చంద్రబాబులో కొట్టొచ్చినట్లు కనబడుతున్న మార్పు!
x

చంద్రబాబులో కొట్టొచ్చినట్లు కనబడుతున్న మార్పు!

చంద్రబాబు ముఖంలో మళ్ళీ మునుపటి కళ వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖంలో మార్పు స్పష్టంగా కనబడుతోంది. ఉత్సాహం, ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నాయి.


చంద్రబాబును కొద్ది రోజులుగా గమనిస్తే ఒక మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ముఖంలో కొత్త కళ కనబడుతోంది. ఉత్సాహం, ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నాయి.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న పరాభవాలు, చేదు అనుభవాల వలనగానీ, 52 రోజుల జైలు జీవితాన్ని గడపవలసి రావటం వలనగానీ, చంద్రబాబు నాయుడు బాగా నలిగిపోయినట్లు ఆ కాలంలో ఆయనను చూసిన ఎవరికైనా అర్థమయింది. ముఖ్యంగా గత అక్టోబర్ 31న జైలునుంచి విడుదలయిన తర్వాత చూస్తే ముఖం బాగా కళ తప్పింది. అయితే గమనించాల్సింది ఏమిటంటే, ఆయన మానసికంగా లోలోపల ఎలాంటి మూడ్‌లో ఉన్నా కూడా, అవిశ్రాంతంగా పని చేశారు. ప్రచారం సమయంలో ఎండలు మండిపోతున్నాకూడా రోజుకు ఐదారు బహిరంగ సభలలో పాల్గొని ప్రజానీకాన్ని ఉద్దేశించి ఉపన్యసించారు. తన వాదనను బలంగా వినిపించారు. బాబులోని ఆ హార్డ్ వర్కింగ్ గుణాన్ని… ఆయనను తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఒకవైపు బాబుతో పోలిస్తే కుర్రవాడు అయిన జగన్ రోజుకు రెండు మూడు సభలతో సరిపెడితే, బాబు అంత తీవ్రంగా కష్టపడటాన్ని ఏపీ ప్రజలు అందరూ గమనించారు. 74 ఏళ్ళ వయసులో కూడా అంత కష్టపడే ఆ లక్షణం కూడా ఓటర్లలో ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగించి ఉంటుందనటంలో ఏమాత్రం సందేహం లేదు.

అయితే, తమ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు నెల, నెలా పదిహేను రోజులు బాబు ముఖంలో మార్పు ఏమీ లేదు. ఐదేళ్ళపాటు అధికారానికి దూరంగా ఉండటంతో, తనకు తిరిగి అధికారం వచ్చిన విషయాన్ని జీర్ణించుకోవటానికి ఆయనకు అంత సమయం పట్టినట్లుంది. అయితే పది రోజులుగా మాత్రం పరిస్థితి మారింది. చంద్రబాబు ముఖం తేటగా కనబడుతోంది. మళ్ళీ మునుపటి కళ వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఆ మార్పు స్పష్టంగా కనబడుతోంది.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా ఇలాగే అధికారంలోకి రాగానే అప్పటిదాకా ఉన్న అనారోగ్యాలు, ఆరోగ్య సమస్యలు అన్నీ పోయి కొత్త ఉత్సాహంతో, కొత్త ఆత్మవిశ్వాసంతో ఐదేళ్ళపాటు ప్రధానమంత్రి పదవిని విజయవంతంగా నిర్వహించటమే కాకుండా అపర చాణుక్యుడు అని పేరు తెచ్చుకోవటం తెలుగువారు అందరికీ తెలిసిన విషయమే. అధికారంలోని 'పవర్', కిక్ చూపించే ప్రభావం అదే. చంద్రబాబులో కూడా ఆ పవర్ ప్రభావం ఈ కొత్త మార్పులకు కారణమయినట్లుంది.

జైలు జీవితం గడిపినవారిలో చాలామందికి స్వేచ్ఛ అర్థం తెలిసిరావటంతో, తదనంతరకాలంలో గణనీయమైన మార్పు వస్తుందని చెబుతుంటారు. చంద్రబాబుపై కూడా జైలు జీవితం ప్రభావం చూపినట్లే కనబడుతోంది. ఆయన వ్యవహారశైలిలో స్పష్టమైన మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. సభలలోగానీ, ఫంక్షన్‌లలోగానీ తన కాళ్ళకు నమస్కరించవద్దని బాబు స్పష్టంగా చెప్పారు. కేవలం దేముడికి, తల్లిదండ్రులకు, గురువుకు మాత్రమే కాళ్ళకు నమస్కరించాలని అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలపై మాట్లాడుతూ, తనను జైలుకు పంపారని, తాను కూడా కక్ష సాధింపు చేయాలనుకుంటే చేయగలనని చెప్పారు. అయితే తాము అలా చేయాలనుకోవటంలేదని అన్నారు. ఎమ్మెల్యేలు కూడా అలాగే నడుచుకోవాలని అన్నారు. మరోవైపు, ఆ మధ్య వాహనంలో ప్రయాణిస్తూ కూడా కరకట్టపై తనకోసం వేచి ఉన్న సందర్శకులలో మాజీ ఎమ్మెల్యే భార్య ఉండటాన్ని గమనించి, ఆమెను దగ్గరకు పిలిపించుకుని, సమస్య తెలుసుకోవటం కూడా అందరి ప్రశంశలనూ గెలుచుకుంది.

అయితే చంద్రబాబులో ఈ మార్పు కేవలం తాత్కాలికమేనా, కడదాకా ఉంటుందా అనేది చూడాలి. గతంలో 2014-19లో లాగా కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మ కాకుండా నిజాయతీగా అభివృద్ధికి కృషి చేస్తారో, లేదో వేచి చూడాలి. 2019లో ఫలితాలు వచ్చిన కొత్తలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే సుద్దపూసలాగా మాట్లాడారు. రానురానూ ప్రజలకు, మీడియాకు దూరమయ్యి "నన్ను అంటుకోకు నా మాలకాకి" లాగా మారిపోయి అధికారానికే దూరమైపోయారు.

Read More
Next Story