వెల్లివిరిసిన ఓటర్ల చైతన్యం...రెండు గ్రామాల్లో వంద శాతం పోలింగ్
x
Chinna Kolwai Voters

వెల్లివిరిసిన ఓటర్ల చైతన్యం...రెండు గ్రామాల్లో వంద శాతం పోలింగ్

తెలంగాణలోని రెండు గ్రామాల్లోని ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. చిన్నకొల్వాయి, ఆదర్శతండా గ్రామాల ఓటర్లు వందశాతం ఓట్లు వేసి ఆదర్శంగా నిలిచారు.


పోలింగ్ డే సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించినా, నగరవాసులు ఓటేసేందుకు ముందుకు రాని ప్రస్థుత పరిస్థితుల్లో ఆ రెండు గ్రామాల్లో చైతన్యం వెల్లివిరిసింది.

- తెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం చిన్నకొల్వాయి,మెదక్‌ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేటతండా గ్రామాల్లో వంద శాతం పోలింగ్ జరిగింది.
- సోమవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం చిన్నకొల్వాయిలో 100 శాతం పోలింగ్‌ నమోదై తెలంగాణలోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం చిన్నకొల్వాయిలో 100 శాతం పోలింగ్‌ నమోదైంది.

జగిత్యాల జిల్లా కలెక్టర్ అభినందన
చిన్నకొల్వాయి గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా అందరూ ఓటేశారు. వంద శాతం ఓటింగు కోసం కృషి చేసిన సెక్టోరల్‌ ఆఫీసర్‌ చక్రు నాయక్‌, గ్రామ పంచాయతీ కార్యదర్శి ముద్దం విజయ, బీఎల్వో యశోద, రూట్‌ అధికారి రాజ్‌కుమార్‌ను జగిత్యాల జిల్లా కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అభినందించారు.

ఆదర్శ తండా సంగాయిపేట

మెదక్‌ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేటతండాలోని అదనపు పోలింగ్‌ కేంద్రంలోనూ వంద శాతం పోలింగ్‌ జరిగింది. సంగాయిపేటతండా 62ఏ అదనపు పోలింగ్‌ కేంద్రం పరిధిలో 210 మంది ఓటర్లు ఉండగా అంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో చాలా మంది నిరక్ష్యరాలైనప్పటికీ చైతన్యంతో ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఎన్నికల బహిష్కరణ అస్త్రం : ఖమ్మం,నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొన్ని గ్రామాలు తమ సమస్యల ఫరిష్కారానికి ఎన్నికల బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించారు. ఎన్నికలను బహిష్కరిస్తామంటూ బెదిరించిన గ్రామస్థులను రెవెన్యూ,పోలీసు అధికారులు ఒప్పించి, ఎట్టకేలకు వారితో ఓటు వేయించారు.
వంతెన నిర్మించాలని కోరుతూ...
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారం గ్రామంలో ప్రవహిస్తున్న ఎన్ఎస్పీ కాల్వపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు తాము ఓటేసేది లేదని ప్రకటించారు. తమ గ్రామం నుంచి ప్రవహించే ఎన్ఎస్‌పీ కాల్వపై శాశ్వత వంతెన నిర్మించాలని చాలాకాలంగా అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కాలువపై వంతెన నిర్మించకపోవడంతో తమ వ్యవసాయ భూములకు రాలేకపోతున్నామని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట ఓటేసేందుకు ఒక్క ఓటరు కూడా పోలింగ్ బూత్‌కు వెళ్లలేదు. దీంతో సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు గ్రామానికి వచ్చారు. ఎంఆర్‌ఓ శేషగిరిరావు, ఎంపీడీఓ రమేష్‌, ఎస్‌ఐ రవికుమార్‌ ఎన్నికల అనంతరం గ్రామ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్థానికులు పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటు వేశారు.

ప్రశాంతినగర్ గ్రామంలో...
జిల్లాలోని చుంచుపల్లి మండలం ప్రశాంతినగర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని గరిమెళ్లపాడు ఆవాస నిర్వాసితులు లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించడంతో పోలీసు, రెవెన్యూ, ఎన్నికల అధికారులు గ్రామంలో పర్యటించి సమస్యను పరిశీలించారు.తమ సమస్యలను పరిష్కరించకుండా అధికారులు, ప్రభుత్వ పాలకులు మోసం చేశారిని, ఎన్నికల్లో ఓటు వేయబోమని ఆవాసానికి చెందిన కొందరు ఆదివాసీలు కొద్దిరోజుల క్రితం కొత్తగూడెం-విజయవాడ హైవేపై కరెంటు స్తంభంపై ఫ్లెక్సీని ప్రదర్శించారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహెమాన్, ఆర్డీఓ మధు ప్రజలతో మాట్లాడి వారు ఎన్నికల్లో ఓటేసేలా ఒప్పించారు.

బోరిగాం గ్రామానికి రోడ్డు కోసం...
కాగజ్ నగర్ మండలం బోరిగాం గ్రామానికి రోడ్డు కోసం గ్రామస్థులు ఎన్నికల బహిష్కరణ అస్త్రం ప్రయోగించారు. ఎన్నికలను బహిష్కరిస్తున్నారనే సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి బోరిగాం గ్రామానికి వచ్చి మీ గ్రామానికి రోడ్డు నిర్మిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్కతో ఫోనులో హామీ ఇప్పించారు. దీంతో తాము ఎన్నికల్లో ఓటేశామని బోరిగాం గ్రామానికి చెందిన రావి శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఓట్లేసిన రాజారం గ్రామస్థులు...
తమ గ్రామ సమస్యలు పరిష్కరించే వరకు ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పిన రాజారం గ్రామస్థులు అధికారుల హామీతో ఎట్టకేలకు ఓట్లు వేశారు. కోటపల్లి మండలం రాజారాం గ్రామానికి చెందిన ఓటర్లు ఎన్నికల బహిష్కరిస్తామని ప్రకటించారు. మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టరు, ఏసీపీలు గ్రామానికి వచ్చి ఎన్నికల తర్వాత గ్రామానికి రోడ్డు నిర్మింపజేస్తామని హామి ఇచ్చారు. దీంతో తాము పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓట్లు వేశామని రాజారం గ్రామ రైతు కొప్పుల సత్యనారాయణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

గోవెన గ్రామస్థుల సమస్యల పరిష్కారం కోసం...
తిర్యాణి మండలం గోవెన గ్రామస్థులు తమ సమస్యలు పరిష్కరించే దాకా ఎన్నికల్లో ఓట్లు వేసేది లేదని మొదట ప్రకటించారు. ఈ మేర కలెక్టరుకు కూడా వినతిపత్రాన్ని సమర్పించారు. దీంతో అధికారులు వచ్చి, గ్రామసమస్యలను తీరుస్తామని హామి ఇవ్వడంతో ఓట్లు వేశారు. గ్రామంలో 138 ఓట్లు ఉండగా 113 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ఓటింగుకు కొన్ని గ్రామాలు దూరం
తమ సమస్యలను పరిష్కరించలేదనే కోపంతో పలు గ్రామాల ప్రజలు సోమవారం పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయలేదు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని బల్మూర్ మండలం మైలారం గ్రామస్థులు కొందరు మైనింగుకు అనుమతి ఇచ్చినందుకు నిరసనగా ఓట్లు వేయలేదు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని అమరగిరిలో తాగునీరు, విద్యుత్‌, రహదారుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ చెంచు గిరిజనులు ఓట్లు వేయకుండా నిరసన తెలిపారు.నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి పరిధిలోని రామ్‌సాగర్ తండా వాసులు ఎన్నికలను బహిష్కరించారు.

తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ...
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కలలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు పోలింగ్ రోజే ధర్నాచేశారు.తమకు ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని గతంలో చెప్పినా అధికారులు వినిపించుకోకపోవడంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తండావాసులు రోడ్డుపై బైఠాయించారు. కొత్తూరు తహసీల్దార్ రవీందర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి గ్రామానికి వచ్చి తండావాసులతో మాట్లాడి వారితో ఓట్లు వేయించారు.


Read More
Next Story