తెలంగాణలో ఓట్ల రికార్డులు...
తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల ఆధిక్యతలో పలువురు అభ్యర్థులు రికార్డులు నెలకొల్పుతున్నారు.రౌండ్ రౌండుకు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్ల ఆధిక్యత పెరిగింది.
తెలంగాణలోని కాంగ్రెస్ కంచుకోటలైన పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు లక్షలాది ఓట్ల ఆధిక్యతతో విజయం వైపు దూసుకుపోతున్నారు. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుపై 3,24,651 ఓట్ల ఆధిక్యతతో ముందుకు సాగుతున్నారు. రౌండ్ రౌండుకు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ పెరుగుతోంది. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ముందుండి కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డిని విజయం దిశగా నడిపించారు. ఎంపీ ఎన్నికల్లో స్థానికేతరుడైన రఘురామిరెడ్డికి 3.24 లక్షలకు పైగా మెజారిటీలో దూసుకుపోతుండటంతో రికార్డు నెలకొల్పనట్లయింది.
కాంగ్రెస్ కంచుకోటలో...
కాంగ్రెస్ పార్టీకి మరో కంచుకోట అయిన నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి 3,77,941 ఓట్ల ఆధిక్యంతో ముందున్నారు. మరో కంచుకోట అయిన మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 2,24,429 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 1,20,630 ఓట్ల ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు.
వరంగల్ కోటలో...
వరంగల్ కోట నుంచి బరిలో నిలిచిన డాక్టర్ కడియం కావ్య 1,23,099 ఓట్ల ఆధిక్యంతో ముందున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయపథంలో దూసుకుపోతున్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో తమ సమీప ప్రత్యర్థుల కంటే భారీ మెజారిటీతో విజయం వైపు దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థులకు అంత మెజారిటీ మాత్రం రావడం లేదు. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 69,050 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. జహీరాబాద్ లో సురేశ్ షెట్కార్ 16,228 ఓట్ల ముందంజలో ఉన్నారు. మొత్తం మీద భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులు దూసుకుపోతుండటం సీఎం రేవంత్ పానలకు అనుకూలమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.