితాంతం గుర్తుండి పోయేలా వేడుకలు

వాలెంటైన్స్ వేడుకలు జీవితాంతం గుర్తుండి పోయేలా జరుపుకోవాలని ప్రేమ జంటలు భావిస్తుంటాయి. తాము ఈ వేడుకను వైభవంగా నిర్వహించుకుంటామని ఓ ప్రేమ జంట పేర్కొంది. సంపన్నమైన తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్‌లో బస చేసి రొమాంటిక్ డిన్నర్ చేయవచ్చు. 100 అడుగుల రెస్టారెంట్ మినార్ లో విభిన్న వంటకాల రుచులను ఆస్వాదించవచ్చు.జ్యువెల్ ఆఫ్ నిజాం 100 అడుగుల రెస్టారెంట్ లో గండిపేట సరస్సు అందాలు, ఉస్మాన్ సాగర్ విశాల దృశ్యాలను చూస్తూ నిజామీ వంటకాల రుచులను ఆస్వాదించవచ్చు.ఈ రెస్టారెంట్ అతిథులకు రాయల్ కిచెన్ నుంచి సువాసనగల బిర్యానీలు, రసవంతమైన కబాబ్‌లతో సహా నిజామీ వంటకాల ఘుమఘుమలు, రుచులను ఆస్వాదించే అవకాశాన్ని అందిస్తుంది.

చౌమహల్లా ప్యాలెస్ లో ఈవెంట్

18వ శతాబ్దంలో నిర్మించిన చౌమహల్లా ప్యాలెస్ 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంగణాలు, గ్రాండ్ ఖిల్వత్, ఫౌంటైన్‌లు,ఉద్యానవనాలతో కళకళ లాడుతోంది. టేబుల్‌పై క్యాండిల్‌లైట్ ఫ్లోరల్ డెకర్, కేక్ కటింగ్, మెరిసే వైన్, ఇంటరాక్టివ్ కౌంటర్‌లతో విలాసవంతమైన బఫే, జంటల కోసం సెల్ఫీ బూత్, జంటల కోసం సరదా కార్యకలాపాలు ఏర్పాటు చేశారు.చార్మినార్ సమీపంలోని లాడ్ బజార్ నుంచి కొన్ని అందమైన బ్యాంగిల్స్‌ కొనిచ్చి మీ భాగస్వామిని ఎందుకు ఆశ్చర్యపర్చవచ్చు. దుర్గంచెరువు సరస్సు వద్ద పడవ ప్రయాణం, సూర్యాస్తమయ సమయంలో ఆనందదాయకమైన అనుభవం కోసం బోట్ రైడ్‌ను ఆస్వాదించవచ్చు.ఈ వాలెంటైన్స్ డేలో హైదరాబాద్‌లో జరిగే ప్రసిద్ధ నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు మీ భాగస్వామిని తీసుకెళ్లవచ్చు. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లో చిరస్మరణీయమైన క్షణాలను రూపొందించడానికి ప్రేమికులు సిద్ధం అయ్యారు.

Read More
Next Story