హైడ్రాకు చిక్కిన  VIP ఫామ్ హౌస్..కూలుతుందా, నిలబడుతుందా?
x
జన్వాడలోని విలాసవంతమైన ఫాం హౌస్

హైడ్రాకు చిక్కిన VIP ఫామ్ హౌస్..కూలుతుందా, నిలబడుతుందా?

జన్వాడ ఫాం హౌస్ వ్యవహారం మరోసారి వార్లల్లోకి ఎక్కింది. జన్వాడ ఫాం హౌస్ కూల్చివేతకు హైడ్రా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.


హైదరాబాద్ మహానగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమణలను తొలగించేందుకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వరుస కూల్చివేతలతో గడగడలాడిస్తున్న నేపథ్యంలో బుధవారం ఓ బిల్డర్ హైడ్రాపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనం రేపింది. రేపటివరకు ఈ ఫాం హౌస్ ను కూల్చివేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది.


జన్వాడ ఫాం హౌస్ కూల్చొద్దంటూ బిల్డర్ పిల్
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామ పంచాయతీ పరిధిలోని పాత సర్వే నంబరు 311 పార్ట్ (కొత్త సర్వే నంబరు 311/7) పరిధిలోని 1210 చదరపు అడుగుల భూమిలో 3,895.12 చదరపు అడుగల గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ లలో నిర్మించిన ఫాం హౌస్ ను కూల్చవద్దంటూ జూబ్లీహిల్స్ కు చెందిన బిల్డర్ బద్వేలు ప్రదీప్ రెడ్డి హైకోర్టులో 22,894 నంబరుతో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కమిషనర్,హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజినీరు, రంగారెడ్డి జిల్లా కలెక్టరు, శంకరపల్లి ఎమ్మార్వోలను ప్రతివాదులుగా చేస్తూ ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బిల్డరు తరపున న్యాయవాదులు శ్రీకాంత్ హరిహరన్, జి రామకృష్ణ వాదనలు వినిపించనున్నారు.

మళ్లీ వివాదంలో జన్వాడ విలాసవంతమైన ఫాంహౌస్
జన్వాడలోని విలాసవంతమైన ఫాంహౌస్ మళ్లీ వివాదంలో చిక్కుకుంది.ఈ ఫాం హౌస్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కీలక నాయకుడి బినామీ ప్రాపర్టీ అనే ఆరోపణలున్నాయి గతంలో ఈ ఫాం హౌస్ పై రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. మళ్లీ 311 జీఓను ఉల్లంఘించి, అక్రమంగా ఫాంహౌస్ నిర్మించారని తేలింది. సత్యం రామలింగరాజుకు చెందిన ఈ జన్వాడ భూములు వరుసగా చేతులు మారి చివరికి బద్వేలు ప్రదీప్ రెడ్డి చేతికి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఫాంహౌస్ లో గత ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి లీజుకు తీసుకొని అందులో నివాసముంటున్నారని గతంలో సాక్షాత్తూ బాల్క సుమన్ చెప్పారు. ఫాంహౌస్ పక్కనే ఉన్న 301 సర్వేనంబరులోని భూమిని కేటీఆర్ భార్య శైలిమ కొన్నారు.బడా నేత ఉంటున్న ఈ ఫాం హౌస్‌కు ప్రభుత్వం రోడ్డు నిర్మించింది. నిర్మాణ అనుమతులు తీసుకోకుండా ఫాం హౌస్ నిర్మించారు. ఫాంహౌస్ చుట్టూ ఉన్న భూములను కూడా కొందరు కొనుగోలు చేశారు.

జన్వాడ ఫాంహౌస్ కు అనుమతి ఉంది...
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామంలోని పాత సర్వే నంబరు 311 పార్ట్ లోని 1210 చదరపు అడుగుల భూమిని తాను డీ అండ్ యూ రియాల్టీ వెంచర్ నుంచి 2019 సెప్టెంబరు 11వతేదీన కొనుగోలు చేసి డాక్యుమెంట్ నంబరు 10389 తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని బిల్డర్ ప్రదీప్ రెడ్డి హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. బిల్డరు జన్వాడ గ్రామ పంచాయతీ నుంచి 2014 సెప్టెంబరు 12వతేదీన బిల్డర్ అనుమతి తీసుకొని ఫాం హౌస్ నిర్మించారని ప్రదీప్ రెడ్డి తెలిపారు.

ఫాంహౌస్ పక్కన భూమిని కొన్నా...
ఫాం హౌస్ ఆనుకొని ఉన్న సర్వే నంబరు 311/7 సర్వేనంబరులోని 3.30 గుంటల భూమిని కూడా తాను కొన్నానని ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. ఫాంహౌస్ లో తాను నివాసముంటున్నానని, తాను కరెంటు బిల్లులు కూడా చెల్లిస్తున్నానని చెప్పారు. తన ఫాం హౌస్ కు ప్రతి ఏటా ఆస్తి పన్నును కూడా మీర్జాగూడ పంచాయతీకి అసెస్ మెంట్ నంబరు 297 నంబరుతో చెల్లిస్తున్నానని ప్రదీప్ చెప్పారు.

ఉస్మాన్ సాగర్ ఎఫ్ టీఎల్ పరిధిలో లేదు...
జన్వాడలోని తన ఫాం హౌస్, ఖాళీ స్థలం ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ లో కానీ ఉస్మాన్ సాగర్ బఫర్ జోన్ లో కానీ లేదని ప్రదీప్ రెడ్డి హైకోర్టు పిటిషనులో పేర్కొన్నారు. ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ సరిహద్దుకు 30 మీటర్ల దూరంలో ఉందని ఆయన తెలిపారు.

రాజకీయ దురుద్ధేశంతోనే...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన ఫాంహౌస్ ను కూల్చేందుకు యత్నిస్తున్నారని ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. తాను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ నేతతో తనకు రాజకీయంగా సంబంధాలున్నాయనే ఆరోపణతో తన ఫాంహౌస్ ను ఉద్ధేశపూర్వకంగా కూల్చాలని చూస్తున్నారని ప్రదీప్ రెడ్డి చెప్పారు. సేల్ డీడ్, ఇంటిపన్ను రసీదు, ప్లాన్ కాపీ, గూగుల్ మ్యాప్, లేఅవుట్ కాపీ, హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎన్ ఓసీ లేఖను పిటిషనుకు జత చేశారు.

కట్టడాల పై హైడ్రా కొరడా
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా, ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కమిషనరుగా ఉన్న హైడ్రా చెరువు శిఖం భూములు, బఫర్ జోన్లలో వెలిసిన కట్టడాలను కూల్చేస్తోంది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాల పై హైడ్రా కొరడా ఝుళిపిస్తుంది. జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉండటంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని ప్రదీప్ రెడ్డి హైకోర్టులో ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. తమ ఫాం హౌస్ ను హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని హైకోర్ట్ లో ప్రదీప్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఏం తీర్పు చెబుతుందో వేచిచూడాల్సిందే.

నిషేధిత జాబితాలో జన్వాడ భూములు
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలోని పలు సర్వే నంబర్లలోని భూములను తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత జాబితాలో ఉంచింది.జన్వాడ గ్రామంలోని పలు సర్వే నంబర్లలోని పోరంబోకు, భూదాన్, సీలింగ్ మిగులు, చెరువు శిఖం, ఎండోమెంట్ భూముల క్రయ విక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత జాబితాలో చేర్చారు. జన్వాడ గ్రామంలోని భూములపై హైకోర్టులో కేసులు విచారణలో ఉన్నాయి.


Read More
Next Story