మోడల్ కోడ్‌కు పాతర...ఈసీ నోటీసుల జాతర
x
ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి వికాస్ రాజ్;ఇతర ఎన్నికల అధికారులు

మోడల్ కోడ్‌కు పాతర...ఈసీ నోటీసుల జాతర

తెలంగాణలో హైదరాబాద్ నగరంలోనే ఎన్నికల నియమావళి ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. దీంతో అప్రమత్తమైన నగర పోలీసులు డేగ కళ్లతో నిఘా వేసి కేసులు నమోదు చేస్తున్నారు.


హైదరాబాద్ నగరంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలపై పోలీసులు 47 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ పోలీసులు ఒక ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు సాయుధ పోలీసులు, ఒక స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, వీడియో గ్రాఫరుతో కలిపి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ను నగరంలో మోహరించి నియమావళి ఉల్లంఘనలపై నిఘా పెట్టారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ మూడు షిప్టుల్లో పనిచేసేలా రంగంలో దించారు.

స్టాటిక్ సర్విలెన్స్ బృందాలు
ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటుకు ఒక స్టాటిక్ సర్విలెన్స్ బృందాన్ని నియమించి ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై నిఘా ఉంచారు. ఈ స్టాటిక్ సర్విలెన్స్ బృందంలో ఒక ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు పోలీసులు, ఒక స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, వీడియో గ్రాఫరును నియమించారు. మూడు షిప్టుల్లో స్టాటిక్ సర్విలెన్స్ బృందాలు పనిచేస్తూ కోడ్ ఉల్లంఘనపై దృష్టి సారించాయి.
పార్లమెంట్ నియోజకవర్గానికి డీసీపీలే నోడల్ అధికారులు

హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇద్దరు డీసీపీలోను అదనపు నోడల్ అధికారులుగా నియమించారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సౌత్ జోన్ డీపీపీ, మరో డీసీపీ పర్యవేక్షిస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ఈస్ట్ జోన్ డీసీపీతో ఏసీపీ ర్యాంక్ 15 మంది సబ్ నోడల్ అధికారులను నియమించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో ఏసీపీని సబ్ నోడల్ అధికారిగా నియమించి నియమావళి ఉల్లంఘనలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
1020 మంది బైండోవర్
హైదరాబాద్ నగరంలో 457 కేసుల్లో 1020 మంది నిందితులను బైండోవర్ చేశారు. నగరంలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర ఉన్నవారు, మతచిచ్చు రగిల్చే వారిని గుర్తించి వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 1609 కేసులు నమోదు చేశారు. నగరంలో పెండింగులో ఉన్న 475 మంది ఎన్ బీ డబ్ల్యూ కేసుల్లో నిందితులను ప్రత్యేక పోలీసు బృందాలతో అరెస్ట్ చేశారు.
వాహనాల తనిఖీలు...ఫ్లాగ్ మార్చ్ లు
హైదరాబాద్ నగరంలో నగర పోలీసులు నిత్యం సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించడమే కాకుండా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. హోటళ్లు, లాడ్జీలు, రైల్వేస్టేషన్లు, బస్టాండులను పోలీసులు తనిఖీలు చేస్తూ అనుమానమున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. నగరంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రూ.16 కోట్ల నగదు, రూ.62 లక్షల విలువైన 7,370 మద్యం బాటిళ్లు, కోటి రూపాయల డ్రగ్స్, రూ. 13 కోట్ల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాల పహరా
హైదరాబాద్ నగర పరిధిలో 4,027 పోలింగ్ కేంద్రాలుండగా, వీటిలో 1046 కేంద్రాలను సమస్యాత్మకమైనవని హైదరాబాద్ నగర పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. సెన్సిటివ్, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు కోసం కేంద్ర పారామిలటరీ బలగాలను రంగంలో దించారు.
ఈటెల వైరల్ వీడియోపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
మల్కాజిగిరి ఓటర్లు డబ్బు, మద్యానికి ప్రభావితం కావచ్చు అని ఈటెల రాజేందర్ చెప్పినట్లు ఉన్న మార్ఫింగ్ వీడియోపై మల్కాజిగిరి బీజేపీ నేతలు ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. ఈ మార్ఫింగ్ వీడియోను వైరల్ చేయడానికి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి కారణమంటూ బీజేపీ నేతలు ఎన్ రామచందర్ రావు, గోకుల రామారావు ఈసీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా జరుగుతున్న మార్ఫింగ్ వీడియోల ప్రచారంపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు.
మోదీ కోడ్ ఉల్లంఘనపై టీపీసీసీ ఫిర్యాదు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కర్ గోనెలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో మోదీ ఫొటో పట్టుకొని చిన్న పిల్లలు ప్రచారంలో పాల్గొన్నారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని నిరంజన్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
జేపీ నడ్డాకు పోలీసుల నోటీసులు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాలవ్యలు ఎస్సీ, ఎస్టీలను కించపరుస్తూ కర్ణాటక బీజేపీ ట్వీట్ చేసిందని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై బెంగళూరు పోలీసులు జేపీ నడ్డా, అమిత్ మాలవ్యలకు నోటీసులు జారీ చేశారు.
అసదుద్దీన్ ఒవైసీపై మాధవీలత ఫిర్యాదు
హైదరాబాద్ మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని మాధవీలత ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
మోత్కుపల్లిపై ఫిర్యాదు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి నర్సింహులుపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తో కూడిన ప్రతినిధి బృందం మలక్ పేట పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేసింది. సీఎంను ఏక వచనంతో పిలిచి కార్యకర్తల మనోభావాన్ని దెబ్బతీసిన మోత్కుపల్లిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కాంగ్రెస్ నేతలు కోరారు.
అద్దంకి దయాకర్ పై కేసు
ఆదిలాబాద్ కాంగ్రెస్ సభలో బీజేపీ నేతలు హిందువులం అంటున్నారు...వారికి రాముడు చిన్నయనా, సీత మీ చిన్నమ్మనా అని కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ బీజేపీ నేతలపై వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ నేతలు నిర్మల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అద్దంకి దయాకర్ పై కేసు నమోదు చేశారు.
ప్రచార వ్యయంపై ఈసీ దృష్టి
ఎన్నికల ప్రచార వ్యయంపై ఎన్నికల కమిషన్ అధికారులు దృష్టి సారించారు. ఈసీ అనుమతి లేకుండా చేస్తున్న సోషల్ మీడియా ప్రచారం, ఐవీఆర్ఎస్ కాల్స్ ప్రచారంపై అధికారులు నిఘావేసి సమాచారాన్ని సేకరిస్తున్నారు. సోషల్ మీడియా ప్రచార వ్యయాన్ని అభ్యర్థుల వ్యయజాబితాలో చేరుస్తామని అధికారులు చెప్పారు. ప్రచారం కోసం యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ పత్రికలతో ఒప్పందాలు చేసుకొని ప్రచారం సాగిస్తున్నారు. ఆర్థిక బలం, అంగబలం ఉన్న పార్లమెంట్ అభ్యర్థులు ప్రచారానికి కోట్ల రూపాయలు వెదజల్లుతుండగా వారి వ్యయ నివేదికల్లో మాత్రం వేల రూపాయల ఖర్చులే కనిపిస్తున్నాయి.
మూడంచెల భద్రతా ఏర్పాట్లు : హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి
పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. డి ఆర్ సి, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్ ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు, మే 11 వతేదీ సాయంత్రం 6:00 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం విధించామని ఆయన తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని సీపీ శ్రీనివాసరెడ్డి వివరించారు.


Read More
Next Story